Skip to main content

Indian Economic Service: ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ 2022కు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, రాత పరీక్షల్లో విజయానికి గైడెన్స్‌..

upsc ies / iss 2022 notification released, exam dates, guidance, preparation tips
upsc ies / iss 2022 notification released, exam dates, guidance, preparation tips

ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌.. సంక్షిప్తంగా ఐఈఎస్‌! ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌..సంక్షిప్తంగా ఐఎస్‌ఎస్‌! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని.. పలు శాఖల్లో ఆర్థిక, గణాంక విభాగాల్లో నిపుణుల నియామకం కోసం ఏర్పాటైన సర్వీసులు.. ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌!! వీటికి ఎంపికైన వారికి సెంట్రల్‌ సర్వీసెస్‌ హోదాతో.. జూనియర్‌ టైమ్‌ స్కేల్‌తో కెరీర్‌ సొంతమవుతుంది. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ, పీజీ చదివిన వారికి చక్కటి అవకాశం.. ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌!! యూపీఎస్సీ తాజాగా ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ 2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌–2022 వివరాలు, ఎంపిక విధానం, రాత పరీక్షల్లో విజయానికి గైడెన్స్‌..  

  • పరీక్షలో విజయంతో కేంద్ర ప్రభుత్వ కొలువులు
  • అసిస్టెంట్‌ డైరెక్టర్, రీసెర్చ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభం
  • ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో పీజీ, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
  • 2022 సంవత్సరానికి ప్రారంభమైన ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ ప్రక్రియ

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో జరిగే ఆర్థిక సంబంధ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు, కీలకమైన నివేదికలు రూపొందించేందుకు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించేందుకు అవసరమైన నిపుణుల ఎంపికకు నిర్వహించే పరీక్ష... ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌(ఐఈఎస్‌), ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌(ఐఎస్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌. ఇది డిగ్రీ, పీజీ స్థాయిలో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ కోర్సులు చదివిన వారికి చక్కటి అవకాశం. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మలి దశలో నిర్వహించే ఇంటర్వ్యూలోనూ నెగ్గితే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు కీలక శాఖల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు.

ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌–2022 ప్రక్రియ మొదలు

ప్రతి ఏటా నిర్దేశిత క్యాలెండర్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ ఈ ఏడాది కూడా ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌–2022కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐఈఎస్‌లో మొత్తం 24 పోస్ట్‌లు, ఐఎస్‌ఎస్‌లో 29 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

రెండు దశలుగా ఎంపిక ప్రక్రియ

  • యూపీఎస్సీ నిర్వహించే ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో వేయి మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • మొదటి దశ రాత పరీక్షలో.. ఎకనామిక్స్‌ సంబంధిత స్పెషలైజేషన్లు అర్హతగా పేర్కొన్న ఐఈ ఎస్‌కు.. అదే విధంగా బ్యాచిలర్‌ డిగ్రీలో గ్రూప్‌ సబ్జెక్ట్‌లో స్టాటిస్టిక్స్‌ సంబంధిత సబ్జెక్ట్‌లను అర్హతగా పేర్కొన్న ఐఎస్‌ఎస్‌కు వేర్వేరుగా పరీక్ష పేపర్లు ఉంటాయి.


చదవండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!

ఐఈఎస్‌ రాత పరీక్ష ఇలా

ఐఈఎస్‌ రాత పరీక్ష మొత్తం ఆరు పేపర్లలో జరుగుతుంది. ఐఈఎస్‌ పరీక్ష పేపర్లన్నీ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించే సమయం మూడు గంటలు.

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ ఇంగ్లిష్‌ 100
పేపర్‌–2 జనరల్‌ స్టడీస్‌ 100
పేపర్‌–3 జనరల్‌ఎకనామిక్స్‌–1 200
పేపర్‌–4 జనరల్‌ ఎకనామిక్స్‌–2 200
పేపర్‌–5 జనరల్‌ ఎకనామిక్స్‌–3 200
పేపర్‌–6 ఇండియన్‌ ఎకనామిక్స్‌ 200
మొత్తం మార్కులు   1,000

