Skip to main content

Junior Linemen Jobs: జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి శ్రీకారం..

హన్మకొండ : టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
JLM posts    Telangana State Northern Power Distribution Company Limited

గతంలో చేపట్టిన మూడో దశ నియామక ప్రక్రియలో మిగిలిన పోస్టుల భర్తీకి మరోసారి ఫోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌కు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 2018 ఫిబ్రవరిలో 2553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు యాజమాన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో పూర్వ వరంగల్‌ సర్కిల్‌లో 575, ఆదిలాబాద్‌లో 439, కరీంనగర్‌లో 674, ఖమ్మంలో 365, పూర్వ నిజామాబాద్‌ సర్కిల్‌లో 500 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి, ఇందులో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అనంతరం పాసైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టారు.

చదవండి: Good News For Vidya Volunteers : విద్యావాలంటీర్లకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీకి..
పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌కు పోస్టుకు ఒక్కరిని మాత్రమే పిలవడంతో స్తంభం ఎక్కకపోవడంతో కొందరు అనర్హత గురయ్యారు. మూడు దశల్లో టెస్ట్‌ నిర్వహించినా మరికొన్ని పోస్టులు ఖాళీగా మిగిలాయి. మూడు దశల్లో 2333 జేఎల్‌ఎం పోస్టులు భర్తీ చేయగా 220 పోస్టులు మిగిలాయి. దీంతో రాత పరీక్షలో ఆ తరువాత ర్యాంకు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలన్నీ అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
యాజమాన్యం, అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు నోటిఫికేషన్‌లో చూపిన ఖాళీలన్నీ అదే నోటిఫికేషన్‌తో పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో మిగిలిన 220 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ నాలుగో దశ పోల్‌ క్లయింబ్‌ టెస్ట్‌కు ముందుకు వచ్చింది. ఈ మేరకు పూర్వ జిల్లాల ఎస్‌ఈలకు ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా పూర్వ సర్కిళ్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల మేరకు పోస్టుకు ఒక్కరి చొప్పున కాల్‌ లెటర్లు పంపించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో పోల్‌ ఎక్కే పరీక్షకు రావాలని అధికారులు సూచించారు.

సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు..

నియామకాలకు యాజమాన్యం సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సీజీఎం స్థాయి అధికారిని అబ్జర్వర్‌గా నియమించింది. ఎంపిక కమిటీకి చైర్మన్‌గా పూర్వ జిల్లా హెడ్‌క్వార్టర్‌ ఎస్‌ఈ చైర్మన్‌గా, పర్సనల్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా, సర్కిల్‌ కార్యాలయం డీఈ (టెక్నికల్‌), పూర్వ సర్కిల్‌ స్థాయిలోని సీనియర్‌ డీఈ సభ్యులుగా వ్యవహరిస్తారు.

పూర్వ వరంగల్‌ సర్కిల్‌కు సీజీఎం ప్రాజెక్ట్స్‌ వి.మోహన్‌రావు, కరీంనగర్‌ సర్కిల్‌కు సీజీఎం హెచ్‌ఆర్‌డీ సి.ప్రభాకర్‌, ఖమ్మం సర్కిల్‌కు సీజీఎం ఆపరేషన్‌ కె.కిషన్‌, నిజామాబాద్‌కు సీజీఎం ఐపీసీ అండ్‌ రాక్‌ టి.మధుసూదన్‌, పూర్వ ఆదిలాబాద్‌ సర్కిల్‌కు సీఈ కన్‌స్ట్రక్షన్‌ కె.ఎన్‌.గుట్టను అబ్జర్వర్‌లుగా నియమించారు.
2018 ఫిబ్రవరిలో 2,553 వేకెన్సీలకు నోటిఫికేషన్‌

  • ఇప్పటికే మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి
  • మిగతా పోస్టులను భర్తీ చేయాలని కోర్టుకెళ్లిన అభ్యర్థులు
  • హైకోర్టు ఆదేశంతో నాలుగో దశ
  • నియామక ప్రక్రియ చేపట్టనున్న అధికారులు

అభ్యర్థులకు సమాచారం పంపాం

ఎన్పీడీసీఎల్‌లో గతంలో ఎంపిక చేయగా మిగిలిన పోస్టులను హైకోర్టు ఆదేశాల మేరకు భర్తీ చేస్తున్నాం. అర్హులైన అభ్యర్థులకు పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌ నిర్వహించే ప్రాంతం, తేదీ, సమయంతో కూడిన సమాచారం ఉత్తరాల ద్వారా చేరవేశాం. సర్కిల్‌ కార్యాలయాల్లో అర్హులైన అభ్యర్థుల వివరాలు ప్రదర్శించాం. ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో స్తంభం ఎక్కే పరీక్షకు హాజరు కావాలి.
–వెంకటరమణ, ఎస్‌ఈ,హనుమకొండ

Published date : 26 Jan 2024 02:42PM

Photo Stories