School in Nature: ఆహ్లాదకరమైన పాఠశాల.. ఈ ప్రకృతి..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపుగా పెరిగిన చెట్లు.. ఆపై ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణం. ఆహ్లాదంగా పరిసరాలు. అక్కడ ఉంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే ఉంటుంది. మండు వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఇలాంటి బడి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం అంగళ్లు దగ్గర తుంగావారిపల్లెలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టూ ఐదేళ్ల క్రితం సరవ మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై నీడతో పాటు చల్లని గాలిని ఇస్తున్నాయి.
విద్యార్థులు కూడా పాఠశాల భవనంలో కన్నా చెట్ల కింద హాయిగా చదువులు సాగిస్తున్నారు. చుట్టూ బయో ఫెన్సింగ్‌లా ఉంటున్నాయి. వీటిని అటవీ శాఖ నాటించింది. రూ.లక్షకు పైగా వ్యయంతో అప్పట్లో స్కూల్ ప్రాంగణం చుట్టూ 2500 మొక్కలు నాటారు. 600కు పైగా ఏపుగా పెరిగిన చెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తుంగావారిపల్లెకు చెందిన తళవం రమణ అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటిని నాటి పెంచి పెద్ద చేశారు. ఇతనికి అటవీ శాఖ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో అటవీ శాఖ అధికారులు ఇతని కష్టాన్ని మొత్తం తినేశారు.
ఉన్న ఊరి బడి అన్న కారణంగా మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశారు. రమణ కృషితో అవి ఇప్పుడు ఆ ఊరి బడికి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. టీచర్లకు, విద్యార్థులకు చల్లని నీడను గాలిని ఇస్తున్నాయి. చల్లని బడిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఎప్పుడూ నీడ ఉండటంతో మధ్యాహ్న భోజనానికి కూడా వంట గది అవసరం లేకుండా పోయింది. పచ్చని చెట్ల మధ్య విద్యార్థులు అటు చదువులు ఇటు ఆటలు సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో విద్యార్థులు ఆరోగ్యకరంగా కూడా ఉంటున్నారు.
ఎప్పడూ చల్లగా ఉంటుంది
ఇక్కడ 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ కాలంలోనైనా ఇక్కడ చల్లగా ఉంటుంది. విద్యార్థులు కూడా స్కూల్ భవనంలో కన్నా ఈ చెట్ల కింద చదువుకోడానికి ఇష్టపడతారు. చుట్టూ చెట్లు ఉండడంతో వేసవిలో కూడా ఎండ పడదు. చల్లటి గాలితో హాయిగా ఉంటుంది. వర్షానికి ఈదురు గాలులకు ఈ చెట్లు తట్టుకుంటాయి. విద్యా శాఖ అధికారులు కూడా ఇక్కడికి వస్తే అంత తొందరగా వెళ్లరు. అంత హాయిగా ఉంటుంది. ఇలాంటి స్కూల్‌లో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
–ఎన్‌కె గౌరి, హెడ్మాస్టర్, తుంగావారిపల్లె, కురబలకోట మండలం