Skip to main content

వైద్యవృత్తికి సేవాభావమే ముఖ్యం.. డా: ఐ వీ రావ్, వీ సీ, ఎన్టీఆర్ యూహెచ్ఎస్

మన దేశంలో వైద్య విద్యలో నాణ్యతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మన దేశంలో వైద్యవిద్య ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. సాధారణ వైద్య సమస్యలకు పరిష్కారాలు ఇవ్వలేని స్థితిలో మన మెడికల్ గ్రాడ్యుయేట్లు ఉన్నారన్న భావన రోజురోజుకూ పెరిగిపోతోంది. అదే సమయంలో ప్రస్తుతం 1:1500గా ఉన్న డాక్టర్-జనాభా నిష్పత్తిని 1:1000కి పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల మనం డాక్టర్ల సంఖ్యకు, వైద్యవిద్యలో నాణ్యతకు మధ్య సమతుల్యం సాధించాలి. అదేవిధంగా వైద్య విద్య కరిక్యులంను సమూలంగా మార్చి.. పటిష్టంగా అమలు చేయాలి.

ఒక మెడికల్ విద్యార్థి సమర్థుడైన డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?
వైద్య విద్యలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థీ రోగులకు సానుభూతితో, సహనంతో, అంకితభావంతో సేవలందిం చే దృక్పథం అలవర్చుకోవాలి. అదేవిధంగా సూపర్ స్పెషలిస్ట్ కావాలన్న ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని.. ఆ దిశగా మొదటిరోజు నుంచే కష్టపడాలి. సమర్థుడైన డాక్టర్‌గా పేరు తెచ్చుకునేందుకు శ్రమించడం కంటే వేరే మార్గం లేదు.

వైద్య విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరా?
రోగులు, వారి బంధువులతో మాట్లాడడానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను వైద్య విద్యార్థి తప్పనిసరిగా మెరుగుపరచుకోవాలి. రోగికి సమస్య ఏ స్థాయిలో ఉందో చెప్పాలి. రోగాన్ని నయం చేసేందుకు అనుసరిస్తున్న విధానాన్ని, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు.. ఒక వేళ ప్రాణాంతకమై ఉంటే.. అది కూడా వివరించగలగాలి. అదే విధంగా కోలుకుంటారన్న ధైర్యాన్ని వాళ్లలో కలిగించాలి.

వైద్య వృత్తిలో టెక్నాలజీ పాత్ర గురించి చెప్పండి?
మెడికల్ టెక్నాలజీ నిరంతరం మారిపోతోంది. అనేక సరికొత్త వ్యాధి నిర్ధారణ, చికిత్స పరికరాలు వైద్య వృత్తిలో విప్లవాత్మక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతులను, పరిశోధనాశాలలను నిరంతరం అభివృద్ధి చేయాల్సి ఉంది.

మన దేశంలో డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అయినా ప్రభుత్వాలు కొత్త మెడికల్ కళాశాలలను ప్రోత్సహించడం లేదు. దీనిపై మీ అభిప్రాయం?
భారత ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటును తప్పనిసరిగా పరిశీలిస్తోంది. మెడికల్ కళాశాలలు చాలా తక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ప్రభుత్వ రంగంలో కాని, లేదా పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో కాని మెడికల్ కళాశాలలను స్థాపించమని చెప్పింది.

వైద్య వృత్తికి గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు ఎందుకు?
గతంలో కుటుంబం మొత్తానికి ఒకే డాక్టరు సేవలు అందించే వాడు. తాము సేవలందిస్తోన్న కుటుంబాల సంక్షేమమే తమ పరమావధి అని డాక్టర్లు భావించేవారు. దాంతో ఆ కుటుంబంలో అతనికి గౌరవం ఉండేది. సమాజంలో డాక్టర్లను దైవంలా చూసేవారు. ఇప్పుడు వైద్యవృతిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్పెషలిస్టు, లేదా సూపర్ స్పెషలిస్టులు కావాలనుకుంటున్నారు. అవుతు న్నారు. అంతేకానీ రోగులతో మమేకం కాలేకపోతున్నారు.

డాక్టర్ల వేతనాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
యూజీసీ వేతన స్కేల్ అమలు పరిచాక జీతాలు గణనీయంగానే పెరిగాయి. దాంతోపాటు ప్రభుత్వ వైద్యులను ప్రయివేటు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో పెద్దగా అసంతృప్తి ఏమీ లేదు.

