Skip to main content

సైన్స్ నైపుణ్యాలతో గ్లోబల్ సిటిజన్

‘సైన్స్ నైపుణ్యాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందవచ్చు. అన్ని రంగాల్లోనూ రాణించటంతో గ్లోబల్ సిటిజన్‌గా మారొచ్చు’ అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్‌‌చ - తిరుపతి క్యాంపస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.ఎస్.రావు పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా టీచింగ్ అనుభవంతో ఐఐఎస్‌ఈఆర్ - పుణెలో విజిటింగ్ ఫ్యాకల్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015-16 నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐఎస్‌ఈఆర్-తిరుపతి క్యాంపస్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ వి.ఎస్.రావుతో ఇంటర్వ్యూ...
ప్రస్తుతం ఐఐఎస్‌ఈఆర్-తిరుపతి తాత్కాలిక క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నాం. అయినా అకడమిక్స్ పరంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 50 మంది విద్యార్థులతో బీఎస్ - ఎంఎస్ బ్యాచ్ మొదటి సెమిస్టర్ కూడా చివరి దశకు చేరుకుంది. నవంబరు చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నాం.

మౌలిక సదుపాయాల కల్పన..
తాత్కాలిక క్యాంపస్ అయినప్పటికీ ఐఐఎస్‌ఈఆర్ ప్రమాణాలకు సరితూగే విధంగా లేబొరేటరీల రూపకల్పన చేశాం. ఐఐఎస్‌ఈఆర్-తిరుపతికి సంబంధించి శాశ్వత నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణాలు, మౌలిక వసతులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఫ్యాకల్టీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మొత్తం 12 మంది ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తున్నాం. తిరుపతి క్యాంపస్‌కు మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తున్న ఐఐఎస్‌ఈఆర్-పుణె ఫ్యాకల్టీ సభ్యులను కూడా పిలిపించి బోధన తరగతులు నిర్వహిస్తున్నాం. మరోవైపు కీలకమైన లేబొరేటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

సైన్స్‌తో సుస్థిర భవిష్యత్తు
సైన్స్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన తక్కువగా ఉంటోంది. ఇందులో కెరీర్ ఎంచుకునే వారు స్థిరపడేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వాస్తవమే. అయితే సుస్థిర భవిష్యత్తు కోణంలో సైన్స్ మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం 90 శాతం యువతకు క్రేజీగా మారిన ఇంజనీరింగ్ కోర్సుల్లోని అంశాలకు మూలాలు సైన్స్‌లోనే ఉన్నాయి.

పరిణామాలకు అనుగుణంగా..
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, పరిశోధనలను పరిగణనలోకి తీసుకుంటే బయలాజికల్ సెన్సైస్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పురావటమే దీనికి కారణం. వాతావరణ కాలుష్యం నేపథ్యంలో పరిష్కారాలు కనుగొనేందుకు జీవ శాస్త్రం, పర్యావరణ శాస్త్రాల్లో పరిశోధనలు పెరిగాయి.

అవగాహన పెరగాలి
సైన్స్ రంగంలో విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే అవగాహన రావాలి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌లు, ఫ్యాకల్టీ సభ్యులు కృషి చేయాలి. సైన్స్ ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్ వంటివి నిర్వహిస్తే ఔత్సాహికులను గుర్తించేందుకు వీలుంటుంది. వీరికి సరైన మార్గనిర్దేశనం చేస్తే భవిష్యత్తులో మంచి సైంటిస్ట్‌లు లభిస్తారు. ఇన్‌స్టిట్యూట్ స్థాయితో సంబంధం లేకుండా సైన్స్ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆర్థిక ప్రోత్సాహకాలు
జాతీయ స్థాయిలో ఐఐఎస్‌ఈఆర్, నైపర్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో సైన్స్ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ ద్వారా నెలకు రూ.అయిదు వేలు చొప్పున అయిదేళ్లపాటు స్కాలర్‌షిప్ పొందొచ్చు.

అంతర్జాతీయంగా అవకాశాలు
సైన్స్, అప్లైడ్‌ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం పరిశోధనల స్థాయిలో నిపుణుల కొరత ఎదుర్కొంటున్నాయి. దీన్ని గుర్తించి సైన్స్ రంగంలో కెరీర్ దిశగా ఇప్పటి నుంచే దృష్టి పెడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సైన్స్ కోర్సుల్లో రాణించాలంటే ప్రధానంగా అనువర్తనాధారిత నైపుణ్యాలు, ప్రాక్టికల్ దృక్పథం ఉండాలి. సైన్స్ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవడమే ముఖ్యం.

కోర్సుల్లో ఆసక్తితో..
సైన్స్ కోర్సుల్లో ఆసక్తి ఉంటేనే ప్రవేశించాలి. ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులను లక్ష్యంగా పెట్టుకుని వాటిలో అవకాశాలు రాని కారణంగా ప్రత్యామ్నాయంగా సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకోకూడదు.ఇది విద్యార్థుల భవిష్యత్తుపైనా, ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరుపైనా ప్రభావం చూపుతుంది.
Published date : 20 Nov 2015 01:07PM

Photo Stories