Skip to main content

పరిశోధనల్లో అపార అవకాశాలు..

‘నేటి పోటీ ప్రపంచంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇలా రాణించగల శక్తి ఉందనే విషయాన్ని విద్యార్థినులు గుర్తించి ముందడుగు వేయాలి. అంతేకాని అనవసరపు అపోహలతో ఆగిపోకూడదు’ అని సూచిస్తున్నారు.. ప్రముఖ వైద్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్. హరిత విప్లవ పితామహుడిగా పేరుగడించిన ఎం.ఎస్.స్వామినాథన్ కుమార్తె అయిన సౌమ్య స్వామినాథన్ నాలుగు దశాబ్దాల తన మెడికల్ కెరీర్‌లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థలో (డబ్ల్యూహెచ్‌వో) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌గా నియమితులైన ఆమెతో గెస్ట్‌కాలం...
విద్యార్థినులు చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గుర్తించాలి. అయితే, నేటికీ మనదేశంలో ఉన్నతవిద్య, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థినులు ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపడంలేదు. దీనికి సామాజిక పరిస్థితులతోపాటు, కుటుంబ వాతావరణం కూడా కారణమవుతోంది. ఇప్పటికీ ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే భావన కొందరు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అమ్మాయిల చదువు విషయంలో తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి. మా అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడంతో నచ్చిన చదువులు అభ్యసించేలా ప్రోత్సహించారు.

సైన్స్‌లో అవకాశాలు..
విద్యార్థినులకు సైన్స్ రంగంలో ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిలు పరిశోధనల్లో చేరి, రాణించేలా పలు ప్రోత్సాహకాలు అమలవుతున్నాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. అంతేగానీ రీసెర్చ్‌లో రాణించగలమా? ఏళ్ల తరబడి సమయం వెచ్చించాల్సి ఉంటుందా? తదితర సందేహాలతో ఆగిపోకూడదు. ఉన్నత విద్య పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఇలాంటి సందేహాలతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్న విద్యార్థినులను ఎందరినో చూశాను.

సాంకేతిక రంగాల్లోనూ రాణించేలా..
విద్యార్థినులు సాంకేతిక రంగాల్లోనూ రాణించేందుకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం సాంకేతిక విద్యవైపు విద్యార్థినులను ప్రోత్సహించేలా స్కాలర్‌షిప్స్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇంజనీరింగ్ వైపు మహిళలు దృష్టిపెడుతున్న మాట నిజమే. కానీ, ఎక్కువ మంది క్షేత్రస్థాయి కార్యకలాపాలకు ప్రాధాన్యం లేని బ్రాంచ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు.

వైద్య విద్యకు ప్రాధాన్యం :
ప్రస్తుతం మనదేశంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. వైద్య విద్యకు ప్రాధాన్యంఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. తాజాగా ప్రతిపాదించిన కొత్త మెడికల్ కళాశాలల ద్వారా సమీప భవిష్యత్తులో మరింత మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. అదే విధంగా జిల్లా ఆస్పత్రులను టీచింగ్ హాస్పిటల్స్‌గా మార్చాలనే ఆలోచన కూడా ఈ రంగంలో వైద్యుల కొరతను తీర్చేందుకు మార్గంగా చెప్పొచ్చు.

సేవా దృక్పథం :
మెడికల్ ఎడ్యుకేషన్ ఔత్సాహిక విద్యార్థులు.. సామాజిక సేవా దృక్పథంతోనే ఈ దిశగా అడుగులు వేయాలి. వైద్య వృత్తిని మార్కెట్ వస్తువుగా భావించకూడదు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు పూర్తిచేసేందుకు తాము ఖర్చు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో సంపాదించుకోవాలనే విధంగా ఆలోచిస్తే.. సామాన్య ప్రజలకు ఎప్పటికీ సరైన వైద్య సేవలు అందుబాటులోకి రావు.

మెడికల్ పరిశోధనలపై దృష్టి :
ప్రస్తుతం మెడికల్ కెరీర్ పరంగా కేవలం వైద్య వృత్తి అనే కాకుండా.. రీసెర్చ్ పరంగానూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా కేన్సర్ రీసెర్చ్, హెచ్‌ఐవీ నివారణకు సంబంధించిన రీసెర్చ్ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ దిశగాను మెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు దృష్టిసారించాలి.

ప్రోత్సహించాలి...
విద్యార్థినులు ఉన్నత విద్య వైపు అడుగులు వేసేలా తల్లిదండ్రులు, సమాజంతోపాటు విద్యా సంస్థలు కూడా ప్రోత్సహించాలి. ఉన్నతవిద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ఫలితంగా మహిళలు అన్ని రంగాల్లోనూ అడుగు పెట్టి విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
Published date : 13 Feb 2018 01:01PM

Photo Stories