Telangana News: వీఆర్‌ఏల విద్యార్హతలను బట్టి వివిధ ఉద్యోగాల్లో సర్దుబాటు
సాక్షి, కామారెడ్డి: పూర్వకాలంలో గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. పట్వారీ రెవెన్యూ విధులు నిర్వహించేవారు. భూములకు సంబంధించిన పహ ణీ నిర్వహణతో పాటు భూమిశిస్తు వసూలు వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. పట్వారీని కరణంగా పిలిచేవారు. వారికి సహాయకులుగా సుంకరి, మస్కూరు, నీరడి పనివారలు ఉండేవారు. చెరువులు, కుంటలు, కాలువలకు సంబంధించి నీరడి చూసుకునేవారు. సుంకరి, మస్కూరులు పటేల్, పట్వారీల వెంట ఉండి అన్ని రకాల సహాయాలు అందించేవారు.
తెలంగాణ వచ్చాక..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. భూరికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ధరణి అనే వ్యవస్థను తీసుకువచ్చారు. అంతకుముందే రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ చేపట్టారు. రికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత కొంతకాలానికే వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. జిల్లాలో 178 మంది వీఆర్‌వోలు ఉండగా వారిని ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేశారు.
జిల్లాలో 1,429 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వారికి పేస్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. వారిని విద్యార్హతలను బట్టి వివిధ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఏ శాఖలలో సర్దుబాటు చేస్తారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.