Students Future : తప్పు దారిలో పడుతున్న విద్యార్థులు.. భవిష్యత్తుపై అవగాహన కల్పించాలి..

నెహ్రూనగర్: ఇంజినీరింగ్ విద్యార్థులు రింగ రింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను సేవించడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందా గుట్టును ఎక్సైజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసులు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు.
సాయి కృష్ణ సోదరుడి దగ్గరకు వెళ్లిన సమయంలో అతని రూంలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్‌కుమార్ పరిచయమయ్యాడు. సతీష్‌కుమార్ బెంగళూరుకు చెందిన నితిన్‌తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తు మందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని నితిన్ సతీష్‌కుమార్, సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండీఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్‌లోని సాయి లక్ష్మీ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా సాగిస్తున్నాడు.
గుట్టురట్టు ఇలా..
రెండు రోజుల క్రితం గుంటూరు ఎక్సైజ్–2 టౌన్ సీఐ ఎం.యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎక్సైజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు.
Gurukulam Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పరీక్ష ఫీజు, ఎంపిక విధానం ఇలా..
సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. అక్కడ ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయికృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్‌ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని..
ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్‌లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
School Inspection : పాఠశాల తనిఖీలో కలెక్టర్.. తరగతి గదిలో టీచర్‌గా..
ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్‌ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతరావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్‌ఎన్‌రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వీవీ చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎక్సైజ్ శాఖ అధికారి వి.అరుణ కుమారి, ఏఈఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు భవిష్యత్‌కు బలమైన పునాది వేయాల్సిన కీలక దశలో ఉన్నారు. అయితే, కొంతమంది విద్యార్థులు మాదకద్రవ్యాల వలలో పడుతూ తమ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సరైన దారి లేక, మనస్తాపం, స్నేహితుల ప్రభావం వల్ల డ్రగ్స్ వంటి వినాశకరమైన అలవాట్లకు లోనవుతున్నారు. ఇది వారికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగించే అంశం.
Admissions 2025 : పరీక్షలకు ముందే అడ్మిషన్లు షురూ.. ఆఫర్లంటూ ఫోన్ కాల్స్..
ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు కళాశాలల్లో కఠిన నియంత్రణ విధానాలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అవసరం. పోలీసు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కలసికట్టుగా పనిచేస్తేనే యువతను ఈ ముప్పు నుంచి రక్షించగలుగుతాం. విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో సమాజం బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- engineering students
- bad habits
- Students Future
- Engineering College
- banglore
- students stress and mental health
- students intoxication
- drugs addict students
- students education
- bright future
- counselling for students
- Strict control procedures
- schools and college students
- awareness for students
- career guidance and awareness programs for students
- Education News
- Sakshi Education News