Skip to main content

Bonila Aryan Roshan: నిరుపేద కష్టం తీరింది.. ఐఐటీ విద్యార్థికి కలెక్టర్‌ చేయూత

కోహెడ రూరల్‌ (హుస్నాబాద్‌)/ముషీరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో ఐఐటీలో చేరలేకపోతున్న నిరుపేద విద్యార్థిపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘ఐఐటీలో సీటు.. ఫీజు చెల్లించలేని దుస్థితి’అనే వార్తకు సిద్దిపేట కలెక్టర్‌ మనుచౌదరి స్పందించారు.
Collector Manu Chaudhary helps IIT student

విద్యార్థికి చేయూతనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోణిలా ఆర్యన్‌ రోషన్‌ ఎస్సీ కేటగిరీలో 2,406 ర్యాంకును సాధించాడు. జోసా కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌లోనే తిరుపతి ఐఐటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో సీటు సాధించాడు.

కానీ ఆర్థిక ఇబ్బందులతో ఫీజు కట్టలేక దాతల సాయం కోరాడు. రోషన్‌ పడుతున్న ఇబ్బందులను సాక్షి దినపత్రికలో ప్రచురించగా.. కలెక్టర్, దాతలు కలసి జూలై 26న‌ సమీకృత జిల్లా కార్యాలయంలో అతనికి సహాయం అందజేశారు. ఒక ల్యాప్‌టాప్‌తో పాటు ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫీజు కోసం రూ.36,750 చెక్‌ను అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌తో కలసి అందించారు.

చదవండి: Aryan Roshan: ఐఐటీలో సీటు.. ఫీజు చెల్లించలేని దుస్థితి

అలాగే ఇతర ఖర్చులకు కూడా దాతలు రూ.50 వేలు ఇచ్చారు. తన పరిస్థితి తెలుసుకొని కథనం రాసిన సాక్షి దినపత్రికకు రోషన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, చదువుకునే పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. రోషన్‌పై వచ్చిన కథనానికి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌దురిశెట్టి కూడా స్పందించారు.

ముషీరాబాద్‌ తహసీల్దార్‌ గోవర్ధన్, అలాగే సాక్షి ప్రతినిధికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కథనానికి స్పందించి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు దాదాపు లక్ష రూపాయల వరకు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రోషన్‌కు సాయం అందించారు. విద్యార్థి రోషన్‌ జూలై 27న‌ తిరుపతి ఐఐటీకి బయలుదేరి వెళ్తున్నాడు.

Published date : 27 Jul 2024 12:06PM

Photo Stories