Skip to main content

Kendriya Vidyalaya: కేవీల్లో 2022–23 ప్రవేశ ప్రక్రియ ప్రారంభం.. విద్యా బోధన విధానాలు, దరఖాస్తు వివ‌రాలు ఇలా..

చిన్నతనం నుంచే పిల్లల్లో సృజనాత్మకత,సహజ ఆసక్తులను గుర్తించే విధంగా.. యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. మానసిక పరిణితికి దోహదం చేస్తున్న విద్యాసంస్థలు.. కేంద్రీయ విద్యాలయాలు! ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ స్థాయి వరకు ఇదే తరహా బోధనతో.. విద్యార్థుల్లో బహుముఖ నైపుణ్యాలకు దోహదం చేస్తున్న సంస్థలు ఇవి!! కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 2022–23 సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. కేవీల్లో ప్రవేశ విధానాలు, విద్యా బోధనలో అమలవుతున్న విధానాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై విశ్లేషణ..
Kendriya Vidyalaya
  • క్రియేటివ్‌ లెర్నింగ్, యాక్టివిటీలకు ప్రాధాన్యం
  • ఒకటో తరగతి నుంచి సృజనాత్మకతకు పెద్దపీట 
  • 2022–23 ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

మనం చదివే చదువు.. జీవితాంతం గుర్తుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా..భవిష్యత్తుకు పునాదిగా భావించే పాఠశాల విద్యలో ఇది ఎంతో అవసరం. ఇలా గుర్తుండాలంటే బోధన వినూత్న పద్ధతుల్లో.. విద్యార్థులను ఆకట్టుకునేలా సాగాలి.అప్పుడే వారు ఆరు, ఏడు సంవత్సరాల్లో చదువుకున్న పాఠాలు ఏళ్లపాటు గుర్తుండిపోతాయి అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు క్రియేటివ్, యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ను అందిస్తూ.. చదివిన చదువు వారికి పది కాలాల పాటు గుర్తుండేలా పునాదులు వేస్తున్నాయి.. కేంద్రీయ విద్యాలయాలు. తాజాగా.. 2022–23 సంవత్సరానికి సంబంధించి కేవీల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. 

కేంద్రీయ విద్యాలయాలు

కేంద్రీయ విద్యాలయాల గురించి ఇటీవల కాలంలో తల్లిదండ్రుల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. వాస్తవానికి వీటిని ఎన్నో దశాబ్దాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆరు దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఏర్పాటైన విద్యా సంస్థలు ఇవి. అప్పటి నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనలోనూ మార్పులు తెస్తూ.. వైవిధ్యతకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి కేంద్రీయ విద్యాలయాలు.

చ‌ద‌వండి: Admission in APPSC-RIMC: ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా.. 

ఎన్‌ఈపీ మేరకు నిబంధనల్లో మార్పు

  • ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. నూతన విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా.. ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశానికి సంబంధించి కనిష్ట, గరిష్ట వయసుల్లో మార్పులు చేశారు.
  • ఒకటో తరగతిలో ప్రవేశించాలంటే.. మార్చి 31, 2022 నాటికి కనిష్టంగా ఆరేళ్లు, గరిష్టంగా ఎనిమిదేళ్ల మధ్యలో వయసు ఉండాలి. 
  • గత ఏడాది వరకు కనిష్ట వయసును అయిదేళ్లుగానే పేర్కొన్నారు. 
  • నూతన విద్యా విధానం ప్రకారం.. 5+3+3+4 విధానంలో ప్రాథమిక విద్యను ఫౌండేషనల్‌ దశగా పేర్కొనడం, మూడు నుంచి ఆరేళ్ల మధ్యలో ప్రీ–స్కూల్, ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్యలో ఒకటి, రెండో తరగతులకు నిర్దేశించారు.
  • దీనికి అనుగుణంగానే కేంద్రీయ విద్యాలయ సమితి కూడా తాజాగా ఒకటో తరగతి కనీస వయసును ఆరేళ్లకు పెంచింది. 

