Inspiring Story : విధి చేతిలో పావులా మారానన్న కసి ఒక వైపు..ప్రభుత్వోద్యోగం సాధించాలనే పట్టుదల మరో వైపుతో..
లోపాన్ని లోకానికి వదిలేసి అనుకున్నవన్నీ సాధిస్తూ, అనూహ్యంగా రాణిస్తున్న ఆ యువకుడి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. వంగి సలాం చేసింది.
వైద్యపరిభాషలో ‘కిఫోసిస్’, వాడుకలో ‘గూని’గా వ్యవహరించే వైకల్య బాధితుడు అమర్‌నాథ్ (37).సాయం అడగాల్సిన తన శారీరక స్థితి గురించి మర్చిపోయి ఎందరో తమ కాళ్లమీద తాము నిలబడేందుకు సాయంగా మారిన ఆయనను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అంతేకాదు... చదరంగంలో ఆయన సాధించిన విజయాలు అనూహ్యం. ఆయన కథలో ఒక యువకుని ఒంటరిపోరాటం ఉంది. చుట్టూ ఉన్న సమాజంతో పెనవేసుకున్న అనుబంధంలో స్ఫూర్తినింపే సేవాభావముంది.
కష్టాల నీడలోనే...
‘‘పుట్టి పెరిగింది నెల్లూరు. నాన్న చిన్నతనంలోనే పోతే చిరుద్యోగి అయిన అమ్మ చేతుల మీదుగా కష్టాల నీడలోనే అక్కయ్య, అన్నయ్య, నేను పెరిగాం’’ అంటూ ప్రారంభించారు అమర్. నాన్న లేరు, అమ్మ ఉద్యోగంతో రోజంతా కుస్తీ, బంధువులు ఆదరించలేదు... చదువు సరిగా ఒంటబట్టని అమర్ తప్పుతూ, పాసవుతూ...10వ తరగతి పూర్తి చేశాననిపించాడు. ఆ సమయంలో బాగా బొద్దుగా ఉండే అమర్‌ను చూసిన ఒక డాక్టరు... ‘‘మీ పిల్లాడు మరీ లావుగా ఉన్నాడు. పెద్దయితే కష్టం’’ అని భయపెట్టి ఆపరేషన్‌తో వెన్నులో నీరు తీసేసి సన్నగా చేస్తానని నమ్మించాడు. ఆ ఆపరేషన్ వికటించి అమర్ వీపునకు కుడి వైపు దేహాన్ని పూర్తిగా కుంగదీసి గూనికి దారి తీసింది. దీంతో అమర్ మరింత నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లల బాగుకోరిన ఆ తల్లి ఒంగోలుకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా...
‘‘కుటుంబ పోషణలో అమ్మకు ఆసరాగా ఉండాలనిపించినా, వీలు లేకుండా ఈ వైకల్యం అడ్డుపడింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు అమర్. స్పోర్ట్స్‌కోటాలో ప్రభుత్వోద్యోగం సంపాదించడానికి చిన్నప్పుడు ఊసుపోక ఆడిన చదరంగాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాడు. అందులో ప్రావీణ్యం సాధించి జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విజయాలు సాధించాడు. అయినా స్పోర్ట్స్ కోటాలో వికలాంగులకు ఉద్యోగం ఇవ్వం పొమ్మన్నారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, వైకల్యం సాకుతో నిరాకరించడం... ఇలా ఎన్నో మార్లు జరిగింది. రైల్వే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా పట్టు వీడలేదు. ప్రభుత్వంతో పోరాడాడు. 9నెలల పాటు హైదరాబాద్‌కు, ఒంగోలుకు మధ్య చక్కర్లు కొడుతూ అధికారులకు అర్జీలపై అర్జీలు పెడుతూ పోరాడి చివరకు గెలిచాడు. వికలాంగుడై ఉండీ స్పోర్ట్స్‌కోటాలో రైల్వే ఉద్యోగం పొందినవారిలో ప్రథముడిగా నిలిచి, మరెందరో వికలాంగులకు స్ఫూర్తినిచ్చాడు.
సరైన వసతి లేక, కట్టే స్థోమత లేక..
