NEET UG 2024: నీట్-యూజీ-2024 పరీక్ష విధానం.. బెస్ట్ ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్..
- 2024, మే 5న నీట్ పరీక్ష నిర్వహణ
- వైద్య కోర్సుల్లో ప్రవేశానికి మార్గం..నీట్
- ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు ప్రామాణికం
- పక్కా ప్రిపరేషన్‌తో మెరుగైన స్కోర్ సాధించే అవకాశం
మెడికల్ కోర్సులను లక్ష్యంగా చేసుకుంటూ నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నీట్-యూజీ- 2023కి దేశ వ్యాప్తంగా 20,38,596 మంది హాజరు కాగా.. నీట్-యూజీ-2022కి 13,66,945 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2023లో ఏపీ నుంచి 68,578; తెలంగాణ నుంచి 72,842 మంది నీట్ రాసారు. అదే విధంగా 2022లో ఏపీ నుంచి 65,305 మంది; తెలంగాణ నుంచి 50,392 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే..మొత్తం నీట్ అభ్యర్థుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 1.3 లక్షల మంది పోటీ పడుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో మెడికల్ సీట్లు పెరుగుతుండటంతో 450 నుంచి 500 స్కోర్ వరకు సీట్లు లభిస్తున్నాయి.
అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కి నీట్ స్కోర్
దేశంలోని అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశానికి నీట్-యూజీ స్కోర్‌నే ప్రామాణికం. ఆల్ ఇండియా కోటా పేరిట దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను; రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరిధిలోని సీట్లను; డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు.. ఇలా అన్ని కేటగిరీల యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లో నీట్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్ కల్పిస్తున్నారు. అదే విధంగా ఆయుష్ కోర్సులుగా పిలిచే బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ తదితర కోర్సులకు కూడా నీట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు.
చదవండి: NEET Latest Updates
నీట్ యూజీ స్వరూపం
నీట్-యూజీ పరీక్ష మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో 720 మార్కులకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ.. ఇలా ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు-180 మార్కులకు చొప్పున పరీక్ష జరుగుతుంది. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు (సెక్షన్ ఏ- 35 ప్రశ్నలు, సెక్షన్ బి-15 ప్రశ్నలు) ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్-బిలోని 15 ప్రశ్నలకు గాను పది ప్రశ్నలకు సమాధానాలిస్తే సరిపోతుంది. అంటే.. సెక్షన్-బిలో ఛాయిస్ వెసులుబాటు ఉంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి. పరీక్షను పెన్-పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. అదే విధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంటుంది. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటలు.
సమయం సద్వినియోగం
నీట్ నిర్వాహక సంస్థ ఎన్‌టీఏ.. గత రెండేళ్లుగా పరీక్ష తేదీని దాదాపు ఏడెనిమిది నెలల ముందే ప్రకటిస్తోంది. తాజాగా నీట్ యూజీ-2024 తేదీని కూడా ముందుగానే ప్రకటించింది. 2024, మే 5న నీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అంటే.. విద్యార్థులకు ఆరు నెలలకుపైగా సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. సబ్జెక్ట్‌ల వారీగా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నీట్ పరీక్ష తేదీకి దాదాపు నెల రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో పూర్తిగా నీట్ ప్రిపరేషన్, రివిజన్, మాక్ టెస్ట్‌లకు హాజరు ద్వారా మెరుగైన స్కోర్ సాధించే వీలుంటుంది.
చదవండి: NEET Guidance
ప్రతి సబ్జెక్ట్‌లో 130 మార్కులు లక్ష్యంగా
నీట్‌లో మెరుగైన స్కోర్ కోసం విద్యార్థులు.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకు గాను కనీసం 130 మార్కులు సాధించేలా సిలబస్ అంశాలను ఔపోసన పట్టాలి. అప్పుడే మంచి ర్యాంకు సొంతమవుతుంది. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మార్కులు సాధించేలా కృషి చేస్తే.. మెడికల్ కోర్సుల కల నెరవేర్చుకోవచ్చు.
బోర్డ్ పరీక్షలతో సమన్వయం
ప్రస్తుత సమయంలో నీట్-యూజీకి సన్నద్ధమయ్యే విద్యార్థులు బోర్డ్ పరీక్షలతో సమన్వయం చేసుకోవాలి. బోర్డ్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు ఇంటర్, నీట్ సిలబస్‌లను కలిపి చదువుకోవాలి. బోర్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత.. నీట్ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో వీలైనంత మేరకు రివిజన్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. మోడల్ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి.దీని ద్వారా రివిజన్ సమయంలో సమయం ఆదా అవుతుంది.
నీట్-యూజీ-2024 ముఖ్య సమాచారం
- 2024, మే 5న నీట్ యూజీ పరీక్ష.
- 2024 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి రెండో వారంలో నోటిఫికేషన్.
- పెన్-పేపర్ విధానంలో మూడు గంటల వ్యవధిలో 720 మార్కులకు పరీక్ష.
- నీట్‌లో స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల సీట్ల భర్తీ.
- 450 - 500 స్కోర్‌తో మెడికల్ సీట్లు పొందే అవకాశం.
సబ్జెక్ట్ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు
నీట్ పరీక్ష తేదీ ఖరారైన నేపథ్యంలో.. సబ్జెక్ట్ వారీగా సన్నద్ధతకు, ఆయా సబ్జెక్ట్‌లలో దృష్టి పెట్టాల్సిన అంశాల వివరాలు..
ప్రాక్టీస్‌తో ఫిజిక్స్‌లో బెస్ట్ స్కోర్
నీట్‌లో కొంత క్లిష్టమైన సబ్జెక్టుగా భావించే ఫిజిక్స్‌లో విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: NEET Cutoff Ranks
కెమిస్ట్రీ.. కాన్సెప్ట్స్, రివిజన్
కెమిస్ట్రీలో రాణించేందుకు విద్యార్థులు ఆయా టాపిక్స్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు వెయిటేజీ కొంత ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. దీంతో నిరంతరం పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే..ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్‌కు ఆస్కారం ఉంటుంది.
బోటనీకి ఇలా
నీట్‌లో కీలకంగా భావించే బోటనీలో బెస్ట్ స్కోర్ కోసం విద్యార్థులు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్,సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్‌పై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన,క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి.బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్కిప్ష్రన్,ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి.
జువాలజీ.. ఈ అంశాలు
జువాలజీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు విద్యార్థులు హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ తోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.
Tags
- NEET UG 2024
- NEET
- NEET UG 2024 Biology Syllabus
- NEET UG 2024 Physics Syllabus
- NEET UG 2024 Chemistry Syllabus
- neet ug 2024 exam date and time
- Preparation Strategy for NEET
- Preparation Tips
- NEET 2024 Exam Pattern
- NEET-UG Exam Preparation Guidance
- BDS Admissions
- MBBS Admissions
- medical entrance exam
- AYUSH Courses
- Entrance test for medical courses
- Biology
- Physics
- Chemistry
- BIPC students
- Preparing for NEET
- Sakshi Education Latest News