Skip to main content

విదేశీ విద్యకు...విలువైన పరీక్షలు

'English is a window to see the world'.. ఈ ఒక్క వాక్యం చాలు ఇంగ్లిష్ ప్రాధాన్యం ఏంటో చెప్పడానికి! అమ్మ భాష అందరికీ అవసరమే! కానీ, నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే మాత్రం ఇంగ్లిష్ తప్పనిసరి.
 ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయ యువత ముందుండటానికి కారణం.. మన విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు ఉండటమే అనేది నిస్సందేహం! అంతేకాదు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందాలన్నా.. ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువు కోవాలనుకునే విద్యార్థులు రాయాల్సిన ఇంగ్లిష్ ఫ్లూయన్సీ టెస్టులు, ఆప్టిట్యూడ్ టెస్టులపై ఫోకస్..
విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. పలు ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ టెస్ట్‌లు, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ విని అర్థం చేసుకోవడం, చదవడం, మాట్లాడటం, రాయడం వస్తేనే ఇంగ్లిష్ ఫ్లూయన్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధ్యమవుతుంది.

టోఫెల్ (TOEFL) :
టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్‌కి సంక్షిప్త రూపం.. టోఫెల్. విదేశాల్లో చదువుకోవాలనుకునే నాన్- ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల విద్యార్థుల ఆంగ్ల భాష సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్షల్లో టోఫెల్ ఒకటి. దీన్ని అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థ నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తోపాటు 130 దేశాల్లోని 10 వేల కాలేజీలు, యూనివర్సి టీలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ పరీక్షను ఏడాది పొడవునా వివిధ తేదీల్లో సుమారు 50 రోజులకు పైగా నిర్వహిస్తారు. సాధారణంగా శని, ఆదివారాల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మన దేశంలో హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన పట్టణ కేంద్రాల్లోనూ టెస్టింగ్ సెంటర్లున్నాయి. ఆయా కేంద్రాలకు కేటాయించిన పరీక్ష తేదీలకు అనుగుణంగా ఆన్‌లైన్, ఫోన్, ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్ష వ్యవధి 4 గంటలు. ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఈ స్కోర్ రెండేళ్ల పాటు చెల్లుతుంది. పరీక్ష ఫీజు 170 యూఎస్ డాలర్లు. వివరాలకు www.ets.org చూడొచ్చు. పరీక్షలో 4 విభాగాలుంటాయి..
1. రీడింగ్
సమయం: 60-80 నిమిషాలు
అకడమిక్ పుస్తకం నుంచి 700 పదాలు గల 3-4 ప్యాసేజ్‌లు ఇస్తారు. ప్రతి ప్యాసేజ్‌కి 12-14 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు విద్యార్థి ఏకాగ్రత, గ్రహణ శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యాలను పరీక్షించేలా ఉంటాయి.

2. లిజనింగ్
సమయం: 60-90 నిమిషాలు
ఈ విభాగంలో 34-51 ప్రశ్నలుంటాయి. ఇవి ఆంగ్ల భాషను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. మధ్యలో నోట్స్ రాసుకోవచ్చు. భాష చాలా సహజంగా ఉంటుంది. కొన్ని సంభాషణలు, ఉపన్యాసాలను అవసరమైతే మళ్లీమళ్లీ వినిపిస్తారు. సినిమాలు, టీవీ చూడటం, రేడియో వినడం ద్వారా లిజనింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవచ్చు.

3. స్పీకింగ్
సమయం: 20 నిమిషాలు
ఇందులో 20 ప్రశ్నలు, 6 టాస్క్‌లుంటాయి. ఆంగ్ల భాష వాక్‌చాతుర్యాన్ని అంచనా వేయడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. విద్యార్థి విన్న, చదివిన అంశాలపై మాట్లాడాల్సి ఉంటుంది. ఈ విభాగంలో హెడ్‌సెట్, మైక్రోఫోన్‌లను ఉపయోగించాలి. సమాధానాలు రికార్డ్ కావడానికి మైక్రోఫోన్‌లో మాట్లాడాలి. ఏవైనా చదివేటప్పుడు బిగ్గరగా చదవడం, నచ్చిన అంశాలపై ఇతరులతో చర్చించడం స్పీకింగ్ స్కిల్స్‌ని మెరుగుపరుస్తాయి.

