Skip to main content

ఆరు లక్షల ప్యాకేజీ వదులుకుని.. ఆరో ర్యాంకు సాధించి : సివిల్ ఇంజనీరింగ్ 6వ ర్యాంకర్

‘‘జీవితంలో పైకిఎదగడానికి ఉన్నత చదువులొక్కటే మార్గం’’ అనే అమ్మానాన్న మాటలే స్ఫూర్తిగా కష్టపడింది. అందుకే ఆరు లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగ ఆఫర్ వచ్చినా.. కాదనుకొంది. గేట్ కోసం కృషి చేసి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆరో ర్యాంకులో నిలిచిన వర్రి నవ్యశ్రీ విజయ గాథ ఆమె మాటల్లోనే..

నిట్ వరంగల్‌లో.. బీటెక్:
పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా హైదరాబాద్‌లోనే! అమ్మ ఓ ప్రయివేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. నాన్న హెచ్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బిల్డర్‌గా ఉన్నారు. ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే చదివా. 2012లో నిట్-వరంగల్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 8.35 సీజీపీఏతో పూర్తిచేశా.

గేట్ ఆలోచన ఎలా:
వాస్తవానికి బీటెక్ చివరి సంవత్సరం వరకు భవిష్యత్తు విషయంలో స్పష్టత లేదు. అమ్మానాన్న విద్యావంతులు కావడం.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువుక్కొటే మార్గమనే వారి మాటలతో గేట్‌వైపు దృష్టి సారించాను. గేట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆరో ర్యాంకు రావడం ఆనందంగాను, గర్వంగానూ ఉంది. నేను పడిన కష్టానికి నిజమైన ప్రతిఫలంగా భావిస్తున్నా. గేట్ కోసం నిట్ వరంగల్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో క్యాపిలరీ టెక్నాలజీ అనే సంస్థ ఆరు లక్షల ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ చేసినా వదులుకున్నాను. కొన్నిసార్లు స్నేహితులు తాము ఫస్ట్ శాలరీ తీసుకున్నామని, ఫలానా కేడర్‌లో ఉన్నామని చెబుతూ.. పంపే మెసేజ్‌లు కొంత ఆందోళన కల్గించేవి. ఆ సమయంలో అమ్మానాన్న అందించిన ప్రోత్సాహం మరువలేనిది.

సివిల్ ఇంజనీరింగ్‌లోనే ఎందుకు?
సివిల్ ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు చేరడం అరుదైన విషయం. కానీ మొదట్నుంచీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే నాకు అనాసక్తి. కోర్ బ్రాంచ్‌లంటే ఇష్టం ఉండేది. దాంతో అమ్మాయిలకు తగిన బ్రాంచ్ ఏదని ఆలోచిస్తే.. ప్రత్యామ్నాయంగా సివిల్ ఇంజనీరింగ్ సరైందనిపించింది. మరోవైపు నాన్న కూడా బిల్డర్‌గా నిర్మాణ రంగంలో ఉన్నారు. దీనికితోడు ఏఐఈఈఈలో నేను సాధించిన ర్యాంకుకు నిట్ వరంగల్‌లో సివిల్ బ్రాంచ్ లభించడం అదృష్టంగా భావించాను.

గేట్ ప్రిపరేషన్.. సాగిందిలా:
థియరాటికల్, ప్రాక్టికల్ అప్రోచ్‌ను సమన్వయం చేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాను. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్‌లో మంచి పట్టు ఉండటంతో.. గేట్‌కు అవసరమైన కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సులభంగా పూర్తి చేయగలిగాను. థియరీ అంశాల కోసం అకడెమిక్ పాఠ్యపుస్తకాలు, వాటి వెనుక ప్రాక్టీస్ బిట్స్‌ను ప్రాబ్లమెటిక్ కోణంలో విశ్లేషించుకుంటూ చదివా. సంబంధిత అంశంలో గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేశా. వీటితోపాటు కోచింగ్ కూడా ఎంతో ఉపయోగపడింది. క్లాస్ రూం కోచింగ్‌ను మినహాయిస్తే రోజుకు నాలుగు గంటలు సొంతంగా చదివాను.

ట్రాన్స్‌పోర్టేషన్‌కే తొలి ప్రాధాన్యం!
స్ట్రక్చర్స్, ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలైజేషన్స్ అంటే ఆసక్తి. ఈ రెండింటిలోనూ ట్రాన్స్‌పోర్టేషన్‌కే తొలి ప్రాధాన్యం. ఎందుకంటే.. ట్రాన్స్‌పోర్టేషన్‌పరంగా ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ ఇబ్బందులను పరిష్కరించేలా, సమాజానికి నా స్థాయిలో సేవచేసే అవకాశం కల్పించే మార్గం ట్రాన్స్‌పోర్టేషన్‌లోనే లభిస్తుంది. ఇక.. ఇన్‌స్టిట్యూట్ పరంగా ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ బాంబేలకు తొలి ప్రాధాన్యమిస్తాను.

భవిష్యత్తు లక్ష్యం... ఐఈఎస్:
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో చేరడమే భవిష్యత్తు లక్ష్యం. వచ్చే జూన్‌లో జరగనున్న పరీక్షకు ప్రిపరేషన్ సాగిస్తున్నాను. ఇందులో విజయం సాధిస్తే సబ్జెక్ట్‌పరమైన సంతృప్తితోపాటు, సమాజ సేవకు కూడా అవకాశం లభిస్తుంది. లేదంటే.. భవిష్యత్తులో సొంతంగా కన్‌స్ట్రక్షన్ కంపెనీని నెలకొల్పుతాను.

ఔత్సాహిక అభ్యర్థులకు సలహా:
నా దృష్టిలో గేట్ అంటే.. నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు గ్రాండ్ యాన్యువల్ టెస్ట్ వంటిది. కాబట్టి బీటెక్ సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో కాన్సెప్ట్యువల్ నాలెడ్జ్ సొంతం చేసుకుంటే గేట్‌లో ఇట్టే రాణించొచ్చు. సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అకడెమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలనే అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రాక్టీస్ చేయాలి. గేట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటే.. మూడో ఏడాది నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. గేట్‌కు ఏటేటా పోటీ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని పకడ్బందీగా చదవాలి.

అకడెమిక్ రికార్డ్:
పదో తరగతి (2006) - 559 మార్కులు
ఇంటర్మీడియెట్ (2008) - 968 మార్కులు
ఎంసెట్-2008 ర్యాంకు - 134
ఏఐఈఈఈ-2008 ర్యాంకు -2 వేలు
నిట్ వరంగల్‌లో బీటెక్ (2012)- 8.35 సీజీపీఏ.
Published date : 22 Mar 2013 04:36PM

Photo Stories