Skip to main content

JEE Mains- 2022 : జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ – 2022 షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్చి 1వ తేదీన విడుదల చేసింది.
JEE Mains 2022 Schedule
JEE Mains 2022 Schedule Released

రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్‌లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్‌–1, పేపర్‌–2 లుగా మెయిన్స్‌ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్‌ కోర్సులకు పేపర్‌–1, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశానికి పేపర్‌–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్‌కు పేపర్‌–2ఏను, బీ ప్లానింగ్‌కు పేపర్‌–2బీ నిర్వహిస్తారు. పేపర్‌–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్‌ టెస్టును పెన్ను, పేపర్‌తో ఆఫ్‌లైన్‌ మోడ్‌లో రాయాలి. 

జేఈఈ మెయిన్స్ ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఈ ప్రాంతీయ భాష‌ల్లోనే ప‌రీక్ష‌లు..
పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో  నిర్వహిస్తారు.

ఒకేసారి ఇంటర్‌, జేఈఈ పరీక్షలు.. ఒత్తిడిలో విద్యార్థులు..
ఒక పక్క ఇంటర్మీడియెట్‌ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు.

జేఈఈ మెయిన్స్ మోడ‌ల్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఒకే సమయంలో..
మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జేఈఈ సిలబస్‌లో మాత్రం..
2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్‌లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్‌లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్‌ పూర్తి సిలబస్‌తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జేఈఈ మెయిన్స్ గైడెన్స్‌ కోసం క్లిక్ చేయండి

​​​​​​​జేఈఈ మెయిన్స్ స‌మ‌గ్ర స‌మాచారం ఈ లింక్‌ను కోసం క్లిక్ చేయండి

Published date : 02 Mar 2022 12:05PM

Photo Stories