JEE Main 2023: తుది కీ విడుదల.. లోహిత్ ఆదిత్య సాయికి 300కి 300 మార్కులు
ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన NTA దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24 రాత్రి తుది కీని NTA తన వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు నారాయణ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ పి. ప్రమీల తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు.
చదవండి: అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..
గత జనవరిలో వచ్చిన స్కోర్, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్లలో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు. నెల్లూరుకు చెందిన పి. లోహిత్ ఆదిత్య సాయి 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లోహిత్ పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించాడు. జూన్ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని లోహిత్ తెలిపాడు.
చదవండి: JEE Advanced: రైతు బిడ్డ సంతోష్‌రెడ్డికి ఆలిండియా 4వ ర్యాంక్..నా కోరిక ఇదే..
30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌కు రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్ కనీస కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఏప్రిల్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్ 18వ తేదీన వెల్లడిస్తారు.
చదవండి: JEE Advanced: మా లక్ష్యం ఇదే..మా సక్సెస్ సీక్రెట్స్ ఇవే..