Telangana VRA Jobs : ఇకపై తొలగిన అడ్డంకులు.. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియర్.. అలాగే..
ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకున్నారు. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, ఇతర శాఖల్లో సర్దుబాటుపై ప్రభుత్వం జులైలో నిర్ణయం తీసుకుంది.
దీంతో దాదాపు అన్ని జిల్లాలకు..
రెవెన్యూశాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలలో 16,758 మందిని ఆగస్టు మొదటివారంలో ఇతర శాఖలకు మళ్లించారు. మిగిలిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో దాదాపు అన్ని జిల్లాలకు వీఆర్‌ఏల బదలాయింపు పూర్తిచేశారు. కాగా ఆగస్టులో ఆఫీస్ సబార్డినేట్లు (ఓఎస్‌లు) రెండు జీవోలపై హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు జీవోలకు ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని (స్టేటస్ కో) ఆదేశాలిచ్చింది. ఓఎస్‌ల వ్యాజ్యంతో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ స్తంభించింది.
వీఆర్‌ఏలను సూపర్‌న్యూమరరీ పోస్టుల కిందనే..
రెవెన్యూ నుంచి రిలీవ్ అయిన వీఆర్‌ఏలు జిల్లాల్లో ఇతరశాఖల్లో చేరినా పేస్కేలు అమల్లోకి రాలేదు. ఉద్యోగ గుర్తింపు ఐటీ కేటాయింపు జరగలేదు. దీంతో వేతనాల బిల్లులు నిలిచిపోయాయి. జులై నుంచి వేతనాలు, బకాయి పీఆర్సీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఓఎస్‌లతో చర్చలు జరిపారు. వీఆర్‌ఏలను సూపర్‌న్యూమరరీ పోస్టుల కిందనే సర్దుబాటు చేస్తారని, రెగ్యులర్ ఓఎస్‌ల పదోన్నతులకు ఆటంకాలేవీ ఉండవని, సంఘం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓఎస్‌లు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను అక్టోబర్ 20వ తేదీన (శుక్రవారం) వెనక్కు తీసుకోవడంతో హైకోర్టు కేసును మూసివేసింది.