Govt. Employees Salary: 40 వేల మందికి పైగా ఉద్యోగులకు సాలరీ లేట్!
ప్రభుత్వ ఉద్యోగమంటేనే ధీమా.. ఒకటో తారీఖు రాగానే బ్యాంకుల్లో జీతం డబ్బులు జమవుతాయి.. ఆ తర్వాత కూడికలు, తీసివేతలు పోను ఉన్నదాంట్లో సర్దుకోవడం ఉద్యోగుల్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులైంది. జీతం ఇచ్చే విషయంలో ప్రభుత్వం రూటు మార్చింది.
ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతం పదో తేదీ దాటిపోతున్నా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితో.. మరే కారణమో కానీ వేతనాలు రాకపోవడంతో ఇంటి, వాహన, వ్యక్తిగత రుణాలు, ఇంటి అవసరాలు, చిట్టీల పేమెంట్లు, విద్యా, వైద్యం ఖర్చులతోపాటు బ్యాంకు కిస్తీలు చెల్లించలేక వారు తలలు పట్టుకుంటున్నారు.
TS New Medical Colleges MBBS Seats 2023 : ఈ మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు వీరికే.. ఎందుకంటే..?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 12 వేల మందికిపైగా ఉపాధ్యాయులు, 12,500 మంది ఉద్యోగులు, 16 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వం వేతనాలు జమ చేస్తుంది. కానీ, జిల్లా ట్రెజరీ కార్యాలయ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏడాదిన్నర కాలంగా ప్రతినెలా 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలోనైనా వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
MBBS Students Ragging: మెడికల్ విద్యార్థులకు ఇది తగునా... ఏడాది సస్పెండ్, హాస్టల్ కి కూడా నో
ఈ–కుబేర్ వచ్చాకే ఇబ్బందులు
ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్ ద్వారా వేతనాలు, పెన్షన్లు చెల్లించడం మొదలైన తర్వాత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జీతాలు ఎప్పుడు ఖాతాల్లో పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారుల అలసత్వం వల్లే జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది వాస్తవమే అయినా దాన్నే కారణంగా చూపి, ఉద్యోగుల వేతనాలు, రిటైర్ట్ ఉద్యోగుల పింఛన్ ఆలస్యంగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
సిబిల్ స్కోర్‌పై ఆందోళన
వేతనాలు సకాలంలో జమకాకపోవడం వల్ల ఖాతాల్లో డబ్బు లేదన్న కారణంతో బ్యాంకుల్లో చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, అపరాధ రుసుము చెల్లిస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ సిబిల్ స్కోర్ తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల మరోసారి రుణాన్ని పొందేందుకు అనర్హులుగా మారుతున్నామని వాపోతున్నారు. వేతనం రెండు, మూడు రోజులు ఆలస్యమైనా ఉద్యోగులు ఏదో విధంగా సర్దుకుపోతారు. కానీ పెన్షన్ పైనే ఆధారపడే తమ పరిస్థితి దయనీయంగా ఉంటోందని రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారు. కనీసం మందులు కొనుక్కోవడానికి చిల్లిగవ్వ ఉండటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలివ్వాలని కోరుతున్నారు.
GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవరు..?