Skip to main content

మైక్రోసాఫ్ట్‌లో రూ.10 లక్షల జాబ్... విశ్వాసంతోటే వచ్చిందంటున్న మోచర్ల శ్రీధర్

‘‘అపజయం ఎదురైనా.. మరో ప్రయత్నంలో విజయం సాధించగలననే ఆత్మ విశ్వాసమే తనకు పేరున్న ఐటీసంస్థలోకి ఆహ్వానం పలికేలా చేసిందంటున్నా’’ డు సీబీఐటీ విద్యార్థి మోచర్ల శ్రీధర్. మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా సెలక్ట్ అవడం కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొంటున్నాడు. ఇటీవల సీబీఐటీలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 200 మందితో పోటీపడి కార్పొరేట్ కొలువు సంపాదించిన శ్రీధర్.. తన సక్సెస్ సీక్రేట్‌ను భవితతో పంచుకున్నారు.

ఆనందం కాదు సంతృప్తి
మైక్రోసాఫ్ట్‌కు ఎంపిక కావటం ఆనందంగా కంటే.. చాలాసంతృప్తిగా ఉంది. కష్టానికి ఫలితం దక్కుతుందనే మాట నిజమేనని రుజువైంది. చదువే ధ్యాసగా ఉండి ఎక్స్‌ట్రా కరిక్యులార్ యాక్టివిటీస్లో ప్రావీణ్యం లేకపోవటంతో మొదటిసారి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్‌కాలేకపోయానని కొంచెం బాధపడ్డా. అప్పుడు చేసిన తప్పులను సరిదిద్ధుకుని కోరుకున్న సంస్థలో ఉద్యోగం సంపాదించగలిగా.

తాతయ్య మార్గదర్శనం
మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బాలసత్యనారాయణ హెచ్.బి.సిలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ ఉమ గృహిణి. అన్నయ్య సూర్యప్రకాష్ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. యాభైఏళ్ల క్రితమే తాతయ్య ఎం.ఎస్.మూర్తిగారు ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఏదైనా సమస్యతో బాధపడుతున్నపుడు.. ‘ మా తరంతో పోల్చితే మీరు పడే ఇబ్బందులు చాలా చిన్నవంటూ తాను ఎప్పుడూ చెబుతు’ండేవారు. స్కూలుకు వెళ్లాలంటే ఐదారుమైళ్లు నడిచామంటూ తన గతాన్ని వివరించేవారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు చదివిన తాతయ్యే మార్గదర్శి. ఇప్పటికీ మాకు తానే గైడ్ చేస్తుంటారు. మధ్యతరగతి కుటుంబం నుంచి పట్టుదలతో ఇంజనీరింగ్ డిప్లోమా పూర్తిచేసిన నాన్న. ఇంటికి అండగా ఉండాలనే సంకల్పంతో అమ్మ టీచర్‌గా పనిచేసిన రోజులు మాకు స్ఫూర్తి.

కంప్యూటర్‌తో దోస్తీ
స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి కంప్యూటర్‌తో దోస్తీ. పదోతరగతి వెలేరియం గ్రామర్ స్కూల్(సికింద్రాబాద్), ఇంటర్ నారాయణ కాలేజీ, ఇంజనీరింగ్(సి.ఎస్.ఈ) సీబీఐటీ. స్కూల్ నుంచే కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు. గేమ్స్‌ను ఏ విధంగా క్రియేట్ చేస్తారనే విషయాలు తెలుసుకున్నా. ఆ ఇష్టంతోనే ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుతో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్స్ తీసుకున్నా. ఫస్టియర్‌లో ఇక్కడ జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఇబ్బందిపడ్డా. తర్వాత ఫ్యాకల్టీ సాయంతో సబ్జెక్టులను ఆకళింపుచేసుకున్నా.

సబ్జెక్టుపై పట్టు పక్కా
ఇంజనీరింగ్‌లో చేరగానే కెరీర్‌లో స్ధిరపడినట్లు కాదు. కార్పొరేట్ రంగంలో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలంటే సబ్జెక్టుపై గట్టిపట్టు ఉండాలి. ఫస్టియర్‌లో కొద్దిగా తడబడినా సెకండియర్ నుంచి పికప్ కాగలిగా. ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టువర్క్, టీమ్‌వర్కు, ఈవెంట్‌మేనేజ్‌మెంట్ ఇలా సాధ్యమైనంత వరకూ అన్ని ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేశా. దానివల్ల టీమ్‌మేనేజ్‌మెంట్, టెక్నాలజీలో వస్తున్న నూతనమార్పులపై అవగాహన పెరిగింది. మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ అంశంపై ఫ్రెండ్స్ కలసి రూపొందించిన టెక్నికల్ ప్రాజెక్టు, టీమ్‌వర్కు యూజ్ అయ్యాయి.

