AP CM YS Jagan: పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు..త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం..
ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
‘‘దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అన్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా..
‘‘పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు.
పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాలకు..
‘‘పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 15 కోట్ల రూపాయలు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు.