Skip to main content

English Medium: ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం

విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువు­కునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
English Medium
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం

ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్‌ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి ఆగ‌ష్టు 1న‌ నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్‌ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్‌’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.

దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్‌ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్‌ లెర్కింగ్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు.

చదవండి: How to question in English: ఇవి తెలిస్తే... ఇంగ్లీషులో మీకు ప్రశ్నించడం వచ్చినట్లే

జూలై 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్‌ఈ, కాట్, ఐల్ట్స, క్లాట్, టోపెల్, సాట్‌ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్‌ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది.

పట్టుసాధించేలా 
ఇంగ్లిష్‌ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం.  

– బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం 

మెలకువలు నేర్పుతున్నాం..  
ఇంగ్లిష్‌ భాషలో మెలకువ­లు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశా­ఖా­ధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
– ఫిలిప్, ట్రైనర్,ఐడియల్‌ లెర్కింగ్‌ సంస్థ, విశాఖపట్నం 

ఉపయోగకరంగా ఉంది..   
నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్‌ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది.

 – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం 

అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు  
విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది.  

– ఆర్‌.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం

Published date : 01 Aug 2023 03:08PM

Photo Stories