Skip to main content

అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే.. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు

పోలీసులుగా మగువలు తమ సత్తా చాటుతున్నారు. అడ్డంకులను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఆపదల్లో, విపత్తుల్లో మానవత్వాన్ని చూపుతూ ఖాకీ విలువను పెంచుతున్నారు. అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే విధులనూ అంతే నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. జనం మధ్య జనం కోసం ఎదుగుతున్న ఈ మహిళా పోలీసులు జనం నోట వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే.. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు
అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే.. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు

విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు తమ పని పట్ల గొప్ప నిబద్ధత చూపుతూనే ఉన్నారు. వ్యవస్థను నియంత్రణలో ఉంచడంలో కరకుగా వ్యవహరిస్తూ, ఆపదలో రక్షణ ఇస్తూ, విపత్కర పరిస్థితుల్లో స్నేహహస్తాన్ని అందిస్తూ తన ప్రాధాన్యతను చాటుతోంది ఖాకీ నారి.

ఆపదలో రక్షణ

rajeshwari
వ్యక్తిని రక్షించి, భుజాలపై తీసుకెళ్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి

ఇటీవల చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఓ చెట్టుకూలి మీద పడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఓ 28 ఏళ్ల వ్యక్తిని రక్షించి, భుజాల మీద మోసుకెళ్లి, ఆటోరిక్షా వద్దకు చేర్చిన మహిళా పోలీసు వీడియో వార్తల్లో నిలిచింది. ఆమె చూపిన తెగువకు ఎంతో మంది అభినందనలు తెలిపారు. ఆ మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరు రాజేశ్వరి. 53 ఏళ్ల వయసు. వార్తా కథనాల ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు రాజేశ్వరికి ఫోన్‌కాల్‌ వచ్చింది. టిపి ఛత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో ఉదయకుమార్‌ అనే వ్యక్తి చెట్టు కొమ్మ మీద పడటంతో మరణించాడని ఆ ఫోన్‌ సారాంశం. మహిళా పోలీసు తన బృందంతో ఆ శ్మశానవాటికకు వెళ్లింది. కూలిన చెట్టును తొలగించి చూడగా ఉదయకుమార్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడు. శ్మశాన వాటికలో పనిచేసే ఉదయకుమార్, స్నేహితుడితో కలిసి అతిగా మద్యం సేవించడం వల్ల అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అయితే ఉదయకుమార్‌ మరణించాడనుకున్న అతని స్నేహతుడు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న రాజేశ్వరి అతని స్నేహితుడిని మందలించి, సకాలంలో ఉదయకుమార్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేసింది. ఆపద సమయాల్లో తను మహిళ అని, మధ్యవయస్కురాలని ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసు విధిని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆమెను ఎంతోమంది కొనియాడారు.

నిస్సహాయతలో ...

Assam police officer holding baby
అస్సాం కానిస్టేబుల్‌ శ్రీమితి కాచే బేపి

అక్టోబర్‌ 31న అస్సామ్‌లో బొకాజన్‌ హెచ్‌ఎస్‌ స్కూల్‌ సెంటర్‌లో టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ జరిగింది. ఈ టెస్ట్‌ రాయడానికి ఓ తల్లి తన చంటిబిడ్డతో సహా వెళ్లింది. బయట ఆ బిడ్డను చూసుకునేవారు ఎవరూ లేక, పరీక్షకు హాజరు కాలేనేమోనన్న భయంతో ఉన్న ఆ తల్లి పరిస్థితిని చూíసి చలించిపోయిన అక్కడి మహిళా పోలీసు ఆ బిడ్డను తన అక్కున చేర్చుకుంది. పరీక్ష జరిగినంత సేపు ఆ పసివాడిని జాగ్రత్తగా చూసుకుంది. ఈ మహిళా పోలీసు బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్న చిత్రాన్ని ఎమ్మెల్యే నుమల్‌ మోమిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘మానవ స్పర్శ ఎల్లప్పుడూ అవసరం. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ చిత్రం ఎన్నో అర్థాలను చెబుతుంది. ఈ రోజు ఆ తల్లి సమస్యను పరిష్కరించి, బిడ్డను చూసుకున్న లేడీ కానిస్టేబుల్‌ శ్రీమితి కాచే బేపి కి సెల్యూట్‌ చేస్తున్నాను’ అని పోస్ట్‌ పెట్టిన గంటలోపే ఆ మహిళా పోలీసుకు అభినందనలు వెల్లువలా వచ్చాయి. 2019లో అస్సాంలోని దర్రాంగ్‌ జిల్లాలో టెట్‌ పరీక్షకు హాజరైన వారి పిల్లలను పట్టుకున్న మహిళా పోలీసు కూడా ఇలాగే అధికారుల ప్రశంసలు పొందారు.

