Skip to main content

ఆవిష్కరణలే లక్ష్యంగా.. గేట్‌లో టాపర్‌గా: ఈసీఈ టాప్ ర్యాంకర్

మనం రోజూ చూసే టీవీలో వినియోగించే ఐసీని కూడా దిగుమతి చేసుకుంటున్నామనే అసంతృప్తి.. అందుకే భవిష్యత్తులో పరిశోధనలు చేసి దేశీయంగానే కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆలోచన. అందుకు తొలి అడుగు గేట్ అని గుర్తించడం.. లక్ష్యం కోసం ఉద్యోగాన్ని వదిలేసినా.. వెన్నుతట్టి ప్రోత్సహించిన కుటుంబం.. ఇవే గేట్‌లో తన విజయానికి బాటవేసాయంటున్న సుజిత్‌కుమార్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే...

ట్రిపుల్ ఐటీలో బీటెక్:
స్వస్థలం నిజామాబాద్ జిల్లా మంగళ్‌పాడ్. నాన్న బోధన్‌లో బోటనీ లెక్చరర్‌గా పనిచేసే వారు. దీంతో పదో తరగతి వరకు చదువంతా అక్కడే. తర్వాత బోధన్ నుంచి హైదరాబాద్‌కు రావడంతో ఇంటర్ ఓ ప్రయివేట్ కళాశాలలో; బీటెక్ ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో పూర్తిచేశాను.

ఈసీఈ తీసుకోవడానికి కారణం:
వాస్తవానికి 2006లో ఏఐఈఈఈ రాసేవరకు సీఎస్‌ఈ బ్రాంచ్‌పైనే ఆసక్తి ఉండేది. కానీ ఏఐఈఈఈలో ర్యాంకుతో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో సీఎస్‌ఈలో సీటు లభించక ఈసీఈలో చేరాను. చేరిన తర్వాత సబ్జెక్ట్‌పై ఆసక్తి పెంచుకొని చదివా. అదే బ్రాంచ్‌లో గేట్‌కు హాజరయ్యా.

ఉద్యోగంలో చేరాక.. గేట్ ఆలోచన:
ట్రిపుల్ ఐటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తవగానే 2010లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా కీర్తికాల్ సొల్యూషన్స్ అనే సంస్థలో ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. ఆకర్షణీయమైన జీతం వచ్చినా.. ఎందుకో సంతృప్తి ఉండేది కాదు. మనకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాల్లో అధిక శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ఇందుకు కారణం. ట్రిపుల్ ఐటీలో రోబోటిక్స్‌లో చిన్నపాటి రీసెర్చ్ అవకాశం వచ్చిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో భవిష్యత్తులో పరిశోధనలు చేయాలని, తద్వారా దేశీయంగానే కొత్త ఆవిష్కరణలు చేయాలనే సంకల్పం బలపడింది. అందుకోసం ఉద్యోగం చేస్తూనే 2011, 2012, 2013 మూడుసార్లు గేట్ రాశాను. గతేడాది 3 వేల ర్యాంకు వచ్చింది. దాంతో ఈసారి ఎలాగైనా సాధించాలనే తపనతో ఉద్యోగం మానేసి మరీ.. టాప్-10 లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించా. ఈ సంవత్సరం గేట్ పేపర్ కొంత సులభంగా రావడంతో టాప్-10లో నిలుస్తానని అనుకున్నా. అంచనాకు తగట్టుగానే ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.

గేట్ ప్రిపరేషన్ ఇలా:
2011 నుంచి గేట్‌కు హాజరవుతున్నా.. పూర్తి సమయం కేటాయించి, సీరియస్ ప్రిపరేషన్ సాగించింది గతేడాది ఆగస్టు నుంచే. ప్రతిరోజు 8 గంటలు కేటాయించాను. అంతకుముందు రాసినప్పుడు ర్యాంకు రాకపోవడానికి గల లోపాలను గుర్తిస్తూ.. గేట్ ప్రశ్నల తీరును విశ్లేషిస్తూ చదివాను. అంతేకాకుండా ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో కలిసొచ్చింది. ఒక సమస్యను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయడం గేట్‌కు ఎంతో ప్రధానం. ఇలాంటి ప్రశ్నలే పరీక్షలో అడుగుతారు.

ఐఐటీ బాంబే!:
ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే వీఎల్‌ఎస్‌ఐ, అనలాగింగ్ సిగ్నల్ డిజైనింగ్ స్పెషలైజేషన్స్ అంటే నాకు ఆసక్తి. కాబట్టి వీటిని ఆఫర్ చేస్తున్న ఐఐటీ-బాంబే, చెన్నై, ఐఐఎస్‌సీ- బెంగళూరులలో చేరాలని భావిస్తున్నా.

వీఎల్‌ఎస్‌ఐలో పరిశోధనలు:
ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నత చదువులే లక్ష్యం. ప్రధానంగా వీఎల్‌ఎస్‌ఐ విభాగంలో పరిశోధన చేస్తాను. ఆ తర్వాత కొద్దికాలం ఉద్యోగ అనుభవం సంపాదించాక.. సొంత సంస్థను ఏర్పాటు చేసి నలుగురికీ ఉపాధి కల్పించాలనుకుంటున్నా.

అభ్యర్థులకు సలహా:
ముందుగా అభ్యర్థులు గేట్ అంటే కఠినమైన పరీక్ష అనే ఆందోళన వీడాలి. గేట్ సిలబస్ బీటెక్‌లోదే. బీటెక్ సబ్జెక్ట్‌లలోని థియరీని, ప్రాబ్లమ్‌సాల్వింగ్ అప్రోచ్‌ను ఆకళింపు చేసుకుని.. ఆ తీరులో చదివితే సులభంగానే అర్హత పొం దొచ్చు. గేట్ లక్ష్యంగా పెట్టుకుంటే.. బీటెక్ రెండో ఏడాది నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రస్తుతం అన్ని సంస్థలు పీజీ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి బీటెక్ తర్వాత ఉన్నత చదువులపై దృష్టిసారించడం మేలు!

అకడెమిక్ రికార్డ్:
పదో తరగతి (2004) - 579 మార్కులు, రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు
ఇంటర్మీడియెట్ (2006) - 921 మార్కులు
ఎంసెట్-2006లో 602వ ర్యాంకు
ఏఐఈఈఈ-2006లో 1753వ ర్యాంకు
ఐఐఐటీ-హెచ్‌లో బీటెక్ (2010)- 8.4 సీజీపీఏ
Published date : 22 Mar 2013 04:33PM

Photo Stories