తొలుత రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం

కేంద్రీయ విద్యాలయాలను తొలుత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత(రక్షణ శాఖ) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేశారు. మొదట సెంట్రల్‌ çస్కూల్స్‌గా పిలిచేవారు. తర్వాత వీటినే కేంద్రీయ విద్యాలయాలుగా మార్చారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న వీటిని పర్యవేక్షించేందుకు కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అనే పేరుతో ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను సైతం నెలకొల్పారు.

అయిదు కేటగిరీలుగా ప్రాధాన్యతలు

  • కేంద్రీయ విద్యాలయాల్లోకి విద్యార్థులను ఎంపిక చేసే క్రమంలో ప్రస్తుతం అయిదు కేటగిరీలుగా ప్రాధాన్యతలను పేర్కొని.. దానికి అనుగుణంగా ఆ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 
  • బదిలీౖయెన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు.
  • కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ గవర్న్‌మెంట్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
  • బదిలీౖయెన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
  • రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
  • పై కేటగిరీలకు చెందని ఇతర వర్గాల పిల్లలు.

ఎంపికలోనూ ప్రాధాన్యత విధానం

  • ప్రవేశాలకు సంబంధించి పిల్లలను అయిదు కేటగిరీలుగా వర్గీకరించి ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో.. ప్రవేశాల ఖరారు, ఎంపిక విషయంలోనూ ప్రాధాన్యత విధానాన్ని అమలు చేస్తున్నారు.
  • తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు /సీబీఎస్‌ఈలతోపాటు జాతీయ/రాష్ట్ర స్థాయి క్రీడల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 
  • స్పెషల్‌ ఆర్ట్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.

ఒకటో తరగతి.. ఆన్‌లైన్‌ దరఖాస్తు

ఒకటో తరగతిలో ప్రవేశాలకు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆన్‌లైన్‌ పోర్టల్లో అందుబాటులో ఉండే దరఖాస్తు ద్వారా గరిష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి పూర్తిగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ విధానంలో సైతం ప్రాధాన్యతల వారీ విధానాలను అనుసరిస్తున్నారు. ఇది కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది.

వయో పరిమితి నిబంధనలు

  • కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించే విషయంలో తరగతుల వారీగా వయో పరిమితి నిబంధనలు అమలు చేస్తున్నారు. 
  • మార్చి 31వ తేదీని కటాఫ్‌ తేదీగా నిర్దేశించి.. ఆ తేదీ నాటికి విద్యార్థులకు వారు ప్రవేశం కోరుకుంటున్న తరగతుల వారీగా ఉండాల్సిన కనిష్ట, గరిష్ట వయో పరిమితులను నిర్దేశించారు. వాటి వివరాలు..
  • ఒకటో తరగతి: 6–8 ఏళ్లు, రెండో తరగతి: 6–8 ఏళ్లు, మూడో తరగతి: 7–9 ఏళ్లు, నాలుగో తరగతి:8–10 ఏళ్లు, ఐదో తరగతి: 9–11 ఏళ్లు, ఆరో తరగతి: 10–12 ఏళ్లు, ఏడో తరగతి: 11–13 ఏళ్లు, ఎనిమిదో తరగతి: 12–14 ఏళ్లు, తొమ్మిదో తరగతి:13–15 ఏళ్లు,పదో తరగతి: 14–16 ఏళ్లు. 
  • పీడబ్లూ్ల్యడీ విద్యార్థులకు రెండేళ్ల వయో సడలింపు ఉంటుంది.
  • రిజర్వేషన్‌: తాజా ప్రవేశాలకు సంబంధించి ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 7.5 శాతం సీట్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

ఇంటర్‌ ఎలాంటి వయోపరిమితి లేకుండానే

  • ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఎలాంటి వయో పరిమితి లేదు. అయితే పదో తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తర్వాత బ్రేక్‌ లేని వారికే ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లు, నిబంధనల ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