4. రైటింగ్
సమయం: 50 నిమిషాలు
ఇందులో రెండు టాస్క్‌లుంటాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ టాస్క్ (చదవడం, రాయడం), రెండోది ఒక అంశంపై తన అభిప్రాయాల్ని బలపరుస్తూ రాసేదిగా ఉంటుంది. విద్యార్థి ఆలోచనల్లో స్పష్టతను పరీక్షించడం ఈ విభాగం లక్ష్యం. నచ్చిన సినిమాను, టీవీ కార్యక్రమాలను లేదా బయట చూసిన దృశ్యాలు, సంఘటనల సారాంశాన్ని పేపర్‌పై రాయడం ద్వారా రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి.

ఐఈఎల్‌టీఎస్ (IELTS) :
ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్‌కి సంక్షిప్త రూపమే.. ఐఈఎల్‌టీఎస్. 140 దేశాల్లోని దాదాపు 6 వేల విద్యాసంస్థలు దీన్ని ఆమోదిస్తున్నాయి. బ్రిటిష్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ కౌన్సిల్-ఐడీపీలు దీన్ని నిర్వహిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేవారు రాసే పరీక్షను ‘అకడమిక్ ఐఈఎల్‌టీఎస్’ అనీ, ఉద్యోగం, ఇతర శిక్షణ కార్యక్రమాల కోసం వెళ్లే వారు రాసే పరీక్షను ‘జనరల్ ఐఈఎల్‌టీఎస్’ అని అంటారు. ఈ పరీక్ష నెలకు నాలు గుసార్లు చొప్పున ఏడాదిలో 48 సార్లు జరుగుతుంది. ఈ పరీక్షను సాధారణంగా గురు, శని వారాల్లో నిర్వహిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీల వివరాలు చూడొచ్చు. www.britishcouncil.in/exam/ielts లో గానీ www.ieltsidpindia.com లో గానీ రిజిస్టర్ చేసుకోవాలి. పరీక్ష ఫీజు మనదేశంలో రూ.12,100గా ఉంది. బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు. ఆశించిన స్కోరు వచ్చే వరకు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావచ్చు. ఈ స్కోరు రెండేళ్ల పాటు చెల్లుతుంది.
పరీక్షా పద్ధతి...
  1. ఇది పేపర్ ఆధారిత పరీక్ష. అంటే.. పెన్ లేదా పెన్సిల్‌తో సమాధానాలు రాయాలి.
  2. ఇందులో 4 విభాగాలుంటాయి. లిజనింగ్ (30 నిమిషాలు), రీడింగ్ (60 నిమిషాలు), రైటింగ్ (60 నిమిషాలు), స్పీకింగ్ (11-15 నిమిషాలు).
  3. మొదటి మూడింటిని ఒకసారి నిర్వహిస్తారు. స్పీకింగ్ టెస్ట్‌ను అదేరోజు గానీ, మొదటి మూడు పరీక్షలు పూర్తయిన వారంలోపుగానీ నిర్వహిస్తారు.
  4. స్కోర్ 0-9 బ్యాండ్ స్కోర్ మధ్య ఉంటుంది. నాలుగు విభాగాల సగటు ఆధారంగా స్కోర్ ప్రకటిస్తారు. విదేశీ విద్య కోసం కనీసం 6.5 బ్యాండ్ స్కోర్ సాధించాలి.

జీఆర్‌ఈ (GRE) :
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్‌కి సంక్షిప్త రూపం.. జీఆర్‌ఈ. విదేశాల్లో ఎంబీఏ, ఎంఎస్, డాక్టోరల్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు; ఫెలోషిప్‌లు, పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం జీఆర్‌ఈ రాయాల్సి ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా 130పైగా దేశాల్లోని 3200 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ లేదా 16 ఏళ్ల విద్య పూర్తిచేసుకున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాలవ్యవధి 3 గంటల 45 నిమిషాలు. పరీక్ష ఫీజు 205 డాలర్లు. స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. ఏడాదిలో అయిదుసార్లు ఈ పరీక్షకు హాజరుకావచ్చు. రెండు పరీక్షల మధ్య 21రోజుల విరామం ఉండాలి. ఆన్‌లైన్/పేపర్ ఆధారిత విధానాల్లో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్, ఫోన్, ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రముఖ వర్సిటీల్లో సీటు రావాలంటే కనీసం 320 మార్కులు తెచ్చుకోవాలి. ఈ స్కోర్ రెండేళ్ల వరకు చెల్లుతుంది.
పరీక్ష పద్ధతి..
జీఆర్‌ఈ జనరల్ పరీక్షతోపాటు ఏడు రకాల సబ్జెక్టు టెస్టులు (బయోకెమిస్ట్రీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ) కూడా ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థికి సంబంధించిన రంగంలో పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఇక జీఆర్‌ఈ జనరల్ టెస్ట్ ద్వారా వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ రైటింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. వెర్బల్ రీజనింగ్‌లో వొకాబ్యులరీ, ఇంగ్లిష్‌లో ప్రాథమిక అంశాలపై ప్రశ్నలుంటాయి. 30 నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. క్యాంటిటేటివ్ ఎబిలిటీలో పదో తరగతి స్థాయి మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. 20 ప్రశ్నలకు 35 నిమిషాల సమయం ఉంటుంది. అనలిటికల్ ైరె టింగ్ సెక్షన్‌లో రెండు చిన్న వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం ఇస్తారు. రైటింగ్ పరీక్షకు ఆరు మార్కులుంటాయి. కానీ, వీటిని మెయిన్ స్కోర్‌కు కలపరు.
వెబ్‌సైట్: www.ets.org/gre

