Skip to main content

‘హస్తవాసి’ మంచిది.. అనిపించుకోవడమే అవార్డు.. డా: పి. శ్రీనివాస్, ప్రిన్సిపాల్, ఓ యు మెడికల్ కాలేజీ

ఎంబీబీఎస్... పేరు ముందు డాక్టర్ అనే మూడక్షరాలతో సమాజంలో సమున్నత గౌరవం పొందేందుకు.. మెడికల్ రంగంలో సుస్థిర భవిష్యత్తుకు తొలి మెట్టు. ఇందుకోసం లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరిన తొలి రోజు నుంచే ఎంసెట్‌లో ర్యాంకు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ఎంబీబీఎస్‌లో సీటు దక్కడం ఒక ఎత్తయితే.. కోర్సులో చేరినప్పటి నుంచే అసలైన సవాలు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు అకడెమిక్‌గా రాణించేందుకు, ఆపై చక్కటి కెరీర్ సొంతం చేసుకునేందుకు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాస్ అందిస్తున్న సలహాలు.

‘ఫలానా డాక్టర్ హస్తవాసి మంచిది’... అని అనిపించుకోవడమే దైవ సమానంగా భావించే వైద్య వృత్తిలో లభించే అరుదైన అవార్డు. లక్షలు సంపాదించే అవకాశం, ప్రొఫెషనల్‌గా పలు మైలురాళ్లు అధిగమించే వీలున్న వైద్య వృత్తిలో..అంకిత భావంతో మెలుగుతూ, సేవా దృక్పథం కలిగి సమాజంలో మంచి పేరు పొందడానికి మించిన రివార్డు మరొకటి ఉండదు. ఎంబీబీఎస్‌లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థి.. అకడెమిక్స్ కంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలివి.

‘జీరో’తో ప్రారంభించాలి:
సాధారణంగా ఎంబీబీఎస్ సీటు దిశగా ఎంసెట్‌లో ర్యాంకు కోసం ఇంటర్మీడియెట్‌లో రెండేళ్లు నిద్రలేని రాత్రులతో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీటు లభించగానే తమ లక్ష్యం నెరవేరిందని భావించి ‘రిలాక్స్’ అవుతారు. కానీ వారు గమనించాల్సింది ఏంటంటే.. ఎంబీబీఎస్‌లో చేరడం మాత్రమే లక్ష్యం కాదు. అసలైన సవాలు ఇక్కడి నుంచే మొదలవుతుంది. సుస్థిర భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలంటే.. తమ అభ్యసనాన్ని ‘జీరో’తో ప్రారంభించాలి. ఇంటర్ బైపీసీ అనేది కేవలం ఎంబీబీఎస్‌కు ఫౌండేషన్ మాత్రమే. దాంట్లో ప్రతిభ ఉందనే ఆలోచనతో ఎంబీబీఎస్‌లోనూ మెరుగైన ప్రతిభ చూపించగలం అనే ధోరణి సరికాదు. ఈ కోర్సులో ప్రతి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. ఎంబీబీఎస్‌లో చేరిన ప్రతి విద్యార్థి ఎంసెట్ కోసం ఎంత శ్రమించారో అంతకు మించి శ్రమను కొనసాగించాలి. ఎంతో శ్రమించి సీటు సొంతం చేసుకున్న విద్యార్థులు.. విశ్రాంతి అనే పదానికి పరిమితి విధించుకోవాలి. ఎంత తక్కువ కాలంలో విశ్రాంతికి స్వస్తి పలికితే అంత మంచిది.

క్లిష్టంగా భావించే సబ్జెక్టులు:
కోర్సులో దాదాపు విద్యార్థులంతా క్లిష్టంగా భావించే సబ్జెక్టులు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, సర్జరీ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనిక్స్, పిడియాట్రిక్స్. వీటిపై పరిపూర్ణ అవగాహన కలగాలంటే అకడెమిక్ బుక్స్ చదువుతూనే అప్లికేషన్ అప్రోచ్ అలవర్చుకోవాలి. కేవలం క్లాస్ రూం లెర్నింగ్‌కే పరిమితం కాకూడదు.

హౌస్ సర్జన్సీ కంటే ముందుగానే..:
ఎంబీబీఎస్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేది కోర్సు పూర్తయ్యాక చేయాల్సిన హౌస్ సర్జన్సీషిప్. దీంతో విద్యార్థులు కోర్సు సమయంలో పేషెంట్లతో ఇంటరాక్షన్‌కు తక్కువ ప్రాధాన్యమిస్తారు. కానీ ఎంబీబీఎస్ స బ్జెక్టుల్లో పట్టు సాధించాలంటే ప్రాక్టికాలిటీదే పెద్దపీట. కాబట్టి విద్యార్థులు నిరంతరం వార్డుల్లో పర్యటించడం, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లతో మమేకం కావడం.. ఒక వ్యాధికి సంబంధించి తాము అకడెమిక్‌గా తెలుసుకున్న లక్ష ణాలు.. వాస్తవంగా అదే వ్యాధికి గురైన రోగులకు సీనియర్లు చికిత్స అందిస్తున్న తీరును పరిశీలించడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. ఇలా అకడెమిక్స్, ప్రాక్టికల్ స్కిల్స్‌ను అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం సాగించాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే నాటికి పరిపూర్ణత సాధించగలరు.

హౌస్ సర్జెన్సీలో అంకితభావంతో:
హౌస్ సర్జెన్సీ.. రోగులను స్వయంగా కలిసే అవకాశం కల్పించే దశ. ఈ దశలో ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణం.. రోగులు చెప్పే విషయాలను విసుగు లేకుండా సహనంతో, ఓర్పుతో వినడం. దీంతోపాటు ఇక వృత్తి పరంగా.. తాము అప్పటి వరకు చదివిన అకడెమిక్ సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా అన్వయిస్తూ రోగులకు తగిన సలహాలు ఇవ్వాలి. ఈ దశ నుంచే అంకిత భావాన్ని కలిగి ఉండాలి.

