Skip to main content

JEE Advanced 2021 : మా లక్ష్యం ఇదే..మా స‌క్సెస్ సీక్రెట్స్ ఇవే..

సాక్షి, ఎడ్యుకేష‌న్ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)–అడ్వాన్స్‌డ్‌–2021 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు.

ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్‌–10లో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి (4), పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి (5), మొదుళ్ల హృషికేష్‌రెడ్డి (10), సవరం దివాకర్‌ సాయి (11) ర్యాంకులను సాధించారు. రామస్వామి సంతోష్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్‌ వర్మ, ఓబీసీ కేటగిరీలో గొర్లె కృష్ణ చైతన్య ఆలిండియాలో మొదటి ర్యాంకులు సాధించారు.

జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను అక్టోబ‌ర్ 15వ తేదీన‌ పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన మృదుల్‌ అగర్వాల్‌కు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ లభించింది. జోన్లవారీగా చూస్తే.. టాప్‌–100 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్‌ (27), ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ కాన్పూర్‌ (3), ఐఐటీ ఖరగ్‌పూర్‌ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. జోన్లవారీగా టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ జోన్‌లో బాలాజీ సిద్ధార్థ్‌ (126వ ర్యాంక్‌), పట్నాన యశ్వంత్‌ నారాయణ (127వ ర్యాంక్‌) టాప్‌–5లో ఉన్నారు. 

టాప్‌–100లో ఒక్కరికి మాత్రమే..
ఈసారి జేఈఈ ర్యాంకుల్లో విద్యార్థినులు వెనుకబడ్డారు. ఆలిండియా స్థాయిలో టాప్‌–100లో ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ జోన్‌ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాప్‌లో నిలిచింది. తెలుగు విద్యార్థినుల విషయానికి వస్తే ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో పల్లె భావన (107వ ర్యాంకు) అగ్రస్థానం దక్కించుకుంది.

41,862 మందికి అర్హత మార్కులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1,41,699 మంది హాజరుకాగా.. వారిలో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆలిండియా టాప్‌ ర్యాంక్‌ సాధించిన మృదుల్‌ అగర్వాల్‌కు 360 మార్కులకు గాను 348 మార్కులు వచ్చాయి. ఇక మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ రాశారు. వీరిలో సుమారు 7 వేల మంది ర్యాంకులు దక్కించుకున్నారని తెలుస్తోంది.

ఈ తేదీన తొలి విడత సీట్లు కేటాయింపు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంకులు వెలువడడంతో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. అక్టోబ‌ర్‌ 22న మాక్‌ సీట్‌ అలొకేషన్‌–1 చేస్తారు. 24న మాక్‌ సీట్‌ అలొకేషన్‌–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ విద్యా సంస్థలన్నింటిలో మొత్తం 50,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

ర్యాంకర్ల అభిప్రాయాలు ఇలా..
కంప్యూటర్‌ ఇంజనీర్‌ను అవుతా..
మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడమే నా లక్ష్యం. 
                                                                     – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, ఆలిండియా ఐదో ర్యాంకర్‌

ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేస్తా..
మాది వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్‌ చదవా. ఇంటర్‌ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్‌బీఐలో మేనేజర్‌. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్‌ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. 
                                                                       – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి, ఆలిండియా పదో ర్యాంకర్‌

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా..
మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజమండ్రిలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్‌ చదివాను. నాన్న బాపూజీరావు మల్లవరంలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడమే నా లక్ష్యం.
                                                                 – ప్రగళ్లపాటి వెంకటరత్న సాయికుమార్, ఆలిండియా 21 ర్యాంకర్‌

ఏఐలో శాస్త్రవేత్తనవుతా..
మాది పాలకొల్లు. నాన్న త్రినాథరావు.. పారిశ్రామికవేత్త, అమ్మ మోహన కృష్ణకుమారి.. గృహిణి. అన్నయ్య బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. నాకు తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్‌ ర్యాంక్, ఏపీఈసెట్‌లో 9వ ర్యాంక్, జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంక్‌ వచ్చాయి. ఐఐటీ – బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడమే నా లక్ష్యం. తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో శాస్త్రవేత్తనవుతా.
                                                                           – సత్తి కార్తికేయ, ఆలిండియా 33వ ర్యాంకర్‌

సైంటిస్టుని కావాలన్నది నా కల...
మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు. సైంటిస్టును కావాలన్నది నా కల. మొదటి నుంచీ అమ్మానాన్న డోమ్నిక్, విజయలక్ష్మి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. సైంటిస్టుగా మానవ చరిత్రలో బయటకు రాని విషయాలను వెలికితీయాలన్నదే నా లక్ష్యం. నాసాలో సైంటిస్టుగా పనిచేస్తా. తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తా. 
                                                                              – బొంతు మాథ్యూస్, ఎస్టీ కేటగిరీలో 44వ ర్యాంకర్‌

JEE

 

Published date : 17 Oct 2021 03:15PM

Photo Stories