Good News for Government Employees : ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీ.. విధివిధానాలు ఇవే.. అలాగే జీతాలు కూడా..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి జూలై 24వ తేదీన (సోమవారం) సచివాలయంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా(వీఆర్ఏ) పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం పేర్కొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారికి పే స్కేలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు.
అర్హతల ఆధారంగా..
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్‌ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
ఈ సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్‌ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్‌ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది.
ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు.
వీటి ఆధారంగానే పోస్టులు..
రాష్ట్రంలో 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.వీఆర్‌ఏల్లో డిగ్రీ, ఆ పై అర్హత గల వారిని అవసరమైన శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తారు. ఇదే అర్హతతో పురపాలకశాఖకు కేటాయించే వారిని వార్డు అధికారులుగా నియమిస్తారు. ఇంటర్ అర్హత ఉన్న వారికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగాలిస్తారు. పదో తరగతి చదివిన వారిని సబార్డినేట్లు, హెల్పర్లుగా నియమిస్తారు.
కారుణ్య నియామకాలను కూడా..
61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్‌ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్‌ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్‌ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.