Skip to main content

పక్కా ప్రణాళికతో.. ఐఈఎస్ సాధ్యమే

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామ్‌ను యూపీఎస్సీ జాతీయస్థాయిలో నిర్వహిస్తుంది. ఐఈఎస్ ఎగ్జామినేషన్ -2015 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో సూర్యాపేటకు చెందిన విద్యార్థి షేక్ సిద్ధిక్ హుస్సేన్ మొదటి ర్యాంకు సాధించాడు. ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్‌లో కొలువు.. మంచి వేతనం అయినా సిద్ధిక్ అక్కడితో సంతృప్తి పడలేదు. సమాజానికి నేరుగా ఉపయోగపడే ఉద్యోగం చేయాలకున్నాడు. పక్కా ప్రణాళికతో ఐఈఎస్ పరీక్షలకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. సిద్ధిక్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే...
మాది నల్లగొండ జిల్లా, సూర్యాపేట. నాన్న షేక్ హుస్సేన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అమ్మ కృష్ణవేణి గృహిణి. పదో తరగతి వరకూ నా విద్యాభాసం స్థానికంగా ఉన్న అంజలి స్కూల్లో జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివాను. 2012లో ఐఐటీ గాంధీనగర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అనంతరం టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీలో ఏడాది పాటు పనిచేశాను. అక్కడ వేతనం బాగున్నప్పటికీ, సంతృప్తి లభించలేదు. సమాజానికి ఉపయోగపడే పనిచేయాలనుకున్నాను. అదే సమయంలో చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగమే చేయాలనేది నా కోరిక. నాకు ఉన్న ఆసక్తి, మిత్రుల సలహాతో ఐఈఎస్‌కు ప్రిపేర్ అవ్వాలని నిశ్చయించుకున్నాను.

స్ఫూర్తినిచ్చిన తల్లిదండ్రులు...
నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఇంట్లో చెప్పినప్పుడు అమ్మానాన్న ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. నేను సాధించగలననే నమ్మకాన్ని ఉంచి ప్రోత్సహించారు. అమ్మ నాన్నల ప్రోత్సాహంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. హైదరాబాద్‌లో కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. అక్కడి ఫ్యాకల్టీ సహకారంతో సబ్జెక్ట్‌పై పట్టు సాధించాను.

అనుసరించిన వ్యూహం..
ఎప్పుడైతే ఐఈఎస్ లక్ష్యంగా నిర్ణయించుకున్నానో సమయం వృథా చేయకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాను. ఐఈఎస్‌లో 5 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ ఎబిలిటీ ప్రిపరేషన్‌ను పరీక్ష సమయానికి నాలుగు నెలల ముందు నుంచి ప్రారంభించాను. రోజులో రెండు గంటలు జనరల్ స్టడీస్ కోసం, గంట ఇంగ్లిష్‌కు కేటాయించాను. కరెంట్ అఫైర్స్ కోసం వివిధ మంత్లీ మేగజైన్స్‌తో పాటు సాక్షి భవిత, విద్య పేజీలను చదివాను. పేపర్ 2, 3 ఆబ్జెక్టివ్ విధానంలో; పేపర్ 4, 5 కన్వెన్షనల్ విధానంలో ఉంటాయి.

గత 14 ఏళ్ల ప్రశ్నపత్రాల సాధన
ఆబ్జెక్టివ్ విధానంలోని సిలబస్ ప్రిపరేషన్‌లో భాగంగా ప్రారంభంలో ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై పట్టు సాధించాను. ముఖ్యమైన ఫార్ములాలు, థియరీలను రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్ చేసుకున్నాను. అన్నిటికంటే ప్రధానంగా గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం చాలా లాభించింది. గత 14 ఏళ్ల ప్రశ్నపత్రాలను ఒక్కొక్కటి ఏడుసార్లు చొప్పున ప్రాక్టీస్ చేశాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆబ్జెక్టివ్ పేపర్లలో మంచి స్కోరు చేయగలిగాను. ఆబ్జెక్టివ్ విధానంలోని పేపర్లల్లో మంచి స్కోరు చేయాలంటే అన్ని టాపిక్‌లను తప్పక చదవాలి.

