Skip to main content

వైద్యవిద్యలో సమూల సంస్కరణలు తేవాలి.. డా: కె. శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా

ప్రస్తుతం భారతదేశంలో వైద్య విద్య పరిస్థితి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు?
మన వైద్య విద్యలో భారీ సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. మన దేశ ఆరోగ్య రంగ అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులం, శిక్షణా పద్ధతులు, వృత్తి నైపుణ్యాల్లో పూర్తిస్థాయి మార్పులు రావాలి. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో మన దేశ ఆరోగ్య ప్రాధాన్యతలకు, ప్రస్తుతం అందిస్త్తోన్న వైద్య విద్యకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు ఒకే రకంగా లేవు. ఈ ప్రమాణాలను మరింత స్పష్టంగా నిర్వచించాలి, అమలయ్యేలా చూడాలి, పర్యవేక్షించాలి.

మెడిసిన్ చదువుతున్న విద్యార్థి తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి?
వైద్య విద్యార్థులు మొట్టమొదటగా తమ రాష్ట్రంలోని, దేశంలోని వైద్య వ్యవస్థల అవసరాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఒక వైద్య నిపుణునిగా భవిష్యత్‌లో తాము పోషించాల్సిన పాత్రను నిర్వచించుకోవచ్చు. తరువాత తమ అభిరుచులు, సామర్థ్యాలను బట్టి జనరల్ ప్రాక్టీషియన్‌గా ఉండాలో లేదా స్పెషలిస్టుగా మారాలో లేదా తనకిష్టమైన విధంగా కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలో నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమను తాము - తాము ఒక డాక్టరుగా సమాజానికి ఎలా ఉపయోగపడాలి.. వ్యక్తిగతంగా ఎలా సంతృప్తిగా ఉండాలి.. సహచర వృత్తి నిపుణుల గౌరవాన్ని ఎలా పొందాలి.. అని ఆలోచించాలే తప్ప.. ఎంత డబ్బు సంపాదించాలి..? అని కాదు. అంతేకాక వాళ్లు కేవలం ప్రాక్టీస్ చేసే డాక్టర్లుగా ఉండిపోదలుచుకున్నారా.. లేదా పరిశోధన, టీచింగ్ వైపు ఆసక్తి ఉందా అన్న విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి. ఆ రంగాలకు వెళ్లదలుచుకుంటే అకడెమిక్ కెరీర్‌ను ఎంచుకోవచ్చు.

వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు ప్రతిరోజూ ప్రజలతో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి వైద్య విద్యార్థులుగా ఉన్నప్పుడే ఎలాంటి లక్షణాలను, దృక్పథాన్ని, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి?
డాక్టర్‌గా రాణించాలంటే.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎందుకంటే.. డాక్టర్లు నిత్యం రోగులతో మాట్లాడుతూ.. వాళ్ల ఆరోగ్య సమస్యలు, వాటి ప్రభావం గురించి సమగ్రంగా తెలుసుకుంటూ.. చికిత్సను అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరిగా కోలుకుంటారన్న భరోసాను రోగులకు ఇవ్వడంలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. రోగి కేంద్ర బిందువుగా మారిన ప్రస్తుత హెల్త్‌కేర్ విధానంలో.. రోగికి తన సమస్య గురించి వీలైనంత సమాచారం ఇచ్చి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వాముల్ని చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతేకాక ఇప్పుడు రోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్ల నుంచి ఎక్కువ సమాచారాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి డాక్టర్లు చాలా స్పష్టంగా మాట్లాడుతూ రోగి పట్ల సానుభూతి, శ్రద్ద, కరుణ, మర్యాద కలిగి ఉండాలి.

మన దేశంలో మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతులు, లేబొరేటరీ సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని మీరు భావిస్తున్నారా?
మెడికల్ కళాశాలలు తప్పనిసరిగా తమ మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా లేబొరేటరీ సౌకర్యాలను ఆధునికీకరించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి బోధన మరింత పటిష్టపరచాలి. రోగుల భద్రత విషయంలో రాజీపడకుండానే మెరుగైన ప్రాక్టికల్ స్కిల్స్‌ను అందించడంలో స్కిల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ ల్యాబ్స్ విద్యార్థికి ఎంతగానో ఉపయోగపడతాయి.