ఐఎస్‌ఎస్‌.. రాత పరీక్ష ఇలా

ఐఈఎస్‌తో పోల్చితే.. ఐఎస్‌ఎస్‌ రాత పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలతో ఆయా పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ ఇంగ్లిష్‌ 100
పేపర్‌–2 జనరల్‌ స్టడీస్‌ 100
పేపర్‌–3 స్టాటిస్టిక్స్‌–1 200
పేపర్‌–4 స్టాటిస్టిక్స్‌–2 200
పేపర్‌–5 స్టాటిస్టిక్స్‌–3 200
పేపర్‌–6 స్టాటిస్టిక్స్‌–4 200
మొత్తం మార్కులు   1000​​​​​​​
  • పేపర్‌–3, 4లుగా నిర్దేశించిన స్టాటిస్టిక్స్‌–1, స్టాటిస్టిక్స్‌–2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. వీటికి కేటాయించిన సమయం రెండు గంటలు. మిగతా పేపర్లకు కేటాయించిన సమయం మూడు గంటలు.
  • స్టాటిస్టిక్స్‌–3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలోనే నిర్వహిస్తున్నప్పటికీ.. వీటిలో షార్ట్‌ ఆన్సర్‌ కొశ్చన్స్, స్మాల్‌ ప్రాబ్లమ్‌ కొశ్చన్స్‌ ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో ఈ తరహా ప్రశ్నలు 50 శాతం మేరకు ఉంటాయి. మరో 50 శాతం ప్రశ్నలు దీర్ఘ సమాధాన ప్రశ్నలు, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలుగా ఉంటాయి. 
  • స్టాటిస్టిక్స్‌ పేపర్‌–4లో మొత్తం ఏడు సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఛాయిస్‌ విధానంలో ఏదైనా రెండు సెక్షన్లు ఎంచుకుని ఆ రెండు సెక్షన్లలోనే పరీక్ష రాసే అవకాశం ఉంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పోస్ట్‌ల సంఖ్య, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఇందులో చోటు సాధించిన వారికి మలి దశలో చివరగా 200 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే.. రాత పరీక్షలో మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులను క్రోడీకరించి తుది విజేతలను ఖరారు చేసి ఆయా సర్వీసులకు ఎంపిక చేస్తారు.

చదవండి: Civils Prelims Study Material

పీజీ స్థాయి అకడమిక్స్‌తో విజయం

ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ పరీక్షల్లో విజయం సాధించడానికి.. అభ్యర్థులు తాము అకడమిక్‌గా పీజీ స్థాయి పుస్తకాలను చదవడం ఎంతో ఉపకరిస్తుంది. అదే విధంగా ప్రీవియస్‌ పేపర్లు, మోడల్‌ పేపర్ల సాధన కూడా కలిసొస్తుంది.

జనరల్‌ ఇంగ్లిష్‌

ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ రెండింటికి ఉమ్మడిగా ఉండే ఈ పేపర్‌లో ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. వొకాబ్యులరీని, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్‌ రైటింగ్, ప్రెసిస్‌ రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. వీటిలో పట్టు సాధిస్తే.. ఈ పేపర్‌లో 60 శాతం మార్కులు పొందినట్లే.

జనరల్‌ స్టడీస్‌

ఈ పేపర్‌ కూడా రెండు సర్వీసులకు ఒకే మాదిరిగా ఉంటుంది. ఎక్కువగా కరెంట్‌ ఈవెంట్స్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడిగే ఈ పేపర్‌లో రాణించాలంటే.. శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫీలపై పట్టు సాధించాలి. అభ్యర్థులు సివిల్స్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, ప్రిలిమ్స్‌ పేపర్లు అధ్యయనం చేయడం ఉపకరిస్తుంది.

ఐఈఎస్‌ సబ్జెక్ట్‌ పేపర్లకు ఇలా జనరల్‌ ఎకనామిక్స్‌–1

ఈ పేపర్‌లో రాణించడానికి సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్‌ ఎకనోమెట్రిక్‌ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. సూక్ష్మ అర్ధశాస్త్రానికి సంబంధించి వినియోగదారుని డిమాండ్‌ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ, పంపిణీ అంశాలు తెలుసుకోవాలి. ఇక అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ఉండే ఈ పేపర్‌ కోసం లారెంజ్‌ వక్ర రేఖ, ఏంజెల్‌ సూత్రం, షాడో ప్రైస్, పారెటో పంపిణీ సిద్ధాంతం, స్వలకాల–దీర్ఘకాల వ్యయ రేఖలు, తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. 

జనరల్‌ ఎకనామిక్స్‌–2

స్థూల అర్థశాస్త్రం, ఎకనామిక్స్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్, అంతర్జాతీయ అర్థశాస్త్రం తదితర అంశాల కలయికగా ఉండే ఈ పేపర్‌ కోసం ప్రతి అంశాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చదువుకోవాలి. జాతీయాదాయం కొలమానం, గ్రీన్‌ నేషనల్‌ ఇన్‌కమ్, సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఫిలిప్స్‌ రేఖ, ద్రవ్యరాశి సిద్ధాంతం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రపంచ వాణిజ్య సంక్షోభాలు–కారణాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల తాజా కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

జనరల్‌ ఎకనామిక్స్‌–3

ప్రభుత్వ విత్త శాస్త్రం, పర్యావరణ అర్థశాస్త్రం, ఇండస్ట్రియల్‌ ఎకనమిక్స్‌ అంశాల సమ్మిళితంగా ఉండే ఈ పేపర్‌లో.. మంచి మార్కుల కోసం పన్ను సంస్కరణలు, గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం, ప్రభుత్వ వ్యయ సిద్ధాంతం, గ్రీన్‌ జీడీపీ, క్యోటో ప్రోటోకాల్,బాలి యాక్షన్‌ ప్లాన్, ఇండస్ట్రియల్‌ ఎకనమిక్స్‌ అంశాలపై అవగాహన పొందాలి.