తొమ్మిదో తరగతికి.. ప్రవేశ పరీక్ష

  • ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా విద్యార్థుల మెరిట్,అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. 
  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఉండే ఈ అడ్మిషన్‌ టెస్ట్‌లో హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్‌సైన్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లలో ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు మెరిట్‌ జాబితా రూపొందించి పైన పేర్కొన్న కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆహ్లాదకర బోధన

పిల్లలను బడికి పంపించడం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాలు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకటో తరగతి పిల్లల విషయంలో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు ఉత్సాహంగా çసూల్‌కు వెళ్లేలా కేంద్రీయ విద్యాలయాల్లో విద్యా విధానం అమలవుతోంది. ముఖ్యంగా కొత్తగా చేరే పిల్లలు స్కూల్‌ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్‌ రెడీనెస్‌ పోగ్రామ్‌’ను రూపొందించాయి. ఈ పోగ్రామ్‌ పూర్తయిన అనంతరం టీచర్లు విద్యార్థుల్లో కింది దృక్పథాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షిస్తారు. అవి.. 

  • పరిసరాలను అర్థం చేసుకోవడం 
  • ఆత్మవిశ్వాసం 
  • పరిశీలన 
  • పరస్పర సంబంధాలు 
  • వర్గీకరణ  
  • ప్యాట్రన్‌లను అర్థం చేసుకొని, అనుకరించగలగడం 
  • భావ వ్యక్తీకరణ 
  • అవగాహన 
  • క్రియేటివ్‌ స్కిల్స్‌. దీంతోపాటు ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు ఐదు పాయింట్ల çసూచీని పాటిస్తున్నారు. 

నామ మాత్రపు ఫీజులు

కేంద్రీయ విద్యాలయాలు.. నామ మాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్‌ ఫీజు రూ.25, విద్యాలయ వికాస నిధి(రూ. 500), ట్యూషన్‌ ఫీజు, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ తదితర ఫీజులు ఉంటాయి. ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు అన్ని ఫీజులు కలిపి నెలకు రూ.500–600, ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1000 లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది. 

కేవీ ప్రవేశాలు 2022–23 ముఖ్య సమాచారం

  • ఒకటో తరగతికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఫిబ్రవరి 28, 2022–మార్చి 21, 2022
  • 2వ తరగతి నుంచి(ఇంటర్‌ ఫస్టియర్‌ మినహా) ఆఫ్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 8–ఏప్రిల్‌ 16.
  • పదకొండో తరగతి మినహా అన్ని తరగతులకు ప్రవేశాలకు చివరి తేదీ: జూన్‌6, 2022
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరం రిజిస్ట్రేషన్‌: ఇప్పటికే కేవీల్లో చదువుతున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.వీరికి పదో తరగతి ఫలితాలు వచ్చిన ఇరవై రోజుల్లోగా ఎంపిక జాబితా విడుదల చేస్తారు. 
  • కేవీ విద్యార్థులు కాని వారు సీబీఎస్‌ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవాలి. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/academic/admission&guidelines
  • ఒకటో తరగతి ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://kvsonlineadmission.kvs.gov.in/instructions.html 

ప్రతిభాపాటవాలను వెలికితీసేలా

 కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికితీసే విధంగా బోధన సాగిస్తున్నాయి. యాక్టివిటీ, క్రియేటివిటీ, ప్రాక్టికల్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు తాము పాఠంలో నేర్చుకున్న అంశాన్ని నిజ జీవితంలో అన్వయించే నైపుణ్యాలు చిన్నతనం నుంచే అలవడుతున్నాయి. దీంతో వారు భవిష్యత్తులో మెరుగ్గా రాణించే అవకాశం లభిస్తుంది.
–బి.వెంకటేశ్వరావు, ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయం

​​​​​​​
చ‌ద‌వండి: Admissions

Last Date

Photo Stories