మన దేశంలో డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టుల కొరత అధికంగా ఉంది. అయినా ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటును ఎందుకు ప్రోత్సహించడం లేదు?
భారత ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొత్త కళాశాలల ఏర్పాటు ప్రతిపాదన చేసింది. ఈ కొత్తవాటిని మెడికల్ కళాశాలలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి. వాటిని జిల్లా ఆసుపత్రులకు అనుసంధానం చేయాలి. ప్రయివేటు కాలేజీలపై ఆధారపడేకంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సరైన ప్రమాణాలు కలిగిన మరిన్ని మెడికల్ కళాశాలలను స్థాపించడం మంచిది.

మెడికల్ కోర్సులకు గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు ఉండడం లేదు. దీనికి కారణమేంటి?
యువతలో మెడికల్ వృత్తికి గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు. సుదీర్ఘ కాలం పాటు చదవాల్సి రావడం.. పోటీ విపరీతంగా ఉండే పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో సీటు వస్తుందో, రాదో తెలియని అనిశ్చితి.. కెరీర్‌లో పని భారం అధికంగా, విశ్రాంతి సమయం తక్కువగా ఉండడం, ప్రభుత్వరంగంలో తక్కువ వేతనాలు.. వంటి కారణాల వల్ల మెడికల్ కోర్సులకు గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు.

వైద్య వృత్తిని దైవ సమానంగా భావిస్తారు. కానీ మెడిసిన్ కోర్సును ఎక్కువ కాలం చదవాలి అనేసరికి చాలామంది ఉత్సుకత చూపడం లేదు. దీనిపై మీ అభిప్రాయం?
నేటి యువతరం ముందు అవకాశాలు అనేకం. తక్కువ వయసులోనే మంచి వేతనాలు లభించే కెరీర్‌లు వారికి అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల 30ఏళ్ల వయసులో ప్రారంభమయ్యే వైద్య వృత్తి కంటే వేరేవాటికే అధిక ప్రాధాన్యతని ఇస్తున్నారు.

ఎంతగా శ్రమించినా.. డాక్టర్ల వేతనాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
వైద్య వృత్తి వైపు యువతను ఆకర్షించాలంటే.. ఆ వృత్తికి సామాజిక గౌరవాన్ని పెంచాలి.. సంతృప్తికరమైన పని వాతావరణాన్ని కల్పించాలి.. దాంతోపాటు మంచి జీతభత్యాలతో కెరీర్‌లో ఎదుగుదలకు హామీ ఉండేలా చూడాలి.

మెడికల్‌తో పోల్చినప్పుడు.. తక్కువ విద్యా సంవత్సరాలు, అధిక వేతనాల వల్ల ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యవైపు ఎక్కువమంది యువత ఆకర్షితులవుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఈ రెండు వృత్తులను అలా పోల్చి చూడడం సరికాదు. ఆ రెండిటికి వాటి వృత్తులకు తగ్గట్టుగా శిక్షణా అవసరాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వైద్య వృత్తికి ఆదాయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం ఇంజనీరింగ్‌కు వచ్చి ఉండొచ్చు. వాస్తవానికి డాక్టర్లకు సుదీర్ఘమైన కెరీర్ ఉంటుంది. వైద్యులు రిటైర్ అవరు. కెరీర్ ఎంపికలో జీతభత్యాలు ఆదాయమే నిర్ణయాత్మకమైతే..ప్రతి ఒక్కరూ.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కావాలనుకుంటారు. అప్పుడు సమాజం పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి యువత తమ, తమ ఆసక్తులు, సామర్థ్యాలను బట్టి వృత్తులను ఎంచుకోవాలే తప్ప సంపాదనపై దృష్టితో కాదు.

ఫీజుల పరంగా చూస్తే ఎన్‌ఆర్‌ఐ/మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ సరైన పద్ధతిలో జరగడం లేదు. అడ్మిషన్లు సరైన విధానంలో జరిపేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
కామన్ పరీక్ష ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి దాని ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలి. మేనేజ్‌మెంట్ కోటాను కూడా అలానే భర్తీచేయాలి. ఫీజులను ప్రభుత్వం ఆమోదించి, వెల్లడించాలి. నిబంధనలు ఉల్లఘించిన వారికి భారీ జరిమానాలు విధించాలి.

