NEET-UG Paper Leak Scam: నీట్ అవకతవకలు.. రీ టెస్ట్ ఒక్కటే పరిష్కారమా? పరీక్షల విధానం ఇకనైనా మారుతుందా?
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ.
మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్‌కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది.
లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్‌పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది.
NEET-UG Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మాస్టర్ మైండ్ ‘రాకీ’ అరెస్ట్!
అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.
ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం.
నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్‌లో భాగంగా విశ్లేషించారట.
ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్‌చిట్ ఇస్తే సరిపోతుందా?
గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్‌లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది.
Auto Driver Impressive English Speaking Skills: ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ఆటోవాలా.. వీడియో వైరల్
అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం.
నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది.
జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం.
Tags
- NEET
- NEET Scam
- neet paper leakage
- National Entrance Eligibility Test
- neet paper leak 2024 court case news telugu
- NEET Exam 2024 Updates
- NEET-UG 2024 controversy
- NEET-UG 2024
- NEET-UG 2024 paper leakage
- neet exam paper leak
- National Eligibility cum Entrance Test updates
- NEET UG exam paper leaks news
- NTA NEET UG exam latest updates
- Supreme Court decision on NEET UG
- NEET UG exam updates and controversies
- sakshieducationlatest news