నిరంతర కృషితోనే:
నిరంతర కృషి, నిత్య పరిశీలన అవసరమైన కోర్సు ఎంబీబీఎస్. అప్పుడే అకడెమిక్స్‌లో పట్టు సాధించగలరు. ఇందుకోసం ప్రతి రోజు తాము క్లాస్ రూంలో నేర్చుకున్న అంశాలను అదే రోజు సొంతంగా పునశ్చరణ చేసుకోవడం అవసరం. క్లాస్ రూం లెర్నింగ్‌కు అదనంగా అయిదారు గంటలు సెల్ఫ్ లెర్నింగ్‌కు తప్పనిసరిగా కేటాయించాలి. బోధన ఆసుపత్రుల్లో చేరిన వారు సొంతంగా నేర్చుకోవడంతోపాటు నిరంతరం వార్డుల పరిశీలన అనే అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
ఆంకిత భావాన్ని గుర్తు చేసే యాప్రాన్:
ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో చేరుతున్న విద్యార్థుల్లో ప్రధానంగా కనిపిస్తున్న లోపం వారిలోని అపరిమితమైన స్వేచ్ఛా ధోరణి. మెడిసిన్ అంటే ఒక పవిత్రమైన వృత్తి అనే భావన కనుమరుగవుతోంది. ఇది వస్త్ర ధారణతోనే కనిపిస్తోంది. అందుకే ఎంబీబీఎస్‌లో చేరిన ప్రతి విద్యార్థి యాప్రాన్(తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్)ను నిరంతరం ధరించాలి. అప్పుడు... ‘తాము ఒక పవిత్రమైన వృత్తిలో అడుగుపెట్టామని, సమాజం తమను దేవుళ్లుగా గుర్తిస్తుంది’ అనే భావన హృదయంలో అనునిత్యం కదలాడుతుంది.

పీజీతోనే పటిష్ట భవిష్యత్తు:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం ఎంబీబీఎస్‌తోనే సుస్థిర కెరీర్‌ను ఆశించలేం. కాబట్టి విద్యార్థులు పీజీని లక్ష్యంగా పెట్టుకోవాలి. పీజీ స్థాయిలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్న నేపథ్యంలో తమకు ఆసక్తి ఉన్న స్పెషాలిటీలో ఎండీ సీటు సొంతం చేసుకోవడం కోసం ఎంబీబీఎస్‌లో చేరిన తొలిరోజు నుంచే శ్రమించాలి. పీజీ సీట్ల పెంపు విషయంలో వైద్య కళాశాలల యాజమాన్యాలు కూడా కొంత చొరవ చూపిస్తే మరింత మంది వైద్యులు భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంసీఐ నిబంధనల ప్రకారం అయిదేళ్లు పూర్తి చేసుకున్న కళాశాలలు పీజీ కోర్సులను ప్రవేశపెట్టొచ్చు. ఇక పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సులూ అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా పూర్తి చేసుకుంటే వైద్య రంగంలో మరింత చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది.

ఎంప్లాయ్‌మెంట్.. దృక్పథమే ఆధారం:
వైద్య విద్యను పూర్తి చేసినవారు ఉపాధి పరంగా ప్రభుత్వ సర్వీసులో చేరాలా? లేదా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరాలా? లేదా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం వారి మానసిక దృక్పథం, వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మూడింటిలో ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పటికీ సేవాభావాన్ని విస్మరించకూడదు. లక్షలు వెచ్చించి పూర్తి చేయాల్సిన కోర్సు మెడికల్ కోర్సు. అంతే స్థాయిలో తిరిగి ఆదాయం ఆశించడం సహజమే. కనీసం 20 శాతమైనా ఉచితంగా సేవలందించేందుకు సిద్ధపడాలి.

అపోహ.. ఆదాయ దృక్పథం.. రెండూ వీడాలి:
చివరగా ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు సలహా ఏంటంటే.. ప్రస్తుతం మెడికల్ రంగానికి సంబంధించి అకడెమిక్‌గా, కెరీర్ పరంగా రెండు ప్రతికూల అంశాలు వేధిస్తున్నాయి. అకడెమిక్‌పరంగా ఉన్న అపోహ ఏంటంటే.. ఈ రంగంలో ఐదేళ్లు ఎంబీబీఎస్, ఆ తర్వాత ఒక ఏడాది హౌస్ సర్జన్సీ, ఆపై మరో ఏడాది రూరల్ సర్వీస్, ఆ తర్వాత మూడేళ్లు పీజీ మొత్తం మీద పదేళ్లపాటు శ్రమిస్తేగానీ సుస్థిర భవిష్యత్తు సొంత కాదు అనే అపోహ. దీన్ని విడనాడాలి. వాస్తవానికి ప్రస్తుత యుగంలో పదేళ్లు కాదు.. కదా.. ప్రతి రోజు ఏదో ఒక కొత్త అంశం నేర్చుకోవాల్సిన పరిస్థితి. దీన్ని గుర్తించాలి. ఇక.. రెండోది ఇలా పదేళ్లపాటు రూ. లక్షలు ఖర్చు పెట్టి గమ్యాన్ని చేరుకున్న వారిలో వ్యాపార దృక్పథం పెరగడం. దీన్ని విడనాడాలి.

డా॥ పి.శ్రీనివాస్,
ప్రిన్సిపాల్,
ఉస్మానియా మెడికల్ కళాశాల
Published date : 10 Jun 2013 05:33PM

Photo Stories