Free Tailoring Training Center: 70 గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు
నర్సంపేట: నియోజకవర్గంలోని 70 గ్రామాల్లో సెట్విన్, న్యాక్ సంస్థల ద్వారా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 6 మండలాల ఐకేపీ ఏపీఎంలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ బీపీఎల్ కింద ఉన్న మహిళల జీవనోపాధి కోసం నియోజకవర్గంలోని 70 గ్రామాల్లో కుట్టు మిషన్ కేంద్రాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ప్రతీ సెంటర్‌కు 50 మంది చొప్పున మొత్తం 3,500 మందికి సొంత గ్రామంలో ఉచిత శిక్షణతోపాటు ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండి లేబర్ కార్డు (కార్డు తీసుకొని సంవత్సరం అయి ఉండాలి) కలిగిన మహిళలు అర్హులని అన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉచిత కుట్టు మిషన్‌తోపాటు స్కిల్స్ ఉన్న వారికి గీసుకొండ మండలంలోని టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. కంపెనీల్లో ఉపాధి పొందిన మహిళలకు వారి గ్రామాల నుంచి పని చేసే స్థలం వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించి, నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ఇప్పిస్తామని తెలిపారు.
చదవండి: Padmavati Women's University: స్మార్ట్ స్కిల్స్‌పై శిక్షణా శిబిరం