నేను నా బాల్యంలోనే సముద్రంతో ప్రేమలో పడ్డాను..: ఫస్ట్ ఉమెన్ మెరైన్ ఇంజనీర్ సోనాలీ
ఆమె వేసిన మార్గం మరికొందరు అమ్మాయిల్లో ధైర్యం నింపింది. ఆమే సోనాలీ బెనర్జీ. ''నేను నా బాల్యంలోనే సముద్రంతో ప్రేమలో పడ్డాను'' అంటూ నవ్వుతూ చెబుతుంది సోనాలీ. చిన్నతనంలో మొదటిసారి ఓడలో ప్రయాణించినప్పుడు అదే ఓడలో పనిచేయాలని కన్న కల పెద్దయ్యాక సాకారం చేసుకుంది.
కష్టమైన ఇష్టం..
సోనాలీబెనర్జీ అలహాబాద్‌లో పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సముద్రం, ఓడ ప్రయాణం అంటే మహా ఇష్టం. ఓడల ద్వారానే ప్రపంచం మొత్తం ప్రయాణించాలనుకుంది. ఆమె ఇష్టాన్ని కనిపెట్టిన మేనమామ కలను సాకారం చేసుకోవాలంటే మెరైన్ ఇంజినీర్ అవమని ప్రోత్సహించాడు. 1995లో ఐఐటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెరైన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందింది. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక, షిప్పింగ్ సంస్థలో 6 నెలల ఫ్రీ కోర్సుకు ఎంపికయ్యింది. నాలుగేళ్ల కష్టం తర్వాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. మెరైన్ ఇంజనీర్ పని ఓడ మరమ్మత్తు, నిర్వహణ. ''నేటి ఆధునిక నౌకలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్ ఈ తాజా సాధనాలను అర్థం చేసుకోవాలి. ఈ పరికరాలను ఆపరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి'' అంటోంది సోనాలీ.
తండ్రికి అస్సలు ఇష్టం లేదు..అయినా
సోనాలి మెరైన్ ఇంజినీర్ అవడం అప్పట్లో ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అది పురుషుల రంగం. అందులో ఓ ఆడపిల్ల వెళ్లి ఎలా పనిచేయగలదు అనేవాడు. కానీ, సోనాలి ఆడపిల్లలు కూడా పురుషుల రంగంలో పనిచేయగలరు అని తండ్రికి నిరూపించింది. అయితే, పురుషుల రంగంలో పనిచేయడం సోనాలీకి అంత సులభం కాలేదు. తనతో చదువుతున్న చాలా మంది అబ్బాయిలు కూడా ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికే ప్రయత్నించారు. కానీ అధ్యాపకులు మాత్రం ఎప్పుడూ ఆమె ప్రోత్సహించారు.
ఏకైక మహిళ :
మెరైన్ ఇంజనీర్ అయినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. కోల్‌కతా సమీపంలోని తారత్లాలో ఉన్న మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశం పొందిన తరువాత, 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తెలిసింది. దీంతో మొదట్లో సోనాలికి ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల ఆమెను ఎక్కడ ఉంచాలి అని ఇటు తల్లిదండ్రులు, అధ్యాపకులు చర్చించారు. సుదీర్ఘ చర్చల తరువాత ఆమెను ఆఫీసర్స్ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియాలో శిక్షణ పూర్తి చేసింది. నాలుగేళ్ల కృషి తరువాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. ఓడలోని మిషన్ రూమ్ బాధ్యతలు చేపట్టింది. సమర్థవంతంగా విధులను నిర్వరిస్తోంది.