Skip to main content

ఐక్యాట్‌లో అదిరే జీతం సాధించిన శ్రీనాథ్ శర్మ మనోగతం


కాలేజీకు బంక్‌కొట్టి సినిమాలకు వెళ్లటం.. సెలవురోజుల్లో మిత్రులంతా షికార్లు కొట్టడం ఇదీ ఇంజనీరింగ్‌లో చేరిన రెండేళ్లపాటు ఆ కుర్రాడు ఆస్వాదించిన ఆనందం. మూడో సంవత్సరం చదువుతున్నపుడు కెరీర్‌పట్ల ఆలోచన మొగ్గతొడిగింది. అంతే.. సరదాలను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లక్ష్యానికి అనుగుణంగా సిద్ధమయ్యాడు. క్లాసులో చెప్పే పాఠాలను ఆకళింపు చేసుకోవటం.. ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకునేందుకు ఇంటర్న్‌షిప్‌లు.. కాలేజీల్లో జరిగే ఫెస్ట్‌లకు వెళ్లి తమ నైపుణ్యాలను ప్రదర్శించటం. అదే ఆత్మవిశ్వాసంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కొలువు గ్యారంటీ అనుకున్నాడు. కానీ... పలు కంపెనీలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. అలా ఆరునెలలపాటు ఒత్తిడి వేదనకు గురిచేసినా చివరకు అదే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐక్యాట్)లో కొలువు సాధించాడు. శిక్షణ పూర్తయితే రూ.7లక్షలు వార్షిక వేతనంగా అందుకోబోతున్నాడు.. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి జి.శ్రీనాథ్‌శర్మ .

చదువంతా ఇక్కడే
హైదరాబాద్ స్వస్థలం కావటంతో చదువంతా ఇక్కడే. నాన్న వేణుగోపాలశర్మ ప్రజాదర్బార్ పత్రిక ఎడిటర్ . అమ్మ విజయలక్ష్మి గృహిణి. పదోతరగతి వరకూ ఆక్స్‌ఫర్డ్. ఇంటర్ నారాయణ. తొమ్మిదోతరగతి చదివేటపుడు మెరిట్‌స్కాలర్ షిప్ వచ్చింది. స్కూల్‌డేస్‌లో నేర్చుకున్న తబల రోజూ ప్రాక్టీసు చేసేవాణ్ని. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను కూడా. ఇంటర్ చేరాక ప్రోగ్రాం ఇచ్చేందుకు కుదరక వెళ్లట్లేదు. చిన్నప్పటి నుంచి బైక్స్, కార్లంటే చాలా ఇష్టం. వాటిని నడపటం కొత్తగా వచ్చే వెహికల్స్ గురించి తెలుసుకోవటం ఇంకా ఇష్టం. అలా ఎంసెట్‌తో ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ సీటు ఉస్మానియా యూనివర్శిటీలో రావటంతో బిట్స్‌లో సీటొచ్చినా ఇక్కడే చేరా. ప్రస్తుతం క్యాంపస్ ద్వారా ఐక్యాట్‌కు ఎంపిక కావటం ఆనందంగా ఉంది. వాహనాలు తయారుచేసి బయటకు పంపేముందు నిర్వహించాల్సిన విభాగంలో గ్యాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.3లక్షల వార్షిక వేతనం ఇస్తారు. తర్వాత రూ.7లక్షలు లభిస్తుంది. ఇక్కడ నుంచే జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో పేరున్న ఆటోమొబైల్ కంపెనీల్లో పనిచేయాలన్న లక్ష్యానికి చేరుకుంటా.

కాలేజ్‌డేస్ స్వీట్‌మెమరీస్
జీవితంలో మరచిపోలేని రోజులు ఏవైనా ఉన్నాయంటే అవి కాలేజీ డేస్. ఫ్రెండ్స్ సినిమాలు, షికార్లు భలే ఎంజాయ్ చేసేవాళ్లం. మొదట్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, జాబ్ కొట్టాలనే ఆలోచన ఉండేది కాదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ దగ్గర కావడటంతో కాలేజీకు బంక్ కొట్టి మరీ సినిమాలకు వెళ్లేవాళ్లం. బోర్ కొట్టినపుడు అలా క్యాంపస్‌లో తిరిగేవాళ్లం. ఆ సమయంలో గొడవలు రోజూ ఆందోళనలు జరుగుతుండటంతో ఇంజనీరింగ్ పూర్తి చేయగలమా! అనే భయమేసేది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతాయా! లేదా! అనే అనుమానం కూడా ఉండేది. అయితే మాకు ఎలాంటి ఆటంకం లేకపోవటం వల్ల క్లాసులో చెప్పే పాఠాలను జాగ్రత్తగా వినేవాణ్ని.

