Freshers Hiring In IT Sector Slow Down: ఇబ్బందుల్లో ఐటీ రంగం.. భారీగా తగ్గిన నియామకాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనూ నిరాశే!
సాక్షి, హైదరాబాద్: భారత సాఫ్ట్‌వేర్ కంపెనీలు గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్పంగా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ సేవల ఆర్డర్లు తగ్గుదలతో దేశీయ ఐటీ రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో పడగా, తాజా పరిణామాలు మరింత ఆందోళన పరుస్తున్నాయి.
కోవిడ్‌కు ముందు ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైర్ చేయగా.. ఇప్పుడది 60–70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్‌లెటర్స్‌తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ప్లేస్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి. ఈ హైరింగ్‌లకు పెద్ద ఐటీ కంపెనీలు దూరంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థులు ఐటీ వైపే మొగ్గు చూపడం ఓ చిక్కుముడిగా మారుతోంది.
Centre Warning To Its Employees: ఆఫీసులకు లేటుగా వెళ్తున్నారా? ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఇదీ వాస్తవ పరిస్థితి...
దేశంలో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్–ఫెనో అనే హెచ్‌ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. పెద్ద కంపెనీలు మార్చి, ఏప్రిల్‌లో ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అంతకు ముందు ఏడాది జూలై, ఆగస్టుల నుంచే డిగ్రీ పూర్తిచేయబోయే విద్యార్థులకు ట్రయల్స్ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.
అయితే ఈసారి క్యాంపస్‌లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తంచేయకపోవడం యాజమాన్యాలు, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా.. అందుకు తగ్గట్లు రిక్రూట్‌మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.
మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70–80 శాతం దాకా ఆన్‌క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వస్తున్న అవకాశాల్లో 85 శాతం దాకా ఏడాదికి రూ.3–6 లక్షల లోపు ప్యాకేజీల్లోనే వస్తున్నాయని చెబుతున్నారు.
మరో 6 నెలలు ఇలాగే ఉండొచ్చు..
కనీసం వచ్చే ఆరునెలల దాకా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపు, ఇజ్రాయెల్– హమాస్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం, వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్, ఇతర దేశాల్లో వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం అనే అంశాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
అదీగాక, ఉద్యోగాలపై కృత్రిమమేథ (ఏఐ) పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2008లోనూ ఇదే విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సాంకేతికంగా సమూలమార్పులు వస్తుండటంతో, అప్‌గ్రేడేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమేషన్ పెరుగుదలతో క్లౌడ్, అనలిటిక్స్ తదితరాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్‌ఆర్ లీడర్, కో ఫోర్జ్
ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే..
ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నాన్‌ఐటీ ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ సర్విసెస్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కలెక్షన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ 2025 సంవత్సరమంతా కూడా లర్నింగ్ జాబ్‌గా చూసుకుని, ఇండియాలోనే ఎంబీఏ, డేటా/బిజినెస్ అనలిటిక్ వంటి కోర్సులు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక... వడ్డీరేట్లు తగ్గించడం మొదలుపెడితే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలయ్యే సూచనలున్నాయి. అందువల్ల మరో 6 నుంచి 9 నెలల దాకా అక్కడి నుంచి కొత్త ప్రాజెక్టులు రాకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ సర్విస్ ప్రొవెడర్ సంస్థలు ‘డేటా మైగ్రేషన్’ ప్రాజెక్ట్‌లపై ఆధారపడుతున్నాయి. రాబోయేరోజుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి.
–ఎన్.లావణ్యకుమార్, సహ వ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్
Tags
- it company
- Indian IT company
- IT Sector
- IT sector hiring
- Jobs in IT sector
- Software Jobs
- freshers hiking
- engineering students
- HIRING SLOWDOWN
- Indian software companies job opportunities
- IT sector troubles 2023
- global economic slowdown impact
- IT services orders decrease
- worrying developments
- sakshiducationupdates