Skip to main content

రిటైర్‌మెంట్ లేని వృత్తి వైద్య రంగం

‘దేశంలో వైద్య రంగంలో, వైద్యవిద్యలో మార్పులు తేవాల్సిన అవసరముంది. కోర్సులు, కరిక్యులం రూపకల్పనలో సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి వైద్య సేవలు అందించేలా చూడాలి’ అంటున్నారు ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) - న్యూఢిల్లీ డెరైక్టర్.. డాక్టర్ మహేశ్ చంద్ర మిశ్రా. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో డాక్టర్ ఎం.సి.మిశ్రాతో గెస్ట్ కాలమ్..
నీట్‌తో పారదర్శకత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) వల్ల మెడికల్ కోర్సుల ప్రవేశాల్లో పారదర్శకత సాధ్యమవుతుంది. ఇది భవిష్యత్తులో విద్యార్థులు ప్రభుత్వ సేవలు, గ్రామీణ సేవల్లో పనిచేసేందుకు సైతం ఉపకరిస్తుంది. ఇంతకాలం ర్యాంకులు పొందలేని విద్యార్థులు రూ.కోటిన్నర, రెండు కోట్ల డొనేషన్ చెల్లించి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరుతున్నారు. పీజీ స్థాయిలో ఆ మొత్తం మూడు, నాలుగు కోట్లుగా ఉంటోంది. ఇలా కోట్ల రూపాయలు వెచ్చించిన విద్యార్థులు.. కోర్సు పూర్తవుతూనే ఖర్చు చేసిన దానికి ప్రతిఫలం ఆశిస్తున్నారు. ఆ క్రమంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొలువుల వైపు దృష్టి పెడుతున్నారు. నీట్‌తో ఈ పరిస్థితులకు స్వస్తి పలకొచ్చు. జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తున్న తరుణంలో ఎయిమ్స్, జిప్‌మర్, ఏఎఫ్‌ఎంసీలను నీట్ పరిధిలోకి తీసుకురాకపోవడం, వీటి కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్న మాట నిజమే. అయితే నీట్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహిస్తోంది. ఎయిమ్స్, జిప్‌మర్, ఏఎఫ్‌ఎంసీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ మేరకు రూపొందినవి.

సేవాతత్పరత పరిశీలించేలా
వైద్య వృత్తి పవిత్రమైన, సేవాతత్పరత అవసరమైన వృత్తి. ఇలాంటి వృత్తిలో అడుగుపెట్టే విద్యార్థుల్లో నిజమైన ఆసక్తిని, సామాజిక సేవా దృక్పథాన్ని, సామాజిక పరిస్థితులపై అవగాహనను పరిశీలించేలా ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చేయాలి. అదే విధంగా ఇతర ప్రొఫెషనల్ కోర్సుల మాదిరిగానే మెడికల్ కోర్సుల్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. వాటిని పరీక్షించే విధంగానూ ఎంట్రన్స్ ఉండాలి. ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో ఈ విధానాన్ని పాటిస్తున్నాం. దశాబ్దాల క్రితం వరకు నిజమైన ఆసక్తి ఉన్నవారే ఈ వృత్తివైపు వచ్చేవారు. కానీ రాన్రాను క్రేజ్, ఆర్థికంగా ఆకర్షణీయమైన కెరీర్ కోణంలో లక్షల మంది వైద్య విద్యవైపు దృష్టి సారిస్తున్నారు. దాంతో ఎంట్రన్స్‌లు నిర్వహించక తప్పడం లేదు. ఎయిమ్స్ ఎంట్రన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. 672 సీట్ల కోసం దాదాపు రెండు లక్షల మంది పోటీ పడుతున్నారు. వీరిలో నిజంగా ఈ కెరీర్‌పై ఆసక్తి ఉన్న వారెవరు? క్రేజ్‌తో వచ్చే వారెవరు? అనేది కనుక్కోవడం చాలా కష్టం. అందుకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాం. ఎంపికైన విద్యార్థులకు మొదటి నెలరోజులు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఈ క్లాసుల్లో మెడికల్ ఎథిక్స్, మెడికల్ సర్వీసెస్ లక్ష్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై అవగాహన పెంపొందిస్తున్నాం.

కరిక్యులంలో మార్పులు
మన దేశంలో వైద్య విద్యలో కరిక్యులం పరంగా పెద్దగా మార్పులు జరగడం లేదు. ఇప్పటికీ అమెరికా, యూరప్, జపాన్ తదితర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఐదేళ్లకు పైమాటే. కానీ మన విద్యార్థులు నాలుగున్నరేళ్లలో కోర్సు పూర్తి చేసినా.. తర్వాత ఇంటర్న్‌షిప్ విషయంలో సమయం వృథా అనే భావనలో ఉండడం సరికాదు. కమ్యూనిటీ హెల్త్‌కేర్, కమ్యూనిటీ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా కరిక్యులంలో మార్పులు తేవాలి. దీనివల్ల విద్యార్థులకు జనరల్ ఫిజీషియన్ నైపుణ్యాలు, నాన్-క్లినికల్ స్కిల్స్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే అలవడుతాయి.

