డాక్టర్ పోస్టుల భర్తీలో సర్వీస్ రూల్స్ మార్చనున్న ప్రభుత్వం
నిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధన ఇప్పటికే ఉంది. అలాంటి నిబంధననే ప్రభుత్వ డాక్టర్లకు వర్తింపచేయాలని వైద్యశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వర్తింపజేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వర్తించేలా సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుతో పాటు మరికొన్ని సంస్కరణల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా చేయబోయే డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలని తేలంగాణ వైద్యశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేశాక డాక్టర్ల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.
పేదలకు అందని వైద్యం
ప్రభుత్వ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉన్నా, సొంత ప్రాక్టీస్ కారణంగా చాలామంది మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారు. గాంధీ వంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కొందరు అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో, పేదలకు వైద్యం అందడం లేదని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడు రోజులకోసారి వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్ వంటి చోట్ల ఉంటూ, ప్రభుత్వ సేవలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
చదవండి:
భారత్‌లో చదువుకునేలా ఆదేశాలివ్వండి
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే..
ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్.. మార్పులు, చేర్పులు ఇవే.. సన్నద్ధత ఇలా..
ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
దేశంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు తీసుకుంటే, సిజేరియన్ కు రూ.40 వేలు కనీసంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవనసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆపరేషన్ లో పాల్గొనే డాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఆలోచనలో కూడా వైద్యశాఖ ఉంది. మరోవైపు కొందరు ముహూర్తాలు పెట్టి ఆ మేరకు సిజేరియన్ కాన్పులు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు వైద్య వర్గాలకు సమాచారం అందింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా నిర్ణయించారు.
ఆర్డీవోలు, ఐఏఎస్‌లకు బాధ్యతలు
ఇటీవల ఎంజీఎం ఐసీయూలో ఒక రోగిని ఎలుకలు కరవడాన్ని (తర్వాత నిమ్స్‌లో చనిపోయాడు) వైద్యశాఖ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. కిందినుంచి పైస్థాయి వరకు అనేక లోపాలు ఇందుకు కారణమని భావిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పారిశుధ్య లోపం ప్రధానంగా ఉంది. మరోవైపు రోగులు ఆసుపత్రులకు వెళితే వారిపట్ల సిబ్బంది వ్యవహరించే తీరు విమర్శలకు తావిస్తోంది. డాక్టర్లే ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండటంతో వారికి పరిపాలనా అనుభవం ఉండటం లేదు. ఈ కారణంగానే ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆసుపత్రుల పరిపాలన బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. గాంధీ, కాకతీయ వంటి బోధనాసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి బాధ్యతను ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణకు అప్పగించారు.
సీసీ కెమెరాలతో నిఘా
డాక్టర్లు పీహెచ్‌సీలకు వెళ్లేలా పకడ్బందీ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినా వాటిని పాడుచేసి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్‌సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్, నర్సు, లేబరేటరీ ఫార్మసిస్ట్ ఉండే గదుల్లో వీటిని అమర్చుతారు. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 900కు పైగా ఉన్న పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల కెమెరాలన్నింటినీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్లకు లింక్ చేస్తారు. దీంతో ఏ పీహెచ్‌సీనైనా వారు తమ మొబైల్ ఫోన్ ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.
మరికొన్ని కీలక నిర్ణయాలు..
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన శానిటైజేషన్ కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం. కొత్త కాంట్రాక్టులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు.
- గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ దుకాణాలు ఎందుకని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- గ్రామాల్లో ఆర్థో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. మోకాళ్ల నొప్పులున్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల మార్పిడి లేదా చికిత్సలు చేస్తారు.
- ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు అనెస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ఇతర స్పెషలిస్ట్ వైద్యులు కొన్నిచోట్ల ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల డాక్టర్ల క్రమబద్ధీకరణ చేపడతారు.
- ప్రతి నెలా ఆసుపత్రుల నిర్వహణపై నివేదిక రూపొందిస్తారు. ఆ ప్రకారం సమీక్ష చేస్తారు.
- ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడతారు.
- నిమ్స్, గాంధీల్లో కొత్తగా 250 పడకల చొప్పున మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను (ఎంసీహెచ్) నెలకొల్పుతారు.