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కోర్సుల ఫీజును 2.5 లక్షల వరకు పెంచే ఆలోచన చేసింది. దీనివల్ల పేద గ్రామీణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది కదా!
ఇటీవలకాలంలో మెడికల్ విద్య వ్యయం బాగా పెరిగిపోయింది. ఇప్పటివ రకూ రాయితీ ఇస్తూ వస్తున్న ప్రభుత్వాలు క్రమంగా ఆ విధానాన్ని మార్చుకుంటు న్నాయి. కేవలం ఫీజు చెల్లించలేని కారణంగా అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా వైద్య విద్యకు దూరం కాకూడదు. వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలు, విద్యా రుణాలు మంజూరుచేయాలి.

అమెరికాలో మెడికల్ సీటు పొందడం సులభం. కానీ కోర్సును పూర్తి చేయడం కష్టం. మన దేశంలో మెడికల్ కోర్సులో ప్రవేశం లభించడం కష్టం, కానీ కోర్సును పూర్తి చేయడం సులభం. మన కరిక్యులంలో ఏమైనా మార్పులు తేవాల్సిన అవసరం ఉందంటా రా?
మన దేశం వైద్య, ప్రజారోగ్య అవసరాల రీత్యా మన మెడికల్ కరిక్యులంని, శిక్షణా పద్దతులని మార్చాల్సిన అవసరం ఉంది. అంతేకాని అమెరికాను అనుకరించడానికి కాదు. కేవలం పైపై మెరుగులు కాకుండా.. వైద్య విద్యలో సమూల సంస్కరణలు తేవాల్సి ఉంది. మన అండర్‌గ్రాడ్యుయేట్ విద్యలో ప్రాథమిక వైద్యానికి ప్రాధాన్యత పెంచి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించాలి.

ఒక వేళ ఒక విద్యార్థికి మెడికల్ సీటు వచ్చే విషయంలో కొంత అనిశ్చితి ఉంటే.. అతని ముందున్న ప్రత్యామ్నాయాలేంటి?
ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నాయి. డెంటిస్ట్రీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, హెల్త్ కమ్యూనికేషన్ మంచి అవకాశాలనే కల్పిస్తున్నాయి. అదేవిధంగా రేడియాలజీ నుంచి ఆప్టోమెట్రీ వరకూ.. అనేక వైద్య సంబంధిత కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు ఆయా కోర్సులను ఎంచుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉన్నా.. ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు అనేకం.

ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
ఈ కోర్సులు పూర్తి చేసిన తరువాత విద్యార్థులు వివిధ ఉద్యోగావకాశాలు పొందొచ్చు. లేదా సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టొచ్చు, లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదవొచ్చు. పబ్లిక్ హెల్త్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు.

ఇప్పుడు అనేకమంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో వైద్యవిద్య ఎలా ఉంది?
విదేశాల్లో వైద్య విద్యలో ప్రమాణాలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని దేశాలు వైద్య విద్యలో మంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో మాత్రం అంతగా మెరుగైన విద్య లభించడం లేదు. ప్రమాణాలు బాగా ఉన్న దేశాల్లో చదివినా.. మనదేశంలో అధికంగా ఉండే కలరా, మలేరియా, గుండె జబ్బులు, గర్భాశయ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలపై బోధన, శిక్షణ ఉండవు. ఎందుకంటే ఈ వ్యాధులు అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్దగా కనిపించవు.

చాలామంది యూఎస్‌ఎమ్‌ఎల్‌ఇ ద్వారా అమెరికాలో పీజీ కోర్సుల్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి మీ సలహా?
యూఎస్‌ఎమ్‌ఎల్‌ఇ ద్వారా పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు అమెరికా వెళ్లడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. నా వరకు నేను మన మెడికల్ విద్యార్థులు ఇక్కడే ఉండి సేవలందిస్తే బాగుంటుందని భావిస్తాను!!

డా॥ కె. శ్రీనాథ్ రెడ్డి,
ప్రెసిడెంట్,
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
Published date : 10 Jun 2013 04:45PM

Photo Stories