ప్రాక్టికల్ నాలెడ్జ్ కీలకం
క్లాసులో చెప్పే పాఠాలు మనకు థియరటికల్‌గా మాత్రమే ఉపయోగపడతాయి. ఉద్యోగంలో చేరకముందే అక్కడ అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేర్చుకోవాలి. కాలేజీ సెలవుల్లో తెలిసిన కంపెనీల్లో సొంతగా ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. సాయంత్రం 4 గంటల వరకూ అక్కడ పరిస్థితులు, పనితీరు మెకానికల్ ఇంజనీర్లుగా మేం చేయబోయే పనిగురించి తెలుసుకోవటం చేసేవాణ్ని. నాల్గు తర్వాత యధావిధిగా ఫ్రెండ్స్‌తో చిట్‌ఛాట్. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యానంటే కారణం ప్రాక్టికల్ నాలెడ్జ్. వర్క్‌షాప్‌లను కండక్ట్ చేయటం ద్వారా మెరుగుపరచుకున్న పరిజ్ఞానమే. థర్డ్ ఇయర్‌లో కెరీర్ పట్ల ఆలోచన మొదలైంది. ఫస్ట్, సెంకడియర్‌లో సీనియర్స్‌కు రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహణలో సాయపడేవాణ్ని. వాళ్లు ఏది కావాలంటే అది తీసుకొచ్చేవాణ్ని. కొత్త వెహికల్ తయారుచేసేటపుడు దాని పార్ట్ చెబితే దాన్ని ఎంత కష్టపడైనా తెచ్చేవాణ్ని. క్లాసు రూంలో చెప్పేపాఠాలు కంటే కూడా ప్రాక్టికల్‌నాలెడ్జ్ చాలా అవసరం. అందుకే ఎక్కడా ఏ వర్కుషాప్ జరిగినా, ఇంజనీరింగ్ ఫెస్ట్ నిర్వహించినా అక్కడకు వెళ్లేవాళ్లం. కాలేజీలో ప్రొఫెసర్లు ఎంతగా మన సబ్జెక్టును ఇంప్రూవ్ చేస్తారో.. అంతకు రెట్టింపు సామర్థ్యం పెంపొందించుకునేందుకు సీనియర్లు సాయపడతారు. మూడో సంవత్సరంలో ఉన్నపుడు వెహికల్ తయారీలో సీనియర్లకు సాయం చేసేవాణ్ని. దీంతో ఫోర్త్ ఇయర్‌లో మా బ్యాచ్‌కు కెప్టెన్ కాగలిగాను.

మా బ్యాచ్‌కే ఫస్ట్‌ఫ్రైజ్
Bavitha బెంగుళూరులో గతేడాది జరిగిన ‘బాహా’ ఫెస్ట్‌కు మేం డిజైన్ చేసిన ఆల్‌ట్రైన్ వెహికల్‌కు ఫస్ట్‌ఫ్రైజ్ రావటంతో మా బ్యాచ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. వెహికల్ డిజైనింగ్‌లో నాయకత్వం వహించటం గొప్ప అనుభూతి. దీనివల్ల కొత్తకొత్త పరిచయాలు పెరిగాయి. ఒక టీంతో ఎలా పనిచేయించాలి. భిన్న మనస్తత్వాలున్న చోట ఎలా మెలగాలనేది తెలుసుకున్నా. వెహికల్ డిజైనింగ్ చేసేందుకు అవసరమైన డబ్బుల్లేవు. చివరకు నవయుగ సంస్థ వాళ్లు ఆర్థికసాయం అందించారు. వర్క్‌షాప్స్, ఇంటర్న్‌షిప్, కాలేజ్‌ఫెస్ట్స్ ఇవన్నీ కొత్త విషయాలను తెలుసుకోవటంలో మార్గం చూపాయి.

ఆరునెలలు మనోవేదన
అప్పటి వరకూ నేనుసాధించిన విజయాలు.. సామర్థ్యంతో క్యాంపస్‌లో ఉద్యోగం గ్యారంటీ అనుకున్నా. మెకానికల్ ఇంజనీర్‌గా మారుతి కంపెనీలో కొలువు సంపాదించాలనే లక్ష్యం. ఆ కంపెనీ కూడా ఓయూ విద్యార్థులకే ప్రాధాన్యతనిచ్చేది. దీంతో ఒక ఉద్యోగం నాది అనుకునేవాణ్ని. కానీ.. అనుకున్నట్లుగా ఎంపికకాలేకపోయా. తర్వాత చాలా కంపెనీల నుంచి అదే సమాధానం ఎదురైంది. ఆరు నెలలపాటు తీవ్ర మనోవేదనకు గురయ్యా. నాతోపాటు మా అమ్మానాన్న కూడా బాధపడ్డారు. అయినా ఏం పర్వాలేదంటూ ధైర్యం చెప్పేవారు. ఆత్మవిశ్వాసం ఒక్కటుంటే చాలదు.. దానికి తగినట్లుగా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ముందుగానే తెలుసుకోవాలనే సూత్రం తెలిసింది. నా తప్పిదాలను గుర్తించి సరిదిద్దుకుని కంపెనీలకు అవసరమైన అంశాలపై దృష్టిపెట్టాను.

