హైదరాబాద్ స్టడీ హాల్స్‌లో భద్రత కరువు
సివిల్ సర్వీసెస్‌తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి.
ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది.
అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో..
స్టడీ హాల్స్‌లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి.
అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు?
చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు.
ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
విద్యుత్ వైర్లకు దగ్గరగా..
చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు.
ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్‌టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు.
వీధి లైట్లు లేక ఇబ్బందులు..
అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్‌లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు.
అమ్మాయిల భద్రత గాలికి..
హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్‌లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్‌కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది.
ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.
జోరుగా గంజాయి అమ్మకాలు
అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్‌నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది.
ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్‌వోఎస్ బూత్ పోల్స్‌ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.
టౌన్‌ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం..
నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు.
ఇలాంటి భవనాలు అశోక్‌నగర్‌లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.
Tags
- Hyderabad Study Halls
- Civil Services Exams
- group 1
- group 2
- Group 3
- Telangana News
- library
- Study Centres
- Fire Safety
- Hyderabad civil services coaching
- Competitive exam preparation Hyderabad
- Group-1 2 3 coaching centers Hyderabad
- Hyderabad competitive exams study environment
- Delhi coaching center incident impact Hyderabad
- SakshiEducationUpdates