కాబోయే అమ్మ...

shilpa sahoo DSP
ఛత్తీస్‌గడ్‌ డిఎస్పీ శిల్పా సాహు

గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డ గురించి తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో మనకు తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తన బాధ్యతను గుర్తెరిగి గర్భవతిగా ఉన్నా విధి నిర్వహణలో పాల్గొంది ఛత్తీస్‌గడ్‌లోని డీఎస్పీ శిల్పా సాహూ. కరోనా మహమ్మారి కారణంగా గత ఏప్రిల్‌లో చాలా చోట్ల లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధించారు. అలాంటి సమయంలో ఛత్తీస్‌గడ్‌ బస్తర్‌లోని దంతెవాడలో కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ విధులను నిర్వర్తిస్తున్న ఐదునెలల గర్భిణి డీఎస్పీ శిల్పాసాహూ వీడియో వెలుగులోకి వచ్చింది. ‘నక్సల్‌ ఆపరేషన్‌లలో కూడా అత్యుత్తమంగా పనిచేసిన సాహూ, ఈ కష్టకాలంలోనూ తన పరిస్థితిని లెక్కచేయకుండా విధులను నిర్వర్తించడం అభినందనీయం’ అని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ అవస్తి ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. అదే వేదికగా ఎంతోమంది సాహూకి తమ అభినందనలు తెలిపారు.

హెల్పింగ్‌ హ్యాండ్‌

mumbai police
ముంబై వరదల్లో  వృద్ధ జంటను రక్షిస్తున్న మహిళా పోలీస్‌ 

ముంబై ని వరదలు ముంచెత్తుతున్నప్పుడు ఓ మహిళా పోలీసు వృద్ధ దంపతులను రక్షించిన సందర్భం ఎంతోమంది హృదయాలను కదిలించింది. దాదర్‌లోని హింద్‌మాతా ప్రాంతంలోని వీధి మొత్తం నీళ్లు. అలాంటి వీధి గుండా వెళ్లేందుకు వృద్ధ దంపతులు ప్రయత్నిస్తున్నారు. ఆ నీళ్ల నుండి బయటపడే మార్గం లేక, ప్రాణాలను అరచేతుల్లో పట్టుకున్నారు. ఆ వీధిలో ప్రజలకు సాయం చేస్తూ, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ క్షణం విరామం తీసుకోకుండా పనిచేస్తున్న మహిళా పోలీసు ఈ జంటను రక్షించడానికి చేసిన ప్రయత్నం ఎంతోమందిని కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో తిరిగిన ఈ వీడియోకు నెటిజన్లు ఎన్నో ప్రశంసలు అందజేసి, పోలీసులకు అభివాదం తెలిపారు.

చదవండి: 

Women Police: మహిళా పోలీసులకు వరం

వెలకట్టలేని సెల్యూట్‌..కోట్లు పెట్టినా దొరకని ఆనందం

Deepika Patil, IPS : నాన్నను చూసే లాఠీ పట్టా...తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా..

AP CM YS Jagan: పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు..త్వ‌ర‌లోనే భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం..

Published date : 16 Nov 2021 04:11PM

Photo Stories