తప్పులను ఇలా సరిదిద్దుకున్నా
గతేడాది మైక్రోసాఫ్ట్, డెలాయిట్ కంపెనీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఎగ్జామ్స్‌లో ఒత్తిడికి గురవడం, పశ్నచదవకుండానే జవాబులు రాయడం, రెజ్యూమె సరిగా నింపకపోవడం

వంటి పొరపాట్లతో రాతపరీక్షలోనే ఆగిపోయా. దీంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించాలనే కోరిక ముగిసినట్లే అనుకున్నా. కానీ తర్వాత సీనియర్లు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్.ఎల్.ఎన్.రెడ్డి ప్రోత్సహించారు. దీంతో గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకున్నా. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీకు ఎంపిక అవాలంటే టెక్నాలజీ బేస్డ్ నాలెడ్జ్ ముఖ్యమని గ్రహించి ఆ దిశగా సాధనచేశా. వచ్చే అగస్టు లోపు కంపెనీలో జాయిన్ అవ్వాల్సి ఉంది. అక్కడ నాలుగు విభాగాల్లో పని చేయాలి. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.11లక్షల వరకూ ఉంటుంది. కొంతకాలం పనిచేశాక భవిష్యత్తులో ఏం చేయాలనేది నిర్ణయించుకుంటా.

ఆ మూడు పుస్తకాలు కీలకం
క్యాంపస్‌ప్లేస్‌మెంట్స్ కోసమంటూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నా సిలబస్ ఫాలో అవుతూcracking the coading interview, programming pearls, data structures and algorithms (నరసింహన్ కురుమంచి)పుస్తకాలు చదివా.geeks for geeks.org వెబ్‌సైట్ చూసేవాణ్ని. వాటిలో ఆన్‌లైన్ ఎగ్జామ్స్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలను ఎదుర్కొవటం వంటి అంశాలున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎంపిక ప్రక్రియ ఐదు దశలుగా జరిగింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌కు 200 మంది హాజరైతే చివరకు సెలక్ట్ అయింది 8 మంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, రాతపరీక్ష, మూడు ఇంటర్వ్యూలు. ఇందులో రెండు ఇంటర్వ్యూలు టెక్నాలజీ బేస్ట్, మూడోది హెచ్.ఆర్. ఆన్‌లైన్ టెస్ట్‌లో 20 ప్రశ్నలు 15 నిమిషాల్లో జవాబులివ్వాలి. రాతపరీక్షలో సీప్లస్, ఇంజనీరింగ్ సబ్జెక్టులు, అటిట్యూడ్ అంశాలున్నాయి. ఇంటర్వ్యూ మూడు దశల్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. రెజ్యూమె నుంచే నన్ను చాలా ప్రశ్నలడిగారు. ఇంటర్వ్యూలో ప్రాజెక్టువర్క్, టీం వర్కు, ఈవెంట్ మేనేజ్‌మెంట్,హాబీస్, పజిల్స్ వంటి వాటిపై ప్రశ్నలు వేస్తారు. చెప్పే సమాధానం బట్టి నిజాయితీ, సామర్థ్యం అంచనా వేస్తారు.

ఇదే నా సలహా
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ సంపాదించాలంటే కావాల్సినవి -కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ అప్‌డేట్, రెజ్యూమె. ఇక రెజ్యూమెలో అనవసరమైన అంశాలు ఇవ్వొద్దు. ఎందుకంటే రెజ్యూమెలోని అంశాలను ఎక్కువగా విశ్లేషించమని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులనే ప్రశ్నలు వేయమంటారు. రెజ్యూమె ప్రాపర్‌గా ఉండాలి. పెద్ద కంపెనీల్లో జాబ్స్‌కు వెళ్లేముందు మీరు చేసిన ప్రాజెక్టువర్క్‌పై పూర్తి కమాండ్‌ను సాధించాలి. ఎక్స్‌ట్రా కరిక్యులార్ యాక్టివిటీస్, లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌గా ఉండాలి. జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీకు మీరెందుకు అవసరమో తెలియజెప్పాలి. మీ సొంత ఆలోచనలు, సంస్థ మనుగడకు మీ సామర్థ్యం, సృజనాత్మక ఏ విధంగా దోహదపడతాయో నిజాయితీగా తెలియజేయాలి. కాలేజీలో ఉండగానే కెరీర్‌లో స్ధిరపడాలంటే పేపర్ చదవడం, టీవీ చూడటం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. సీనియర్ల సలహాలు, సూచనలతో తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వం, ఓటమికి కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాలను గుర్తించడం ద్వారా మంచి కంపెనీలో కెరీర్‌ను ప్రారంభించవచ్చునేది నా సలహా.

ప్రొఫైల్
మోచర్ల శ్రీధర్
పదోతరగతి 87 శాతం
ఇంటర్మీడియట్ 92.5
ఎంసెట్ ర్యాంకు 1400
ఇంజనీరింగ్ 89 శాతం
Published date : 26 Aug 2013 05:27PM

Photo Stories