Contract Employees: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హర్షం
గుంటూరు ఎడ్యుకేషన్: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడం ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు పర్చిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. గత పాలకులు ప్రవేశపెట్టిన కాంట్రాక్టు వ్యవస్థలో, ప్రధానంగా విద్యావ్యవస్థలో కాంట్రాక్టు అధ్యాపకులు, ఉపాధ్యాయులు అనే బానిస వ్యవస్థను లేకుండా చేయడంపై వారందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడమనే నూతన ఒరవడికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో 12 నెలలకు వేతనాల చెల్లింపు పద్దతిని ప్రవేశపెట్టడం ద్వారా కాంట్రాక్టు అధ్యాపకులకు భరోసా కల్పించిన సీఎం వైఎస్ జగన్ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగుల జీవితాలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎమ్మెల్సీలు టి.కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