రూరల్ సర్వీస్ తప్పనిసరి చేస్తూనే..
ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రూరల్ సర్వీస్‌ను తప్పనిసరి చేయడం అనేది అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. రూరల్ సర్వీస్‌ను పూర్తి చేసినవారికి పీజీ సీట్ల కేటాయింపులో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. దీనివల్ల ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం నుంచే పీజీ ఎంట్రన్స్‌వైపు దృష్టి పెడుతున్న విద్యార్థుల దృక్పథంలో మార్పు వస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కొరతకు పరిష్కారం కూడా లభిస్తుంది.

సేవకు మొగ్గు చూపాలంటే
ఎంబీబీఎస్, పీజీ వైద్య కోర్సులు పూర్తిచేస్తున్న వారు ప్రభుత్వ సేవల్లో కొనసాగేలా ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న దానికంటే రెట్టింపు ఇవ్వడానికి సైతం సిద్ధమవ్వాలి. రక్షణ దళాలు(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్)లో ఉద్యోగులకు అందిస్తున్న మాదిరిగా స్పెషల్ ఇన్సెంటివ్స్ వంటివి అందించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించే వారికి వీటిని అమలు చేయాలి. దీనివల్ల డాక్టర్ల కొరతకు పరిష్కారం లభిస్తుంది. అగ్రరాజ్యంగా, ధనిక దేశంగా పేరొందిన అమెరికాలో సైతం ఛాలెంజెడ్ ఏరియాస్ (వెనుకబడిన ప్రాంతాలు)లో పనిచేసే వైద్యులకు.. అర్బన్ ఏరియాస్‌లో పనిచేసే వారికంటే రెట్టింపు స్థాయిలో ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది.

ప్రభుత్వాల కేటాయింపులు పెరగాలి
వైద్య విద్యకు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాల కేటాయింపులు పెరగాలి. వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పరిధిలో కొత్త టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌లో సదుపాయాల కొరత, లేదా నాణ్యతలేమి వంటి కారణాలతో ఏటా సదరు టీచింగ్ హాస్పిటల్స్‌లోని సీట్లలో కోత విధించడమో లేదా ఆ విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అనుమతి నిరాకరించడమో చేస్తున్నారు. దీనికి కారణం వైద్య విద్య పట్ల, వైద్య సౌకర్యాల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడమే. ఇది పరోక్షంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు తమ వ్యాధుల చికిత్స కోసం నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. రోజూ పది వేల మంది ఔట్ పేషెంట్స్ వచ్చే ఎయిమ్స్‌లో 55 శాతం మంది బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. రాష్ట్రాల స్థాయిలో మెరుగైన వైద్య సేవల్లో కొరతకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం.

జనరల్ ఫిజీషియన్స్
పీజీ స్థాయిలో స్పెషాలిటీ కోర్సుల విషయంలో.. సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే జనరల్ ఫిజీషియన్స్ సంఖ్య పెరగాలి. ఎందుకంటే.. ప్రస్తుతం రోగులు వ్యాధి నివారణకు సరైన డాక్టర్ ఎవరో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కీళ్ల నొప్పులు వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, తలనొప్పి వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్లడం వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో వారే సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం దానికి సంబంధించి సంప్రదించాల్సిన స్పెషలిస్ట్‌ల విషయంలో సరైన మార్గనిర్దేశం లభిస్తుంది. మేం చదువుకునే రోజుల్లో అధిక శాతం మంది జనరల్ ఫిజీషియన్‌నే స్పెషాలిటీగా ఎంచుకునేవారు. మారుతున్న పరిస్థితులు, కార్పొరేటీకరణ నేపథ్యంలో ఇన్‌స్టంట్ మనీ మేకింగ్ స్పెషాలిటీస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

రిటైర్‌మెంట్ లేని వృత్తి
వైద్య విద్యలోకి అడుగుపెట్టే విద్యార్థులకు ఇచ్చే సలహా.. ఈ వృత్తికి రిటైర్‌మెంట్ లేదు. ఒకవేళ కోర్సులు పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ సర్వీసుల్లో చేరి.. నిబంధనల ప్రకారం నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత ఉద్యోగ రీత్యా రిటైరైనా.. నేర్చుకున్న విద్య, నైపుణ్యాలతో జీవితాంతం వైద్య సేవలు అందిస్తూ సంతృప్తి పొందొచ్చు. నాకు తెలిసి 80 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న డాక్టర్లు ఇప్పటికీ తమ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఈ వృత్తిలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. అకడమిక్‌గా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ వంటివి పూర్తి చేస్తే తప్ప పరిపూర్ణత రాదు. ఆ తర్వాత తమ ప్రాక్టీస్ లేదా ఉద్యోగంలో అడుగుపెట్టి హస్తవాసి మంచిది అనో లేదా ఫలానా డాక్టర్ చేయి పడితే ఏ వ్యాధి అయినా నయమవుతుందనో సమాజంలో పేరు పొందాలి. కాబట్టి సుదీర్ఘంగా, ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించే లక్షణాలు విద్యార్థులు అలవర్చుకోవాలి!!
Published date : 07 Jun 2016 12:05PM

Photo Stories