Government Jobs 2023 : ఇకపై వీరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఈ కొత్త పోస్టుల్లోకి వీరే..
ఇందుకోసం కొత్తగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించింది. వీఆర్‌ఏల విలీన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ఇదివరకే జారీ చేసింది. సర్దుబాటు బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. వివిధ శాఖల్లో సూపర్ న్యూమెరరీ పోస్టులు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఈ మేరకు ఆగస్టు 4వ తేదీన (శుక్రవారం) రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
కొన్ని ఏళ్లుగా చాలీచాలని జీతంలో..
ఏళ్లుగా చాలీచాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏల కల ఎట్టకేలకు నెరవేరుతోంది. రెవెన్యూ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులుగా తాత్కాలిక గౌరవ వేతనంతో వివిధ రకాల గ్రామస్థాయి విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలను ప్రభుత్వంలో విలీనం అయ్యారు.
రద్దయిన గ్రామ రెవెన్యూ సహాయకులను రెవెన్యూతోపాటు మున్సిపల్, నీటిపారుదల, మిషన్ భగీరథశాఖల్లోకి వీరిని విలీనం చేయనున్నారు. ఇందుకోసం ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇప్పటి వరకు గ్రామ సహాయకులుగా చేసిన వీరంతా ఆయాశాఖల్లో కేటాయించిన పనులను చేయాల్సి ఉంటుంది.
రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్, మున్సిపాలిటీలో వార్డు అధికారి(జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ) ఖాళీ పోస్టులను వీరితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వారి కోసం.. రెవెన్యూలోనే రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/చైన్‌మన్, ఇరిగేషన్‌లో లస్కర్/హెల్పర్, మిషన్ భగీరథలో హెల్పర్‌లుగా సూపర్ న్యూమరరీ పోస్టులను కేటాయించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
నిర్మల్ జిల్లాలో మొత్తం 726 మంది వీఆర్‌ఏలు ఉండగా, ఇందులో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది వయసు పైబడింది. కొంతమంది ఇప్పటికే తమ పిల్లలు, మనుమలతో వ్యవస్థలో కొనసాగింప చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 61 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులను కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలనూ పేర్కొంది. ఈ ఏడాది జులై 31వరకు వీఆర్‌ఏ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి నియామకాల కోసం దరఖాస్తు ఫార్మట్‌నూ రూపొందించారు.
ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి వారంతా సంబంధిత ఫార్మట్ ప్రకారం ఇతర కుటుంబసభ్యుల నో అబ్జెక్షన్ పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను ఇచ్చే పనిలో ఉన్నారు. విద్యార్హతల ప్రకారం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక్కసారి ఒక శాఖలో కేటాయించిన తర్వాత తమను మార్చమని అడగడానికి కూడా వీఆర్‌ఏలకు అవకాశం లేదు. ఇక ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్డర్ అందుకోబోతున్నారు.
నిర్మల్ జిల్లాలోని వీఆర్‌ఏల పూర్తి వివరాలు ఇలా..
➤ మొత్తం వీఆర్‌ఏలు: 748
➤ ప్రస్తుతం పనిచేస్తున్నవారు: 727
➤ డైరెక్టు రిక్రూట్ అయినవారు : 61
➤ వారసత్వంగా నియామకమైనవారు: 666
➤ డిగ్రీ, ఆపై అర్హత ఉన్నవారు : 83
➤ ఇంటర్ అర్హత ఉన్నవారు : 128
➤ పదవ తరగతి, ఆలోపు అర్హత : 516