IT Employees: ఐటీ ఉద్యోగులకు బలవంతంగా బదిలీలు.. రంగంలోకి దిగిన కార్మిక శాఖ
చాలా కాలంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అలవాటు పడిన ఐటీ ఉద్యోగులను దాదాపుగా అన్ని కంపెనీలు ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులందరూ ఆఫీసుల బాట పట్టారు. అయితే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు మరో ఝలక్ ఇస్తున్నాయి. ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా రీలొకేట్ చేస్తున్నాయి. దీంతో కార్మిక శాఖ రంగంలోకి దిగింది.
ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) దాఖలు చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు నోటీసు జారీ చేసింది. ముందస్తు నోటీసు, సంప్రదింపులు లేకుండానే 2,000 మందికి పైగా ఉద్యోగులను టీసీఎస్ ఇతర నగరాలకు రీలొకేట్ అవ్వాలని బలవంతం చేసిందని యూనియన్ ఆరోపించింది.
ఈ వ్యవహారంపై ఈనెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లుగా తమకు లభించిన నోటీసును ఉటంకిస్తూ సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, అటువంటి అనైతిక పద్ధతుల నుంచి ఐటీ ఉద్యోగులను రక్షించాలని తాము కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: IT Companies: పెరుగుతున్న నిపుణుల కొరత.. ఏఐతో ఇది మరింత వేగవంతం
2,000 మందికి పైగా నోటీసులు
టీసీఎస్ వివిధ ప్రదేశాలలో 2,000 మందికి పైగా ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు జారీ చేసిందని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ తన ఫిర్యాదులో ఆరోపించింది. "టీసీఎస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను ఎటువంటి నోటీసు, సంప్రదింపులు లేకుండా వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేస్తోందని నైట్స్‌కి 180కి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ చర్యలతో దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బదిలీ ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కంపెనీ బెదిరిస్తోంది. ఈ బలవంతపు బదిలీల వల్ల ఉద్యోగులకు కలిగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనను కంపెనీ విస్మరిస్తోంది" అని హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు.
ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్‌కు ముగింపు
టీసీఎస్ ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ముగింపు పలికింది. ఉద్యోగులందరూ వారంలో ఐదు రోజులపాటు ఆఫీసులకు రావాల్సిందేనని గతేడాది అక్టోబర్ 1న అంతర్గత కమ్యూనికేషన్‌లో ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆవశ్యకతను టీసీఎస్ తమ 2023 వార్షిక నివేదికలో సైతం హైలైట్ చేసింది.
కాగా టీసీఎస్ గతేడాది ఆగస్టు నెల చివరి నుంచే ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది. అందులో కొత్త లొకేషన్‌లో చేరడానికి 2 వారాల సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు.