Success Story:తల్లి ఐఏఎస్, తండ్రి ఐపీఎస్... కొడుకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐఎఫ్‌ఎస్
కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు(2015 బ్యాచ్) సాధించి ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికైన సాకేతరాజ్ మూసినపల్లి సక్సెస్ స్టోరీ మీకోసం...
రెండున్నర్రేళ్లు ఉద్యోగం చేశా...
సీబీఎస్‌ఈలో 12వ తరగతి పూర్తి చేశా. తర్వాత లా చదవాలన్న కోరికతో బెంగళూరు నేషనల్ లా స్కూల్, హైదరాబాద్ నల్సార్, కోల్‌కతా ఎన్‌యూజేఎస్, జోధ్‌పూర్ నేషనల్ లా యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశా. అన్ని పరీక్షల్లో అర్హత సాధించా. ఫైనల్‌గా బెంగళూరు నేషనల్ లా కాలేజీలో జాయినై, బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. ఏడాదిపాటు ముంబయిలో తర్వాత ఏడాదిన్నర ఢిల్లీలో ఉద్యోగం చేశా. తర్వాత సెలవు పెట్టి సివిల్స్ రాశా. లా నే ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నా.
మొదటి ప్రయత్నంలో ఎలా సాధ్యమైందంటే..
2013లో ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యింది. లాస్ట్ ఇయర్‌లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యా. కొన్ని నెలలు ఉద్యోగం చేశాక 2014లో లాంగ్ లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. ఢిల్లీలోని వాజీరామ్ సంస్థలో జనరల్ స్టడీస్ కోసం జాయిన్ అయ్యా. కేవలం నెలన్నర్రలోనే కోచింగ్ మానేసి, సొంతంగా ప్రిపేరవడం స్టార్ట్ చేశా. రోజుకు ఇన్ని గంటలని కచ్చితంగా లెక్కపెట్టుకుని చదవలేదు. జనరల్ స్టడీస్, మెయిన్స్‌లో ఆయా అంశాల విస్తృతిని బట్టి సమయ ప్రణాళిక రూపొందించుకున్నా. ఒక్కో అంశానికి తుది గడువు నిర్దేశించుకొని ఆ ప్రకారం చదవడం పూర్తి చేశా.
ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ప్రిపేర్...
ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకేసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ప్రిలిమ్స్‌లో ప్రాచీన, మధ్యయుగ చరిత్ర, జాగ్రఫీ, జనరల్ సైన్స్‌లో అదనంగా చదవాల్సి వచ్చింది. ఇండియన్ లాంగ్వేజెస్‌లో నేను హిందీ తీసుకున్నా. అది 300 మార్కుల పేపర్. దాంట్లో 33 శాతం అర్హత మార్కులు సంపాదించడం తప్పనిసరి. మార్కులను ర్యాంకింగ్‌కు కలపరు. విచిత్రమేమిటంటే ఏటా 8–9 శాతం మంది ఈ పేపర్‌లో తప్పుతున్నారు. అందువల్ల దీన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాలని అర్థమైంది. హిందీ కోసం కోచింగ్ కూడా తీసుకున్నా.
తల్లిదండ్రులే స్ఫూర్తి...
నాకు స్ఫూర్తి అమ్మానాన్నలే. అమ్మ ఎం. ఛాయారతన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యారు. నాన్న రతన్ ఐపీఎస్‌గా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ కష్టపడే తత్వం నుంచి నిత్యం స్ఫూర్తి పొందుతా. ఇంటర్వ్యూకు వెళ్లేముందు వివిధ అంశాలపై వారు క్షేత్రస్థాయి అనుభవాలను చెప్పేవారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్‌లో ఐఏఎస్ కంటే వేతనం ఎక్కువే. గొడవలు జరిగిన తర్వాత... సమస్య వచ్చిన తర్వాత న్యాయవాది రంగంలోకి దిగుతాడు. ఆ కేసు ఏళ్ల తరబడి పట్టొచ్చు. సమస్య వచ్చిన తర్వాత కంటే అలాంటివి రాకుండా చూడటం ముఖ్యం. అది సివిల్ సర్వీసెస్ ద్వారా చేయవచ్చు. అందుకే సివిల్స్‌ను ఎంచుకున్నా.
అందుకే ఐఎఫ్‌ఎస్ తీసుకున్నా....
నాకు అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తి ఎక్కువ. ఏ దేశానికైనా ఇతర దేశాలతో సత్సంబంధాలు చాలా అవసరం. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఇతర దేశాలతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రానున్న 20 ఏళ్లలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగు పరుచుకోవడం భారత్‌కు చాలా అవసరం. అంతర్జాతీయంగా భారత ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందుకు యోగా దినోత్సవం ఒక ఉదాహరణ. అందుకే ఐఎఫ్‌ఎస్ ఎంచుకున్నా.
ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే...
తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది. నా అంచనా ప్రకారం ర్యాంకు 215కు అటుఇటుగా వస్తుందని ఆశించా. కష్టానికి అదృష్టం తోడైతే 14వ ర్యాంకు వచ్చింది. అలాగే సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వివిధ కోచింగ్ సంస్థలు టెస్ట్ సిరీస్ నిర్వహిస్తూ ఉంటాయి. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు ఇస్తారు. తప్పులు చెబుతారు. నేను వారానికి ఒకదానికి మాత్రమే హాజరయ్యాను. రెండు చొప్పున హాజరైతే బాగుండేదని అనిపించింది.