శాట్ (SAT) :
స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్‌కి సంక్షిప్త రూప మే.. శాట్. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈ పరీక్షలో రీజనింగ్, సబ్జెక్ట్ టెస్టులనే రెండు విభాగాలుంటాయి. ఈ స్కోర్‌తో విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. స్కాలర్‌షిప్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పరీక్షను యూఎస్‌ఏలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)లు నిర్వహిస్తున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయాలనుకునే వారు శాట్ సబ్జెక్ట్ టెస్టులు రాయాలి. ఏడాదికి ఆరుసార్లు (జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏడాదికి రెండుసార్లు మించి రాయడానికి లేదు. ఇంటర్మీడియట్/10+2 పూర్తిచేసిన వారు శాట్‌కు అర్హులు. పరీక్ష వ్యవధి 3 గంటల 45 నిమిషాలు. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది.
వెబ్‌సైట్: www.sat.collegeboard.org

అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ACT) :
అమెరికాలోని కొన్ని వర్సిటీలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి యాక్ట్ టెస్ట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాయి. చాలా యూనివర్సిటీలు శాట్, యాక్ట్ రెండింటినీ ఆమోదిస్తున్నాయి. శాట్, యాక్ట్ పరీక్షలు దాదాపు రెండూ ఒకటే. కాకపోతే యాక్ట్‌లో ఎక్కువగా విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షిస్తారు. ఇంటర్ పూర్తయిన వారు లేదా ఇంటర్ మొదటి ఏడాది పూర్తిచేసుకున్న వారు సైతం యాక్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఇంగ్లిష్ (75 ప్రశ్నలు-45 నిమిషాలు), మ్యాథ్స్ (60 ప్రశ్నలు-60 నిమిషాలు), సైన్స్ (40 ప్రశ్నలు-35 నిమిషాలు), రీడింగ్ (40 ప్రశ్నలు- 35 నిమిషాలు) అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇక యాక్ట్ ప్లస్ పరీక్షలో ఆప్షనల్‌గా 30 నిమిషాల పాటు హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ రచనా నైపుణ్యాన్ని పరీక్షించే రాత పరీక్ష ఉంటుంది. మొత్తం కాల వ్యవధి 2.55 గంటలు. అదే యాక్ట్ ప్లస్‌తో కలిపి అయితే 3.25 గంటలు. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఏటా ఆరుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.act.org

పీటీఈ :
పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్‌కి సంక్షిప్త రూపమే.. పీటీఈ. విదేశాల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష రాస్తుంటారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. వ్యవధి 3 గంటలు. ఈ పరీక్షలో స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్ విభాగాలుంటాయి.
వెబ్‌సైట్: https://pearsonpte.com

కొన్ని ఇంగ్లిష్ శిక్షణ సంస్థలు
1. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
వెబ్‌సైట్: www.uohyd.ac.in

2. ఇఫ్లూ (హైదరాబాద్)
వెబ్‌సైట్: www.efluniversity.ac.in

3. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (ఓయూ, హైదరాబాద్)
వెబ్‌సైట్: www.celt-ou.com

4. బ్రిటిష్ కౌన్సిల్ లెర్న్ ఇంగ్లిష్
వెబ్‌సైట్: https://learnenglish.britishcouncil.org

Published date : 23 Dec 2017 05:23PM

Photo Stories