Skip to main content

NEET Exam 2024: నీట్‌ పరీక్షలో దేశవ్యాప్తంగా పలుచోట్ల కాపీయింగ్‌? ఆ సెంటర్‌లో పరీక్ష రాసిన వారందరికీ 720కి 720 మార్కులు

NEET Exam 2024  Medical Entrance Exam Scandal  Authorities Investigating NEET Exam Irregularities

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా గత నెల 5న జరిగిన నీట్‌ ఎంట్రన్స్‌లో పలుచోట్ల గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనేక కార్పొరేట్‌ కాలేజీలు కూడా కాపీయింగ్‌ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున కాపీయింగ్‌ జరిగిందని పేర్కొంటున్నాయి. కొన్ని కాలేజీల్లో ఒకే విధమైన టాప్‌ మార్కులు పలువురికి రావడంపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

720కి 720 మార్కులు.. ఇక్కడే మొదలైన అనుమానాలు
ప్రతిసారీ తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులు వచ్చేవి. కానీ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈసారి టాప్‌ ర్యాంకులు పెద్దగా రాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా నీట్‌లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉండగా ఈసారి 67 మంది ఉన్నారు. ఇంత మందికి నూరు శాతం మార్కులు రావడంపట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్‌లో ఒకే రూమ్‌లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మందికి 720 మార్కులు రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదేమీ  యాదృచ్ఛికం కాదని అంటున్నారు. ఏదో గోల్‌మాల్‌ జరిగిందని అంటున్నారు.  

NEET UG 2024 Topper Sad Story : నీట్ యూజీ-2024 టాప‌ర్‌.. కానీ విధి ఆడిన వింత నాట‌కంలో అనారోగ్యంతో..


720కి 717, 718, 719 మార్కులు ఎలా? 
గతేడాది దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరవగా ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది నీట్‌ రాయగా 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది పరీక్ష రాస్తే 47,371 మంది అర్హత సాధించారు. తెలంగాణలో ఈసారి ఎవరికీ 720కి 720 మార్కులు రాలేదు. ఇక కొందరికి 720 మార్కులకుగాను 717, 718, 719 వంటి మార్కులు వచ్చాయి. కానీ ఈ పద్ధతిలో రావడం సాధ్యం కానేకాదు. 

ఉదాహరణకు ఒక విద్యార్థి 720 మార్కులకు పరీక్ష రాస్తే అందులో ఒక ప్రశ్న తప్పయితే ఐదు మైనస్‌ మార్కులు పడతాయి. అంటే ఆ విద్యారి్థకి 715 మార్కులే వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న రాయకుంటే 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. కానీ 717, 718, 719 మార్కులు ఎలా వస్తాయని పలు కార్పొరేట్‌ కాలేజీల అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మార్కులు వచ్చినట్లు తాము గుర్తించలేదని.. ఉత్తరాది రాష్ట్రాల్లో వెలుగు చూశాయంటున్నారు. కొన్ని పత్రికల ప్రకటనల్లోనూ వాటిని చూసినట్లు చెబుతున్నారు.  

NEET UG-2024 Rank Wise College Details : NEET UG-2024లో ఏ ర్యాంక్.. ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..?


గ్రేస్‌ మార్కులు కలిపారంటూ ప్రచారం... 
720కి 717, 718, 719... ఇలా సాధ్యంకాని మార్కులు ఏ పరిస్థితుల్లోనూ రాకూడదని అంటున్న నేపథ్యంలో ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు కలిపిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు గ్రేస్‌ మార్కులు కలిపారని అంటున్నారు. కానీ ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. కాబట్టి ఇది ఏ మేరకు వాస్తవమనేది తెలియదు. ఇలా కలిపితే తెలుగు రాష్ట్రాల నీట్‌ విద్యార్థులకు కూడా కలపాలి కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులందరినీ చెక్‌ చేశామని, ఎక్కడా తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్‌ మార్కులు కలవలేదంటున్నారు. కాపీయింగ్, గ్రేస్‌ మార్కుల ప్రచారంపై కొందరు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.   

 

Published date : 07 Jun 2024 11:31AM

Photo Stories