Change School Timings: బడి పనివేళలు సవరణ
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పోల్చితే ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కాస్త ఆలస్యంగా స్కూల్ ప్రారంభమై, ఆలస్యంగానే ముగిసేది. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ముందుగా బడికి చేరుకోవాల్సి వచ్చేది. ఉదయం పూట తొందరగా నిద్రలేవలేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు.
అన్ని స్కూళ్లకు పనివేళలు ఒకేవిధంగా ఉండాలని కొన్నేళ్లు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
చదవండి: Public Service: విద్యార్థులు ప్రజాసేవపై దృష్టిపెట్టాలి
ప్రాథమిక విద్యార్థులకు ఊరట
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల పనివేళలను మార్చడంతో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఊరట లభించింది. పనివేళల మార్పునకు ముందు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యేవి. ఉన్నత పాఠశాలలు మాత్రం 9.30 తెరుచుకునేవి. సాధారణంగా చిన్నపిల్లలు ఉదయం పూట త్వరగా మేలుకునేందుకు ఇంట్లో మారం చేస్తుంటారు. పిల్లలను బుజ్జగించి నిద్ర నుంచి లేపేందుకు తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతుంటారు. ఉదయం 7 గంటల తర్వాత నిద్రలేచే చిన్నారులను రెడీ చేసి సకాలంలో పాఠశాలకు పంపడం తలకు మించిన భారంగా మారేది.
తల్లిదండ్రుల సాయం లేకుండానే నిద్ర లేచి స్వతహాగా తయారయ్యే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 9.30కు పాఠశాల ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు తెరుచుకోవడంతో చిన్నారులు ఇబ్బందులకు గురయ్యేవారు. దూరప్రాంతాల్లో చదువుకునే వారయితే ఉదయం 8 గంటలలోపే ఇంటి నుంచి బయలుదేరాలి.
చదవండి: Ekalavya Schools: ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయండి
ఈ సమస్యలకు పరిష్కారంగా అన్నిస్కూళ్ల పనివేళలు ఒకే విధంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం పనివేళలు మార్చింది. అన్ని రకాల పాఠశాలలు ఉదయం 9.30 గంటలకే తెరుచుకునేలా రాష్ట్ర విద్యాశాఖ ఇటీవలే ఉత్వర్వులను జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని పాఠశాలలు కొద్దిరోజులుగా ఉదయం 9.30 గంటలకే తెరుచుకుంటున్నాయి.
ముగింపు సమయాలు మాత్రం వేరు..
జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం ఒకే సమయానికి తెరుచుకుంటున్నా ముగింపు సమయాలు మాత్రం వేరుగా ఉన్నాయి. సవరించిన పనివేళలకు ముందు ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు 9 నుంచి సాయంత్రం 4.30 వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు పని చేసేవి.
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతుండగా ఉన్నత పాఠశాలల పనివేళల్లో మాత్రం ఎలాంటి మార్పు లేవు. ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పోల్చితే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉదయం పూట అరగంట వెసులుబాటు కలిగేలా పనివేళలను సవరించటంతో వారికి కాస్త ఊరట లభించినట్లైంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సకాలంలో స్కూల్‌కు చేరుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం వరకు ఆకలితో అలమటించకుండా తల్లిదండ్రులు చిన్నారులకు అల్పాహారం అందించేందుకు సమయం దొరికింది.
జిల్లాలోని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రైవేట్)
ప్రాథమిక - 908
ప్రాథమికోన్నత - 192
ఉన్నత - 145
హైయర్ సెకండరీ గ్రేడ్ పాఠశాలలు - 24
మొత్తం విద్యార్థులు - 92,701 (సుమారు)