ఇంజనీరింగ్‌తో పోలిస్తే వైద్య వృత్తిలో స్థిరపడటానికి సుదీర్ఘ సమయం పడుతోంది. ఇంజనీరింగ్‌లో జీతాలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం?
ఒక పూర్తిస్థాయి డాక్టర్ తయారు కావడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ సమయంలో ఇంజనీర్లు సంపాదన ప్రారంభించి.. జీవితంలో స్థిరపడిపోతారు. వైద్య వృత్తి కొంత భిన్నమైంది. రోగులకు సేవలందిం చాలనే భావన.. వృత్తి పట్ల అంకితభావం కలిగిన యువత ఈ వృత్తిలోకి రావాలి.

మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ, ఫీజులు సరిగా ఉండటంలేదనే ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ స్థాయిలలో పరిశీలనలో ఉన్నాయి. తుది నిర్ణయం రావాల్సి ఉంది.

అమెరికాలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశం తేలిగ్గా లభిస్తుందని.. మన దేశంలో మెడికల్ సీటు సంపాదించడం చాలా కష్టమని అంటారు? నిజమేనా?
అమెరికాలో కానీ, మరే దేశంలో కానీ మెడికల్ సీటు సులభంగా వస్తుందనుకోవడం నిజం కాదు. అమెరికాలో రెసిడెన్సీ రావడం అంత సులభం కాదు. కానీ ఒకసారి రెసిడెన్సీ వచ్చాక కష్టపడి పని చేస్తే మాత్రం ఏదో ఒక స్పెషలైజేషన్‌లో ఫెలోషిప్ రావడం గ్యారెంటీ. మన దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది.

బైపీసీ విద్యార్థులకు మెడిసిన్ కాకుండా.. ఇతర ప్రత్యామ్నాయాలు ఏంటి?
బైపీసీ విద్యార్థ్యులకు మెడిసిన్‌లో సీటు రాకపోయినా.. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బైపీసీ విద్యార్థులు డెంటల్, ఆయుష్ కోర్సులు, అగ్రికల్చరల్ బీఎస్సీ, వెటర్నరీ సెన్సైస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులకు మంచి కెరీర్ అవకాశాలున్నాయి.

బైపీసీ విద్యార్థులకు ఫార్మా, బయోటెక్ మంచి ప్రత్యామ్నాయ కోర్సులంటారు. కానీ వీటిని పూర్తిచేసిన చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ సమస్యను మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఫార్మా, బయోటెక్ చదివిన విద్యార్థులు తమ అర్హతలను పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వాళ్లకి పరిశోధన, బోధనా రంగాలలో అవకాశాలు ఉంటాయి.

ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో వైద్య విద్య ఎలా ఉంది?
చైనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో.. వైద్య విద్య పూర్తిగా థియరీ ఓరియంటెడ్‌గా ఉంటుంది. అక్కడ రోగులతో నేరుగా సంబంధం ఉండదు. అందువల్ల వారు మెడికల్ కౌన్సిల్‌లో ఇంటర్న్‌గా చేరిన తరువాత క్లినికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే మన దేశ విద్యార్థులకు యునెటైడ్ స్టేట్స్ మెడికల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్, యూకేకి చెందిన ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్‌మెంట్ బోర్డు పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. సరైన కోచింగ్ తీసుకున్న మన విద్యార్థులు ఈ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించారు. అమెరికా, యూకేలలో బాగా రాణిస్తున్నారు.

వైద్య విద్యలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు మీ సలహా?
సుదీర్ఘ కాలం పాటు చదవడానికి, కష్టపడి పని చేయడంతోపాటు రోగులకు అంకితభావంతో సేవ చేయాలనే ఆసక్తి ఉంటేనే మెడికల్ కోర్సుల్లో చేరండి. మెడికల్ కోర్సులో చేరాక.. క్లినికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. సమస్యను బట్టి సరైన చికిత్సా ప్రక్రియలను ఉపయోగించడానికి, రోగులతో చక్కగా మాట్లాడడానికి అవసరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. దాంతోపాటు విలువలతో కూడిన వైద్య వృత్తిని చేపట్టడానికి అవసరమయ్యే విజ్ఞానాన్ని సొంతం చేసుకోండి!!

డా॥ ఐ. వి. రావు,
వైస్ ఛాన్సలర్,
ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.
Published date : 10 Jun 2013 05:05PM

Photo Stories