AP Govt Schools: ఆంగ్లంలో చదువులు భేష్
భామిని: భామిని మండలం బొడ్డగూడను సోమవారం సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధనకు ముగ్దులయ్యారు. అనర్గలంగా ఆంగ్లంలో మాట్లాడుతున్న పిల్లలను చూసి మురిసిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘జగనన్న గోరుముద్ద’ను రుచిచూసి బాగుందంటూ కితాబిచ్చారు. గిరిజనుల జీవన విధానంపై అధ్యయనం చేయడానికి వచ్చిన ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు హరిమాన్ సింగ్ చేమా, ఆదర్శ పటేల్, వరుణ్ కె.గౌడ, తుషార్ కుమార్, రజిత్ యాదవ్, సోనం, శ్రీదేవి బి.విలు బృందం బొడ్డగూడను సందర్శించింది. వీరికి ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మూలమాలలు వేసి ఆహ్వానించారు. బొడ్డగూడ గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించి గిరిజన విద్యార్థులతో పాఠాలు చదివించారు. పిల్లలతో హుషారుగా గడిపారు. వారి వెంట తహసిల్దార్ నీలాపు అప్పారావు, ఎంపీడీఓ జి.చంద్రరావు, ఎంఈఓ ఊయక భాస్కరరావు, ఏపీఎం భవానీ, ఏపీఓ తులసీదాస్‌లు ఉన్నారు. లైజినింగ్ అదికారులుగా సీతంపేట ఏటీడబ్ల్యూఓ మంగవేణి, పీఎమ్మార్సీ ఏఎంఓ కోటిబాబు వ్యవహరించారు.