ఇండియన్‌ ఎకనామిక్స్‌

సిలబస్‌లోని ముఖ్యాంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ ..నోట్స్‌ రాసుకోవాలి. స్థిరీకరణ–నిర్మాణాత్మక సర్దుబాటు ప్యాకేజీ, విత్తరంగ సంస్కరణలు, నీతి ఆయోగ్‌ సిఫార్సులు, టోకు ధరల సూచీ–రిటైల్‌ ధరల సూచీ, భారత ద్రవ్య మార్కెట్, ఎఫ్‌డీఐ, డిజిన్వెస్ట్‌మెంట్‌ పాలసీ తదితర తాజా అంశాలపై దృష్టి సారించాలి.

ఐఎస్‌ఎస్‌.. సబ్జెక్ట్‌ పేపర్లకు సన్నద్ధత ఇలా

  • స్టాటిస్టిక్స్‌–1 పేపర్‌లో రాణించాలంటే.. పలు సిద్ధాంతాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్‌ మెథడ్స్, న్యూమరికల్‌ అనాలిసిస్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. 
  • స్టాటిస్టిక్స్‌–2 పేపర్‌లో.. లీనియర్‌ మోడల్స్, ఎస్టిమేషన్, హైపోథిసిస్‌ టెస్టింగ్, మల్టీవెరైటీ అనాలిసిస్‌(ఎస్టిమేషన్‌ ఆఫ్‌ మీన్‌ వెక్టార్‌ అండ్‌ కో వేరియన్స్‌ మ్యాట్రిక్స్, తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • స్టాటిస్టిక్స్‌–3 పేపర్‌లో.. శాంప్లింగ్‌ టెక్నిక్స్, ఎకనామిక్‌ సాటిస్టిక్స్, డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • స్టాటిస్టిక్స్‌–4 పేపర్‌లో.. స్టాటిస్టికల్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రీసెర్చ్,డెమోగ్రఫీ అండ్‌ వైటల్‌ ఛార్ట్స్,కంప్యూటర్‌ సిస్టమ్‌–సాఫ్ట్‌వేర్‌ కాన్సెప్ట్స్,డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కంప్యూటర్‌ సంబంధ అంశాలపై అవగామన ఏర్పరచుకోవాలి.
  • డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌ పేపర్లలో మంచి స్కోర్‌ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం.ప్రిపరేషన్‌ సమయంలోనే ప్రతి అంశా న్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. 
  • ముఖ్యంగా ఆయా సిద్ధాంతాలు వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్‌ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి. 
  • ఇలా ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.

జూనియర్‌ టైమ్‌ స్కేల్‌

ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు ఎంపికైన వారికి జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభమవుతుంది. ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్, రీసెర్చ్‌ ఆఫీసర్‌ హోదాతో కొలువు లభిస్తుంది. నీతి ఆయోగ్, నేషనల్‌ శాంపుల్‌ సర్వే, లేబర్‌ బ్యూరో, ఆర్థిక సంఘం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమ, విద్య, వ్యవసాయం, వాణిజ్యం తదితర విభాగాల్లో నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా డిప్యూటీ డెరైక్టర్‌/అసిస్టెంట్‌ అడ్వైజర్‌(సీనియర్‌ టైం స్కేల్‌), జాయింట్‌ డెరైక్టర్‌/డిప్యూటీ అడ్వైజర్, సీనియర్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ తదితర హోదాల నుంచి అత్యున్నత స్థాయి ప్రిన్సిపుల్‌ అడ్వైజర్‌ లేదా చీఫ్‌ అడ్వైజర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ 2022 ముఖ్య సమాచారం

  • పరీక్ష: ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీస్‌
  • పోస్టుల సంఖ్య: 24
  • అర్హత: విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌/అప్లైడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉండాలి.
  • వయో పరిమతి: 2022, ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంది.
  • పరీక్ష: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌
  • పోస్టుల సంఖ్య: 29
  • అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఈ సబ్జెక్ట్‌లు స్పెషలైజేషన్‌గా పీజీ ఉత్తీర్ణత ఉండాలి.  n వయో పరిమితి: 2022, ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంది.

ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఏప్రిల్‌ 6–ఏప్రిల్‌ 26, 2022
  • పరీక్ష తేదీ: జూన్‌ 24, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https//www.upsconline.nic.in, https://www.upsc.gov.in


కాన్సెప్ట్స్‌పై అవగాహన కీలకం

ఐఎస్‌ఎస్‌ పరీక్షలో విజయం సాధించాలంటే.. స్టాటిస్టిక్స్‌లోని అన్ని కాన్సెప్ట్‌లపై అవగాహన కీలకమని గుర్తించాలి. అదే విధంగా ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. స్టాటిస్టిక్స్‌లో పేపర్‌–1, 2 మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. సిలబస్‌లోని అంశాలను బేరీజువేస్తూ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం ఉపయుక్తం. జనరల్‌ అభ్యర్థులు 400 మార్కులు(1000 మార్కులకు) సాధిస్తే ఇంటర్వ్యూ కాల్‌ ఆశించవచ్చు. 
– బి.సంతోష్‌ నాయక్, ఐఎస్‌ఎస్‌–2019 విజేత(అసిస్టెంట్‌ డైరెక్టర్‌–సీడబ్ల్యూసీ)

చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

Published date : 11 Apr 2022 06:48PM

Photo Stories