కన్వెన్షనల్ పేపర్స్ కీలకం
ఆయా సబ్జెక్ట్‌లను ఆబ్జెక్టివ్ విధానంలోని పూర్తిగా చదివాక కన్వెన్షనల్ విధానంలోని పేపర్లకు సన్నద్ధమవటం ప్రారంభించాను. ప్రశ్నలను సాల్వ్ చేసేటప్పుడు నేను ఏ విధంగా వాటిని సాల్వ్ చేస్తున్నానో నోట్ చేసుకున్నాను. ఆ నోట్స్ రివిజన్ చేసేటప్పుడూ చాలా ఉపయోగపడింది. కన్వన్షినల్ పేపర్స్ ప్రిపరేషన్‌లో భాగంగా గత ఏడేళ్ల పాత ప్రశ్నపత్రాలను ఒక్కొక్కటి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేశాను. కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ అనాలసిస్ టాపిక్స్ మినహా సిలబస్ అంతా ప్రిపేరయ్యాను. కన్వెన్షనల్ పేపర్లు ఐఈఎస్‌లో చాలా కీలకం, అందుకే వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాను. పర్సనాలిటీ టెస్ట్ విషయంలోనూ గత ఇంటర్వ్యూ ప్రశ్నలను సాధన చేశాను. కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్‌ను మెరుగుపర్చుకోవడానికి అద్దం ముందు బాగా ప్రాక్టీస్ చేశాను. మాక్ టెస్ట్‌ల వల్ల ఐఈఎస్ సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

టైం మేనేజ్‌మెంట్ కీలకం
నా విజయానికి మరో ముఖ్య కారణం టైం మేనేజ్‌మెంట్. సిలబస్ పూర్తి చేసుకోవడానికి వీక్లీ, మంత్లీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాను. రోజుకు కనీసం 12 గంటల పాటు చదివాను. అనుకున్న సమయంలో సిలబస్ పూర్తి అయ్యేలా జాగ్రత్తపడ్డాను. సరైన ప్రణాళిక లేకుంటే జీవితంలో ఎటువంటి లక్ష్యాలను చేరుకోలేం. నాకు ఆల్‌ఇండియా మొదటి ర్యాంకు వచ్చిందని తెలిసినప్పుడు కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఆధునికీకరణ చెందుతున్న రైల్వేలో చేరి అందులో భాగస్వామిని కావాలనుకుంటున్నాను.

సలహాలు..
ఐఈఎస్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు సాధారణంగా జనరల్ స్టడీస్‌ను నిర్లక్ష్యం చేస్తారు. కన్వెన్షనల్ పేపర్స్ కోసం పరీక్షకు 3 లేదా 4 నెలల ముందు మాత్రమే ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. అలా చేయడం వల్ల సిలబస్ పూర్తి కాక, తక్కువ స్కోరు వస్తుంది. అందువల్ల ప్రిపరేషన్‌ను ముందుగా ఆరంభించాలి. సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. మాక్ టెస్ట్‌ల్లో మన శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కన్వెన్షనల్ పేపర్‌కు సంబంధించి ఎగ్జామ్‌లో తెలియని ప్రశ్నలను చూసి భయాందోళనలు చెందొద్దు. మొదట ఎక్కువ స్కోరు వచ్చే ప్రశ్నలను ప్రయత్నించాలి. తర్వాత తక్కువ స్కోరు ఉన్న ప్రశ్నలను సాల్వ్ చేయాలి. కోచింగ్ వల్ల ఏయే అంశాలు చదవాలో స్పష్టత వ స్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. నిబద్ధత, టైం మేనేజ్‌మెంట్‌లు.. విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. గత పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా విజయావకాశాలు మెరుగువుతాయి. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఐఈఎస్ సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

అకడమిక్ రికార్డ్

పదో తరగతి మార్కులు:

529

ఇంటర్మీడియట్:

909

జనరల్ ఎబిలిటీ టెస్ట్:

113.88

ఆబ్జెక్టివ్:

ఇంజనీరింగ్ - 1

140.55

ఇంజనీరింగ్ - 2

112.78

కన్వెన్షల్ పేపర్లు:

ఇంజనీరింగ్ - 1

168

ఇంజనీరింగ్ - 2

102

మొత్తం:

637

పర్సనాలిటీ టెస్ట్:

135

మొత్తం:

772

Published date : 19 Jan 2016 12:14PM

Photo Stories