Skip to main content

ఆ లక్ష్యమే గేట్ దాటించింది!

బీటెక్ మూడో సంవత్సరంలోనే భవిష్యత్ దిశగా ప్రణాళిక.. కెరీర్, ఉన్నత విద్య ఏదైనా ‘గేట్’ దాటాల్సిందే.. దాంతోనే సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకోవడం సాధ్యమవుతుంది.. ఇదే లక్ష్యంగా శ్రమించి.. ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నా అంటున్నారు.. గేట్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో) జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన రాపోలు జయప్రకాశ్. లక్ష్యం దిశగా ప్రకాశించిన అతని సక్సెస్ స్టోరీ...

స్వస్థలం వరంగల్ జిల్లా కేసముద్రం. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఏఐఈఈఈలో ర్యాంకుతో నిట్-వరంగల్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)లో ప్రవేశం లభించింది. ఇంటర్మీడియెట్ వరకు అకడమిక్ పరంగా మంచి స్కోర్లు సాధించే వాణ్ని. నిట్‌లో ప్రవేశంతోనే భవిష్యత్ లక్ష్యంపై అవగాహన ఏర్పడింది. ఈ దిశగా అక్కడి ప్రొఫెసర్లు అందించిన సహకారం ఎంతో విలువైంది. ఈ క్రమంలోనే గేట్ ర్యాంకును లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. అంతేకాకుండా గతేడాది గేట్‌లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రవితేజ మా క్యాంపస్ కావడం కూడా నాలో మరింత స్ఫూర్తినింపింది.

మూడో ఏడాది నుంచి:
బీటెక్ రెండో సంవత్సరంలోనే గేట్ గురించి ఆలోచన, అవగాహన ఏర్పడినప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించింది మాత్రం మూడో సంవత్సరం నుం చే. మూడో సంవత్సరం(రెండు సెమిస్టర్లు) పూర్తయ్యే నాటికి.. అకడమిక్స్‌తో సమాంతరంగా గేట్ ప్రిపరేషన్ సాగించాను. ఆ తర్వాత వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు కోచింగ్ తీసుకున్నాను. గతేడాది సెప్టెంబర్ నుం చి ఈ ఏడాది మార్చి వరకు సమయాన్ని పూర్తి స్థాయిలో గేట్ కోసమే కేటాయించాను. అకడమిక్ సిలబస్, గేట్ సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ రోజుకు నాలుగైదు గంటలు కష్టపడే వాణ్ని. వారాంతాల్లోనైతే ప్రిపరేషన్ కోసం తొమ్మిది గంటలు కేటాయించాను.

క్యాంపస్ సెలక్షన్ వచ్చినా:
గతేడాది నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఎల్ అండ్ టీ సంస్థకు ఎంపికయ్యాను. అయితే గేట్‌లో ర్యాంకు ద్వారా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లలో ఉద్యోగం సాధించాలని లక్ష్యం ఉండేది. దాంతో గేట్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిచ్చాను. అంతేకాకుండా పీఎస్‌యూలలో ఉద్యోగం చేయడం ద్వారా సమాజానికి పరోక్షంగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో కూడా గేట్ దిశగా అడుగులు వేశాను. ప్రస్తుతం ఉద్యోగానికి ప్రాధాన్యం. నాలుగైదేళ్లు అనుభవం గడించాక ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తాను.

కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ :
లక్షల మంది పోటీ పడే గేట్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ ఆధారితంగానే ఉంటాయి. గత ప్రశ్నపత్రాల పరిశీలన, మాక్ టెస్ట్‌ల ఆధారంగా ఈ విషయాన్ని గ్రహించాను. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని థియరీ, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదువుతూ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకుంటూ ముందుకుసాగాను. ఇలా.. నవంబర్ నాటికి గేట్ సిలబస్‌ను పూర్తి చేశాను. ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలకు సంబంధించి సొంతంగా నోట్స్ రూపొందించుకున్నాను. ఇది రివిజన్‌కు ఎంతో లాభించింది. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం కూడా విజయానికి దోహదం చేశాయి.

సలహా:
బీటెక్ మూడో సంవత్సరం నుంచి.. గేట్ తేదీకి కనీసం ఆరు నెలల ముందు నుంచి పూర్తిస్థాయిలో ఉద్యుక్తులవ్వాలి. అంతేకాకుండా చివరి నిమిషం వరకు చదవకుండా.. పరీక్షకు రెండు నెలల ముందు సిలబస్ పూర్తి చేసుకుని ఆ తర్వాత సమయాన్ని రివిజన్, మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. విజయాన్ని నిర్దేశించడంలో సమయపాలన కీలక పాత్ర. కాబట్టి ఔత్సాహికులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా నిర్దేశించిన సమయంలో కచ్చితత్వం కూడా సమాధానాలు ఇవ్వడం అలవడుతుంది. ఇలాంటి ప్రణాళికతోనే ప్రిపరేషన్ సరైన మార్గంలో ఉంటుంది.

అకడమిక్ ప్రొఫైల్:
  • 2008లో పదో తరగతి (532 మార్కులు) ఉత్తీర్ణత
  • 2010లో ఇంటర్మీడియెట్ (949 మార్కులు) ఉత్తీర్ణత
  • 2010లో ఏఐఈఈఈలో తొమ్మిది వేల ర్యాంకు; ఎంసెట్‌లో 860వ ర్యాంకు; బిట్‌శాట్ స్కోర్ 293
  • ప్రస్తుతం నిట్-వరంగల్‌లో బీటెక్ ఈఈఈలో ఫైనల్ సెమిస్టర్.
Published date : 29 May 2014 06:02PM

Photo Stories