ఒకరి గొడవ ఒకరికి పట్టని హైదరాబాద్ లాంటి అ‘భాగ్య’నగరాల్లో ఉద్యోగార్థ్ధుల బాధలు మరింత వర్ణనాతీతంగా ఉంటాయి. ‘‘ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఈ సిటీకి వచ్చి వెళ్లేపుడు సరైన వసతి లేక, కట్టే స్థోమత లేక పడిన బాధలే... మరి కొంత మందికి చేయూతని అందించేలా ప్రోత్సహించాయి’’ అని వివరించారు అమర్. నగరానికి సినిమా, టీవీ... వంటి రంగాలలో ప్రతిభకు తగ్గ ఉపాధిని ఆశిస్తూ వచ్చే ఎందరో యువతీయువకులకు నీడనిచ్చేందుకు ఓ పదేళ్ల నుంచి నగరానికి ఉద్యోగార్థులై లేదా మరేదైనా రంగంలో కెరీర్ వెతుక్కుంటూ వచ్చే వారికి ఉచిత వసతి కల్పించడం మొదలుపెట్టారు.
డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో రెగ్యులర్‌గా..
ప్రస్తుతం అమర్‌కు చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో రెగ్యులర్‌గా అరడజనుకు తక్కువ కాకుండా అవసరార్థులు ఆశ్రయం పొందుతుంటారు. ‘‘ఒక్కోసారి ఎవ్వరూ రానపుడు నిమ్స్, ఎల్వీప్రసాద్ ఆసుపత్రుల దగ్గర ఫుట్‌పాత్ మీది రోగులనో వారి బంధువులనో పిలుచుకువస్తాను’’ అని చెప్పారు అమర్. తన ఫ్లాట్‌ను పంచుకునే వారికి చాపలు, దుప్పట్లు, దిండ్లుతో పాటు అన్నం వండుకోవడానికి బియ్యం సమకూరుస్తున్నానని, తన జీతంతో పాటు స్నేహితులు అందిస్తున్న చేయూతతో ఇది సాధ్యమవుతోందని అమర్ అంటున్నారు. అంతేకాదు... అనాథ పిల్లలకు హోమ్‌లలో ఆశ్రయం కల్పించడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, నిరుపేద రోగులకు సహకారం అందించడం వంటి సదుద్దేశాలతో ‘‘నేనున్నాను ఫౌండేషన్’’ ( www.nenunnanu.org )ను ఏర్పాటు చేశారాయన.
చెస్‌లో... ఆర్బిటర్‌గా...
ప్రస్తుతం రైల్వేలో కమర్షియల్ క్లర్క్‌గా పనిచేస్తున్న అమర్...మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక పాప. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మాత్రమే కాదు చదరంగంలోనూ ఆయన చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నారు. రాష్ట్ర. జాతీయస్థాయిలో ట్రోఫీలు గెలిచారు. అంతేకాదు... క్రికెట్‌లో అంపైర్ తరహాలో చెస్‌లో విధులు నిర్వర్తించే ఆర్బిటర్ హోదాను ఆయన అందుకుని ఈ హోదాను దక్కించుకున్న ఏకైక వికలాంగుడిగా నిలిచారు.
అలాగే పోలెండ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ చెస్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఎంపికయ్యారు. ‘‘మిగిలినవారి కన్నా డిజేబుల్డ్ పర్సన్స్‌కే స్పోర్ట్స్ చాలా అవసరం’’అంటారు అమర్. అందులోనూ చెస్ లాంటి ఆటల విషయంలో వికలాంగుల్ని బాగా ప్రోత్సహించాల్సి ఉందంటున్న అమర్ అందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నగరంలో డిజేబుల్డ్ పర్సన్స్, చిల్డ్రన్‌కి ఆశ్రయం పొందే చోటకు స్వయంగా వెళ్లి వారికి ఉచిత చదరంగం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డిజేబుల్డ్‌కు చెస్‌ను చేరువ చేయడమే తన జీవితాశయం అనీ, వీలున్నంత వరకూ సమాజ సేవ చేస్తూనే ఉంటానంటున్న అమర్ ఆశయం సిద్ధించాలని కోరుకుందాం.