క్యాంపస్ రిక్రూట్ తీరేవేరు
ఇంటర్ 92 శాతం, బీటెక్ 80 శాతం మార్కులు ఇవి చాలు కదా! అనుకునే వాణ్ని. కానీ కంపెనీ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉండాలనేది నా ఇంటర్వ్యూ అనుభవం నేర్పింది. చాలా సార్లు రాతపరీక్షలోనే అర్హతసాధించలేకపోయా. కారణం వేగం. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన 30 ప్రశ్నలకు ఇచ్చిన సమయంలోగా జవాబులు అదీ తప్పుల్లేకుండా నింపాలి. అక్కడే తరచూ నా ఫెయిల్యూర్ ఉండటంతో.. దానికోసం నెలరోజులపాటు శిక్షణతీసుకున్నా. ఆప్టిట్యూడ్, వెర్బల్ ఈ రెండూ రాత పరీక్షలో కీలకం. అక్కడ సాధించిన మార్కులు ఆధారంగానే అభ్యర్థుల సామర్థ్యం అంచనా వేస్తారు. సింగిల్ ఛైల్డ్ కావటం కూడా కొన్ని సమయాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికగాకపోవటానికి కారణమైంది. కంపెనీ అవసరాలకు తగినట్లుగా తాము ఎక్కడకు పంపితే అక్కడ జాబ్ చేయాలనే ధోరణిలో ఉంటాయి. ఒకే సంతానం అయితే వె ళ్తారో! లేదో! అనే అనుమానం. ఇవన్నీ ఉద్యోగ ఎంపికలో కీలకం. రెజ్యూమె నుంచి బాడీలాంగ్వెజ్ వరకూ అన్నీ క్షుణ్నంగా గమనిస్తారు. రె జ్యుమెలో ఇచ్చిన అంశాలపై అభ్యర్థికి పూర్తి అవగాహన అవసరం. నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ‘నీ గురించి’ చెప్పమని. అక్కడ నేను చెప్పే సమాధానం ఆధారంగా నా మనస్తత్వాన్ని గుర్తిస్తారు.

ఇక్కడే నైపుణ్యాలకు మెరుగు
కాలేజీలో జరిగే వర్క్‌షాప్స్‌లో భాగస్వామ్యం కావటం వల్లనే నేను ఈ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాను. వాస్తవంగా నాకు ఈ అవకాశం కూడా బెంగుళూరు ఫెస్ట్‌లో వచ్చింది. అక్కడ ఇచ్చిన నా రెజ్యూమె ఆధారంగా రాతపరీక్షకు పిలిచారు. గతంలో ఎదురైన అనుభవాలతో శిక్షణ తీసుకుని ఉండటంతో మంచి స్కోరు సంపాదించా. ఇంటర్వ్యూలో నా వ్యక్తిగత సమాచారం అడిగారు. స్కూల్ డేస్ నుంచి మొత్తం వివరించా. తబల సాధన ఎందుకు ఆపావని ప్రశ్నిస్తే. ఇంటర్ తర్వాత చదువుకు ఆటంకమని చెప్పా. ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న అంశాల గురించి అడిగారు. పాఠ్యాంశంలోని అంశాలు.. క్షేత్రస్థాయిలో వాటి అమలుతీరుపై అడిగిన ప్రశ్నలు కొద్దిగా చికాకు అనిపించినా.. అవన్నీ మన ఓర్పును పరిశీలించటానికే అని తర్వాత తెలిసింది. చివరకు కంపెనీకు అవసరమైన సెక్షన్‌లో పనిచేయాలనే ఆలోచనే నాక్కూడా ఉండటంతో ఉద్యోగానికి ఎంపికయ్యా.

ఏ కంపెనీ అయినా తమ సంస్థకు అవసరమైన నిపుణులనే ఎంపికచేసుకుంటున్నాయి. దానికి తగినట్లుగా కాలేజీలో ఉన్నపుడే వాటిని మెరుగుపరచుకోవాలి. దీనికోసం రాత్రిళ్లు నిద్రమానుకుని చదవక్కర్లేదు. క్లాసులతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను ఇంప్రూవ్ చేసుకోండి. ఉద్యోగం సంపాదించిపెట్టడంతో రెజ్యూమె కీలకం. అక్కడ మనం చూపే సృజనాత్మకతకు అనుగుణంగానే ఇంటర్వ్యూలో మార్కులుంటాయి. వీటన్నింటికంటే ముందు రాతపరీక్ష. ఇక్కడ విజయంసాధించాలంటే సాధన అవసరం. ఆప్టిట్యూడ్, వెర్బల్ అంశాల్లో కొంత శిక్షణ ఉంటే తేలిగ్గా గట్టెక్కవచ్చు. మొదట్లో కొన్ని అవాంతరాలు.. ఫెయిల్యూర్స్ ఎదురైనా ఆత్మవిశ్వాసం వీడకుండా ఓర్పు వహిస్తే కెరీర్‌లో ఉన్నతశిఖరం మీదే.
Published date : 20 Aug 2013 12:11PM

Photo Stories