Skip to main content

భవిష్యత్‌లో రోబోటిక్స్‌పై పరిశోధనలు చేస్తా..


పాఠ్యపుస్తకాల పఠనంతో సబ్జెక్టుపై పట్టు వస్తుంది. తద్వారా ప్రశ్నలు ఎలా వచ్చినా సమాధానాలు రాయొచ్చు. ప్రణాళిక ప్రకారం చదివితే సగటు విద్యార్థి సైతం మంచి ర్యాంకు సాధించొచ్చు అంటున్నారు..
ఎంసెట్ - 2013 ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్
పల్లెర్ల సాయిసందీప్‌రెడ్డి.
భవిష్యత్‌లో రోబోలపై పరిశోధనలు చేస్తానంటున్న సాయి సందీప్
సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే..



నేపథ్యం:

మాది ప్రకాశం జిల్లాలోని దర్శి. నాన్న లక్ష్మీనర్సయ్య ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. అమ్మ రాజ్యలక్ష్మి గృహిణి. అక్క సింధూర బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. చదువే పెద్ద ఆస్తి అంటూ.. భుజం తడుతూ అమ్మానాన్న అందించిన ప్రోత్సాహమే మమ్మల్ని బాగా చదువుకునేలా చేసింది. పదో తరగతిలో 563, ఇంటర్‌లో 980 మార్కులు వచ్చాయి. ఎంసెట్‌తోపాటు బిట్స్, ఐఐటీ జేఈఈ రాశా.

పోటీపరీక్షలపైనే:
ఇంటర్మీడియెట్‌లో పరీక్షలకు కొద్దిరోజులు ముందు చదివినా.. మంచి మార్కులు వస్తాయి. ఎంసెట్, ఐఐటీ జేఈఈ, బిట్స్ వంటి పోటీ పరీక్షల విషయంలో అలాకాదు. మొదట్నుంచి సబ్జెక్టులో పట్టుసాధిస్తే కానీ ర్యాంకు సాధించలేం. నేనైతే ఇంటర్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రిపేరవలేదు. ఐఐటీ జేఈఈ కోసం బాగా కష్టపడ్డా. పరీక్షలకు కొద్దిరోజుల ముందు మాత్రం ఇంటర్ కోసం చదివా.

పాఠ్యపుస్తకాలు చదవాలి:
కాలేజీలో ఎంసెట్ కోసం తయారుచేసిన మెటీరియల్ బాగా ఉపయోగపడింది. ర్యాంకు రావడానికి అదే ప్రధాన కారణం. లెక్చరర్స్ ఎప్పటికప్పుడు నా సందేహాలను నివృత్తి చేసేవారు. మెటీరియల్‌తోపాటు పాఠ్యపుస్తకాలు బాగా చదివేవాడిని. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఇచ్చే ప్రశ్నలు పాఠ్యపుస్తకాల నుంచే ఎక్కువగా ఉంటాయి. పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవడం వల్ల సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. ప్రశ్నలు ఎలా అడిగినా.. రాయగల సత్తా వస్తుంది.

భుజం తట్టి ధైర్యం చెప్పేవారు:
కాలేజీలో లెక్చరర్లు, ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించానని గట్టిగా చెప్పగలను. కాలేజీలో నిర్వహించే పరీక్షల్లో ఒక్కోసారి తక్కువ మార్కులు వచ్చేవి. మరికొన్నిసార్లు ఇంకా తక్కువగా వచ్చేవి. అలాంటి సమయంలో ఆత్మవిశ్వాసం సడలకుండా ధైర్యం చెప్పేవారు. అలా చెప్పకుంటే.. నా వల్ల కాదన్న అధైర్యంతో ర్యాంక్ సాధించేవాడిని కాదేమోనని అనిపిస్తుంది.

సమయపాలనతో విజయం:
సమయపాలన, స్మార్ట్ వర్కుతో ఎవరైనా విజయం సాధించొచ్చు. సగటు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే మంచి ర్యాంకు వస్తుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే.. పాఠ్యపుస్తకాలు చదవడమే ఏకైక మార్గం. మ్యాథ్స్ వేగంగా చేయడం ప్రాక్టీసు చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం మొదట్నుంచి టెక్ట్స్‌బుక్స్ చదవాలి. లెక్కల్లో వేగం తగ్గడం వల్లే నేను గణితంలో నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయా. అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే.. ఇంటర్ ఫస్టియర్ నుంచే సాధన చేయాలి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ఇదే నా సలహా.

రోబోటిక్స్‌లో పరిశోధన:
ప్రస్తుతం ఐఐటీ ముంబైలో చేరి, కంప్యూటర్ సైన్స్ పూర్తిచేయడంపైనే ధ్యాసంతా. నాకు రోబోటిక్స్ అంటే.. చాలా ఇష్టం. ఎందుకో తెలియదుగానీ.. చిన్నప్పటి నుంచి వాటిపట్ల తెలియని ఆకర్షణ. భవిష్యత్తులో రోబోలను తయారుచేయడమే కాదు.. పరిశోధనలు చేసి సమాజానికి ఉపయోగపడేలా సరికొత్త రోబోలకు రూపకల్పన చేయాలనేది నా ఆశయం.
Published date : 13 Jun 2013 04:30PM

Photo Stories