Skip to main content

క్యాట్-2018 విజేతల మనోగతం..

ప్రఖ్యాత బీస్కూల్స్ ఐఐఎంల్లో ప్రవేశానికి అవకాశం కల్పించే క్యాట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎప్పటిలానే ఐఐటీయన్లు టాప్ పర్సంటైల్ సాధించారు.
అంతేకాదు టాప్ స్కోర్ సాధించిన వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులే! ఇందులో విశేషం ఏమీలేదు.. కానీ, మన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు క్యాట్‌లో మంచి స్కోర్ సొంతం చేసుకొని.. వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. వారిలో ఒకరు చిన్న వయసులోనే పదిహేడేళ్లకే క్యాట్‌లో 95.95 పర్సంటైల్‌తో ఘనత సాధించగా.. మరొకరు బీఆర్క్ చదివి ఐఐఎంల్లో చేరడమే లక్ష్యంగా కష్టపడి 98.97పర్సంటైల్ సొంతం చేసుకున్నారు! క్యాట్ విజేతలు పిన్నవయస్కురాలైన సంహిత, బీఆర్క్ పూర్తిచేసిన జూహీ వల్లభ్ మనోగతం...మీ కోసం

మనసుపెట్టి చదివా: జూహీ వల్లభ్
మాది హైదరాబాద్. నాన్న వి.సునీల్ కుమార్ మార్కెటింగ్ మీడియా కన్సల్టెంట్. అమ్మ కృష్ణ శ్రీ. చదువు పరంగా అమ్మా నాన్న నన్ను నిరంతరం ప్రోత్సహించారు. వారి మద్దతు వల్లే నేను ఈ రోజు క్యాట్‌లో టాప్ పర్సంటైల్ సాధించగలిగాను. ఇంటర్ పాసయ్యాక.. నేను భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో బీఆర్క్ పూర్తిచేశాను. బీఆర్క్ చదివేటప్పుడే నాకు మేనేజ్‌మెంట్ కోర్సుపై ఆసక్తి కలిగింది. వేసవి సెలవల్లో నాన్న సంస్థలో పనిచేయడం కూడా నాకు మేనేజ్‌మెంట్ అంశాలపై ఆసక్తి పెరగడానికి కారణమైంది. దాంతో ఐఐఎంలే లక్ష్యంగా క్యాట్-2018 ప్రిపరేషన్ ప్రారంభించాను. ప్రిపరేషన్‌లో భాగంగా మొదట బేసిక్స్‌పై పట్టుసాధించా. క్యాట్ కోసం కోచింగ్‌లో కూడా చేరాను. పూర్తిగా నూటికి నూరుశాతం మనుసుపెట్టి ప్రిపరేషన్ సాగించా. 20 మాక్ టెస్టులకు హాజరయ్యా. వీటిని విశ్లేషించుకుంటూ.. నా ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకున్నా. సందేహాలు ఎదురైనప్పుడు గూగుల్ సహాయంతో నివృత్తి చేసుకున్నా. మొదట్నుంచీ ఇంగ్లిష్‌పై బాగానే పట్టుంది. దాంతో మ్యాథ్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టా. ఫలితంగా 98.97 పర్సంటైల్ వచ్చింది. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేయాలనుకుంటున్నా..!

ఫైనాన్స్‌పై ఆసక్తి: సంహిత Bavitha
మాది హైదరాబాద్. నాన్న ఎల్‌ఎన్ కాశీభట్ట, అమ్మ గీత చతుర్వేదుల. నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఎక్కువ. దాంతో అమ్మానాన్న, టీచర్ల ప్రోత్సాహంతో పదేళ్ల వయసులోనే పదో తరగతి పూర్తిచేశా. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పదికి పది గ్రేడ్‌లు సాధించా. పదో తరగతి పూర్తయ్యాక ప్రత్యేక అనుమతితో ఇంటర్‌లో చేరి.. ఇంటర్ ఎంపీసీని మంచి మార్కులతో పూర్తిచేశా. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీ(సీబీఐటీ)లో చేరి.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 16 ఏళ్లకే బీటెక్ పట్టా అందుకున్నా. నాకు మొదట్నుంచీ మేనేజ్‌మెంట్ కోర్సుపై ఆసక్తి ఉంది. అందుకే బీటెక్ పూర్తయ్యాక ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో క్యాట్ ప్రిపరేషన్ ప్రారంభించా. తక్కువ సమయంలోనే క్యాట్‌కు హాజరు కావాల్సి వచ్చింది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంపై దృష్టిపెట్టా. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. ప్రశాంతంగా పట్టుదలతో ప్రిపరేషన్ సాగించా. క్యాట్ పరీక్షలో అడిగే వెర్బల్, లాజికల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ.. ఇలా మూడు విభాగాలపైనా దృష్టిపెట్టా. గంటలు గంటలు చదివేదాన్ని కాదు. కానీ, చదివినంత సేపు ఏకాగ్రతతో ప్రిపరేషన్ సాగించడం వల్లే 95.95 పర్సంటైల్ వచ్చింది. ఫైనాన్స్‌ చదవడమే నా లక్ష్యం!
Published date : 09 Jan 2019 03:41PM

Photo Stories