ఇంటర్ జువాలజీ ప్రాక్టికల్ పరీక్షలకు సూచనలు
Sakshi Education
- ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం చాలా ముఖ్యం. జంతుశాస్త్రంలోని వివిధ అంశాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- మూడు గంటల వ్యవధిలో 30 మార్కులకు ఉండే పరీక్షపత్రంలో నాలుగు భాగాలుంటాయి. వానపాము, బొద్దింక, మానవుడు.. వీటిలోని వివిధ వ్యవస్థల పటాలు/నమూనాలను విద్యార్థులకు ఇస్తారు. వీటిలో వివిధ వ్యవస్థలను గుర్తించి, వాటి పటాన్ని గీయాలి. కనీసం నాలుగు భాగాలు గుర్తించాలి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. గుర్తింపునకు ఒక మార్కు, పటానికి మూడు మార్కులు, భాగాల గుర్తింపునకు రెండు మార్కులు ఉంటాయి.
- వానపాములోని మూడు వ్యవస్థలకు సంబంధించి జీవి ఖండితాలను గుర్తించాలి. ఆయా వ్యవస్థల్లోని భాగాలను, అవి విస్తరించి ఉండే ఖండితాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
- బొద్దింక ముఖ భాగాలు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ పటాలను కూడా సాధన చేయాలి.
- మానవునికి సంబంధించి జీర్ణ, ధమని, సిర, పురుష-స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సిలబస్‌లో ఉన్నాయి.
- రెండో భాగానికి అయిదు మార్కులు కేటాయించారు. ఇచ్చిన శాంపిల్స్‌లో పిండిపదార్థాలు, గ్లూకోజ్, కొవ్వు పదార్థాలను, ఆల్బుమిన్‌ను గుర్తించాలి. అదే విధంగా పిండి పదార్థాల జీర్ణక్రియలో లాలాజల అమైలేజ్ పాత్రను నిరూపించాలి.
- మూడో భాగంలో ఏ, బీ, సీ, డీ, ఈ.. క్రమంలో అమర్చిన స్పాటర్స్‌ను గుర్తించి, పటాన్ని గీయాలి. గుర్తింపు లక్షణాలను రాయాలి. ఈ భాగానికి 14 మార్కులు కేటాయించారు. వీటిలో అకశేరుకాల స్లైడ్లు, నమూనాలు, కణజాల స్లైడ్లు, సకశేరుకాల స్లైడ్లు, సకశేరుకాల నమూనాలు, కీళ్లు వంటి వాటిని ఇచ్చారు.
- సిలబస్‌లోని అంశాలను విపులంగా సాధన చేయాలి. అధ్యాపకుల సలహాలు తీసుకొని, వేటిని గుర్తింపు లక్షణాలుగా రాయాలో తెలుసుకోవాలి.
- నాలుగో భాగం రికార్డుకు సంబంధించినది. దీనికి అయిదు మార్కులు.
- కె.శ్రీనివాసులు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
Published date : 28 Jan 2016 02:27PM