Skip to main content

సరైన ప్రణాళికతోనే..గేట్ గెలుపు

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఏటా దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీపడే పరీక్ష. ఇందులో ప్రతిభ చూపితే.. ఉన్నతవిద్య పరంగా ఉపకార వేతనాలు, పేరున్న కాలేజీలో పీజీ చేసే చక్కటి అవకాశాలు సొంతమవుతాయి. మెరుగైన ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు.. పిలిచి మరీ ఉద్యోగాలిస్తాయి.
 తాజాగా గేట్-2018 ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువహటి విడుదల చేసింది. తెలుగు విద్యార్థి యాదగిరి శశాంక్... సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయ స్థాయి తొమ్మిదో ర్యాంకు సాధించాడు. పటిష్ఠ ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. ‘గేట్’లో గెలుపొందడం పెద్ద కష్టమేమీ కాదంటున్న శశాంక్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
మాది మంచిర్యాల. నాన్న రామ్మోహన్‌రావు శ్రీరాంపూర్‌లోని సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రికల్ ఫోర్‌మ్యాన్. అమ్మ రుక్మిణి, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలు. నేను ఒక్కడినే సంతానం. నా విద్యాభ్యాసం ఏడో తరగతి వరకు బెల్లంపల్లిలో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు గుడివాడలో పూర్తయింది.

ఇంజనీరింగ్ తర్వాత..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-కాలికట్‌లో 2014లో ఇంజనీరింగ్ పూర్తిచేశా. గేట్ ద్వారా పేరొందిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అవకాశాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నద్ధమయ్యా. 2015లో మొదటి ప్రయత్నంలోనే గేట్‌లో 114వ ర్యాంకు వచ్చింది. దాంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు తలుపు తట్టినప్పటికీ.. ఎంటెక్ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఐఐటీ మద్రాసులో చేరా.

ఐఈఎస్, గేట్‌కు ఏకకాలంలో..
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఎగ్జామ్, గేట్‌కు ఏకకాలంలో సన్నద్ధమయ్యా. ఈ ఏడాది జనవరి 7న ఐఈఎస్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దాని తర్వాత గేట్‌కు నెల వ్యవధి అందుబాటులో ఉంది. ఐఈఎస్, గేట్ సిలబస్ మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో.. ప్రిపరేషన్‌కు ఇబ్బంది కలగలేదు. ఉన్న కొద్దిపాటి సమయంలోనే మాక్‌టెస్టులు ఎక్కువగా రాశా. వాటి ఫలితాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకున్నా.

ప్రిపరేషన్ ఇలా..
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ తరగతులుండేవి. ఇంటికెళ్లాక గంటన్నర విరామం అనంతరం క్లాసు నోట్స్ చదివేవాడిని. ఆయా అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేవాడిని. ఎప్పటికప్పుడు మాక్‌టెస్టులు రాస్తూ పొరపాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేశా. ప్రిపరేషన్ ప్రారంభం నుంచి ప్రతి అంశాన్నీ అధ్యయనం చేస్తూ షార్ట్‌నోట్స్ రాసుకున్నా. దీంతో పరీక్ష సమయంలో రివిజన్ సులువైంది. పరీక్షకు ముందు షార్ట్ నోట్స్ ఎంతో ఉపయోగపడింది. కానీ, పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ విభాగం కష్టమనిపించింది. కారణం.. ఆ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు సాల్వ్ చేసి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

మాక్ టెస్టులు :
ప్రిపరేషన్‌లో మాక్ టెస్టులు అత్యంత కీలకం. తప్పులు సమీక్షించుకునేందుకు, సన్నద్ధతలో ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. గేట్ ఔత్సాహికులు కోచింగ్‌కు వెళ్లకున్నా.. టెస్టు సిరీస్‌లు రాయాలి. గేట్ పరీక్ష ట్రెండ్‌ను అర్థం చేసుకోవడానికి గత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి. ఏయే అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి? అధ్యాయాల వారీ వెయిటేజీ ఎలా ఉంటుంది? తదితర అంశాలు తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి.

అకడమిక్స్‌పై పట్టుతోనే..
గేట్ అంటే ఎంతో క్లిష్టమనే భావన చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. బీటెక్ స్థాయిలో అకడమిక్ సిలబస్ అంశాలపై పట్టు సాధిస్తే గేట్‌లో ర్యాంకు సాధించడం తేలికే. గేట్‌లో ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. కాబట్టి బీటెక్ స్థాయిలోనే అకడమిక్ అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదివితే ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. గేట్ ఔత్సాహికులు మొదటి నుంచి షార్ట్‌నోట్స్ రాసుకుంటూ, ఆన్‌లైన్ పరీక్షలు రాయాలి. చివర్లో రాయొచ్చనే ధోరణి సరికాదు. ప్రిపరేషన్ పూర్తయిన రోజు నుంచే ఆన్‌లైన్ టెస్టులు రాయడం లాభిస్తుంది. విద్యార్థులు కనీసం ఏడాది ముందు నుంచి గేట్ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అంటే.. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే గేట్‌కు సన్నద్ధమవ్వడం మంచిది. అప్పటికే ఇంజనీరింగ్ కరిక్యులం పూర్తవుతుంది కాబట్టి ఇంజనీరింగ్ చివరి సంవతర్సంలోనే మంచి ర్యాంకు పొందడానికి వీలుంటుంది. కోచింగ్ తప్పనిసరి కాకున్నా .. సందేహాల నివృత్తి, ప్రస్తుత పరీక్షల సరళి, పరీక్ష విధానం తదితరాలను అర్థం చేసుకోవడానికి శిక్షణ ఉపయోగపడుతుంది.

ఐఈఎస్ సాధన లక్ష్యం :
ప్రస్తుతం ఐఈఎస్ మెయిన్‌‌సకు సిద్ధమవుతున్నా. ఈ ఏడాది జూలైలో మెయిన్ పరీక్ష ఉంది. ఐఈఎస్ సాధన లక్ష్యంగా చదువుతున్నాను. గేట్ స్కోరు ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలకు ఇప్పటివరకు దరఖాస్తు చేయలేదు. భవిష్యత్తులో ఏవైనా ఉద్యోగ ప్రకటనలు వెలువడితే వాటికి దరఖాస్తు చేసుకుంటా.

చదివిన పుస్తకాలు :
సివిల్ ఇంజనీరింగ్‌లో స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ట్రాన్‌‌సపోర్టేషన్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ముఖ్యమైనవి. సాయిల్ మెకానిక్స్‌కు గోపాల్ రంజన్; ట్రాన్‌‌సపోర్టేషన్ ఇంజనీరింగ్‌కు ఖన్నా అండ్ జస్టో; ఫ్లో ఇన్ ఓపెన్ చానెల్స్‌కు కె.సుబ్రమణ్య పుస్తకాలను రిఫర్ చేశాను.

ప్రొఫైల్..
  • గేట్ మార్కులు: 87.35/100.
  • ఆలిండియా ర్యాంకు: 9
  • గేట్ స్కోరు: 954
  • పదో తరగతి మార్కులు: 85 శాతం.
  • ఇంటర్మీడియెట్ మార్కులు: 92.2 శాతం.
  • ఎంసెట్ ర్యాంకు: 1321.
  • బీటెక్ : 74 శాతం
  • ఎంటెక్ : 86 శాతం
Published date : 19 Mar 2018 06:27PM

Photo Stories