Skip to main content

నిర్దిష్ట ప్రణాళిక.. విజయ గీతిక..జేఈఈ మెయిన్‌ జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకర్

పెద్దయ్యాక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుకోవాలన్న కల.. ఓ రైల్వే గార్డు కుమార్తెను జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలబెట్టింది. జేఈఈ మెయిన్‌లో ఐదో ర్యాంక్‌ను సాధించేలా చేసింది. పదేళ్ల ప్రాయం నుంచే కలను సాకారం చేసుకునే దిశగా పట్టుదలతో అడుగులు ముందుకు వేసింది. పక్కా ప్రణాళిక, శ్రద్ధాసక్తులే ఆయుధాలుగా మలచి చదువుల్లో రాణిస్తున్న సాదాగర్ అఫ్జల్ షమ విజయగాథ.

కుటుంబ నేపధ్యం:
మాది గుంటూరు జిల్లా మంగళగిరి. నాన్న సాదాగర్ అబ్దుల్ ఖాదర్ బాబావలి. రైల్యే గార్డుగా పనిచేస్తున్నారు. అమ్మ న స్రీన్ సుల్తాన్. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇద్దరన్నయ్యలు. ఇమ్రాన్ బాషా, ఇర్ఫాన్ ఐఐటీల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

సందేహాలు నివృత్తి కావాల్సిందే:
చదువు విషయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా వాటి నివృత్తి కానిదే నిద్రపోను. చిన్ననాటి నుంచే ఇది అలవాటుగా మారిపోయింది. టెన్త్, ఇంటర్‌లో కూడా అలానే చేశాను. దీంతో ఏదైనా టాపిక్ విషయంలో లోతుగా ఆలోచించడం అలవాటుగా మారిపోయింది.

విషయ పరిజ్ఞానమే మిన్న:
చదువంటే మార్కులు కాదు విషయపరిజ్ఞానం. నేను మార్కుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పాఠ్యాంశంలోని విషయానికి ప్రాధాన్యమిస్తాను. అలా చదివితే ఫలితం వాటంతటదే వస్తుంది.

దీర్ఘకాలిక ప్రణాళికతో:
జేఈఈ ఎంట్రన్స్ కోసం ఇంటర్‌లో దీర్ఘకాలిక ప్రణాళికతో చదివాను. సబ్జెక్ట్‌లను చదవడంలో సానుకూలతను పాటించాను. కష్టమనిపించే వాటిని తెల్లవారుజామున చదివాను. కష్టంగా ఉండే టాపిక్‌లపై మరింత సమయం కేటాయించాను.

ఎంసెట్‌కు వారం రోజులే:
మొదట జేఈఈ-అడ్వాన్‌‌సడ్‌పైనే నా దృష్టి. దీనిపైనే మొత్తం సమయం వెచ్చించాను. దీంతో ఎంసెట్‌కు వారం రోజులు మాత్రమే ప్రిపేరయ్యాను. ఓపెన్ కేటగిరీలో 148వ ర్యాంక్ వచ్చింది. ఇది మైనార్టీ కేటగిరీలో మొదటి ర్యాంక్.

బృందచర్చలు:
కాలేజీ విరామ సమయాల్లో క్లిష్టమైన సబ్జెక్టులపై గ్రూప్ డిస్కషన్ చేసేవాళ్లం. అధ్యాపకుల సూచనలు తీసుకునేవాళ్లం. అప్లికేషన్ ఓరియంటేషన్ ప్రశ్నలు ఎలా వీలైతే అలా వేసుకొని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాళ్లం. ఇలా చేయడంతో కీలక అంశాలు శాశ్వతంగా గుర్తుండిపోయేవి.

గ్రాండ్‌టెస్ట్‌లతో వేగం, కచ్చితత్వం:
ప్రిపరేషన్ పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు రాశాను. వీటితో వేగం, కచ్చితత్వం అలవడింది. అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్‌ల ద్వారా మనం అకాడమిక్‌గా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవచ్చు.

చదివిన పుస్తకాలు:
జేఈఈ కోసం అకాడమీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. మరింత అదనపు సమాచారం కోసం ఫిజిక్స్‌లో హెచ్‌సీ వర్మ, డీసీ పాండే, రెజ్నిక్ ఎండ్ హాలిడే, మ్యాథ్స్‌లో అరిహంత్ సిరీస్, ఎస్‌ఎల్ లానీ, కెమిస్ట్రీలో ఫిజికల్ రంజీత్ షాయ్,పీటర్ అట్కిన్స్ పుస్తకాలను చదివాను. ఆర్గానిక్స్‌లో సాలమాన్స్ జేఆర్ వాయిడ్,అహ్లూవాలియా. ఇనార్గానిక్‌లో జేడి.లీ, ఒపి టాండన్ పుస్తకాలను చదివాను.

జేఈఈ రాసే వారికి సలహా:
ప్రతి విషయాన్ని మార్కుల కోసం కాకుండా ఆసక్తితో చదవాలి. పరీక్షకు సన్నద్ధం కావడంలో చివరి ప్రశ్నకు జవాబు రాసే వరకు ఏకాగ్రతతో వ్యవహరించాలి.

స్వయంసమృద్ధి ఆవిష్కరణలు:
స్వశక్తితో నిలదొక్కుకునే ఆవిష్కరణలు రావాలి. ఈరోజు ఇంధనం కోసం దేశం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అలాకాకుండా పర్యావరణానికి హాని లేని, సౌరశక్తి సామాన్యులకు అందుబాటులో తీసుకు వచ్చేలా ఆవిష్కరణలు రావాలి విదేశాలపై ఆధారపడే సంస్కృతి నుంచి స్వయం సమృద్ధి దిశగా సాగేలా పరిశోధనలు రావాలి. ఆ దిశగా నా వంతు కృషి చేస్తా.

ఆటలూ ముఖ్యమే:
కేవలం చదువేకాదు. స్నేహతులతో కలిసి ఔట్‌డోర్ గేమ్స్ అడతాను. పాఠశాలలో నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఎంతో ఇష్టం.

లక్ష్యం:
పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా రాణించాలి. నిరుద్యోగం, పేదరికం అనే మాటను దేశం నుంచి దూరం చేయాలి.

అకడమిక్ ప్రొఫైల్
  • టెన్త్: 9.8/10
  • ఇంటర్: 991
  • ఎంసెట్: 62వ ర్యాంక్ (మైనారిటీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్)
  • కెవైపీవై ఆల్ ఇండియా 14వ ర్యాంక్,
  • మ్యాథ్స్ ఒలింపియాడ్: 3 గోల్డ్ మెడల్స్,
  • జేఈఈ అడ్వాన్స్‌డ్: 97వ ర్యాంక్
  • జేఈఈ మెయిన్: 5వ ర్యాంక్
Published date : 19 Jul 2014 12:33PM

Photo Stories