Skip to main content

ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో..తెలుగు యువకుడికి రూ.కోటిన్నర జీతం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్‌లో రూ.కోటిన్నర వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు 28 ఏళ్ల తెలుగు యువకుడు వివేక్‌ గిర్రెడ్డి.

ముంబై డాన్‌బాస్కో స్కూల్‌లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివిన వివేక్‌ ‘ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌’లో బీఏ చదివేందుకు తొలుత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరాడు. తొలి ఏడాది పూర్తయిన తర్వాత కెనడా మాంట్రియల్‌లోని మెక్‌గిల్‌ వర్సిటీకి తన అడ్మిషన్‌ బదిలీ చేసుకుని అక్కడ మూడేళ్ల పాటు చదివి డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా అట్లాంటాలోని జార్జ్‌టెక్‌ వర్సిటీలో 100 శాతం స్కాలర్‌షిప్‌తో ఎంబీఏలో చేరాడు.

ఇటీవల..
ఈ ఏడాది మేలో వివేక్‌ తన ఎంబీఏ కోర్సును పూర్తి చేయనుండగా, ఇటీవల అమెజాన్‌ నిర్వహించిన ‘ఫైనాన్షియల్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’కింద ‘సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌’గా ఎంపికయ్యాడు. మూలవేతనం, బోనస్, ఇతర ప్రోత్సాహాకాలు కలుపుకొని ఏటా రూ.కోటిన్నర వార్షిక వేతనం లభించనుంది. వివేక్‌ తండ్రి సూర్యనారాయణరెడ్డి, తల్లి భానురెడ్డి. కాకినాడకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Published date : 29 Jul 2021 06:10PM

Photo Stories